‘ఐటీ గ్రిడ్స్‌’కు సిట్‌ తాళం

9 Mar, 2019 02:55 IST|Sakshi

మరోసారి తనిఖీలు చేసి కార్యాలయాన్ని సీజ్‌ చేసిన అధికారులు

ఏపీ పోలీసులు రాకుండా ముందు జాగ్రత్తగానే.. సంస్థ డైరెక్టర్‌ అశోక్‌ కదలికలపై నిఘా

ఏ క్షణమైనా అరెస్ట్‌ చేసే అవకాశం.. ఓ మంత్రి సంరక్షణలో ఉన్నట్లు ప్రచారం  

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలతోపాటు తెలంగాణ ప్రజల వ్యక్తిగత సమాచారం చోరీ చేసిన టీడీపీ యాప్‌ (సేవామిత్ర) తయారీ సంస్థ ఐటీ గ్రిడ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌పై నమోదైన కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) దర్యాప్తు ముమ్మరం చేసింది. శుక్రవారం సిట్‌ బృందం హైదరాబాద్‌ మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీలోని ఐటీ గ్రిడ్స్‌ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించింది. తరువాత రెవెన్యూ అధికారుల సమక్షంలో కార్యాలయానికి సీల్‌ వేసి సీజ్‌ చేసింది. కార్యాలయంలోకి ఎవరూ రాకుండా కొందరు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసింది.

ఏపీ పోలీసులు రాకుండా...
ఈ కేసు దర్యాప్తు కోసం తెలంగాణ ప్రభుత్వం ‘సిట్‌’ఏర్పాటు చేయగానే అందుకు పోటీగా ఏపీ సర్కారు సైతం రెండు సిట్‌ లను వేసిన సంగతి తెలిసిందే. పైగా ఐటీ గ్రిడ్స్‌పై దాడుల సందర్భంగా ఏపీ పోలీసులు ఈ కేసులోని ఫిర్యాదుదారుడు లోకేశ్వర్‌రెడ్డిని తమకు అప్పగించాలంటూ హడావుడి చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ సిట్‌ బృందాలు హైదరాబాద్‌లోని ఐటీ గ్రిడ్స్‌ కార్యాలయంలో సోదాలు నిర్వహించకుండా చూసేందుకు ముందుజాగ్రత్త చర్యగా తెలంగాణ పోలీసులు కార్యాలయాన్ని సీజ్‌ చేసినట్లు సమాచారం. దీనివల్ల ఎవరైనా ఇక ఐటీ గ్రిడ్స్‌ కార్యాలయంలోకి ప్రవేశించాలంటే న్యాయస్థానం అనుమతి తప్పనిసరి.

అశోక్‌ కదలికలపై నిఘా..
ప్రజల వ్యక్తిగత వివరాల చోరీకి సంబంధించిన అంశం కావ డంతో ఈ కేసును తెలంగాణ పోలీసులు అత్యంత ప్రతిష్టాత్మ కంగా తీసుకున్నారు. ముఖ్యంగా కేసు దర్యాప్తు బృందానికి నేతృత్వం వహిస్తున్న ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర ఇప్పటికే ఓ బృందాన్ని విజయవాడకు పంపినట్లు సమాచారం. ఇందులో భాగంగానే పరారీలో ఉన్న ఐటీ గ్రిడ్స్‌ డైరెక్టర్‌ అశోక్‌ కదలికలపై సిట్‌ బృందానికి సమాచారం అందిందని తెలిసింది. తాము అశోక్‌ను ఏ క్షణంలోనైనా అరెస్టు చేస్తామని సిట్‌ బృందం ధీమాగా ఉంది. ఏపీకి చెందిన ఓ మంత్రి సంరక్షణలో అశోక్‌ ఉన్నాడని ప్రచారం జరుగుతోంది.

సిట్‌ కార్యాలయం మార్పు..
ఐటీ గ్రిడ్స్‌ దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన సిట్‌ బృందం కార్యాలయాన్ని మార్చారు. తొలుత డీజీపీ కార్యాలయం నుంచే సిట్‌ పనిచేస్తుందని ప్రకటించారు. కానీ శనివారం నుంచి ఈ కార్యాలయం గోషామహల్‌లో నుంచి విధులను నిర్వహించనుంది. గోషామహల్‌ పోలీస్‌ గ్రౌండ్స్‌లోని సిటీ సెక్యూరిటీ వింగ్‌ (సీఎస్‌డబ్లూ)లో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. 

ఇవి చదవండి : 

సవాల్‌ స్వీకరిస్తే.. డేటా చోరీ నిరూపిస్తా..!

అప్పుడూ.. ఇప్పుడూ సేమ్‌ టు సేమ్‌!

మరిన్ని వార్తలు