పరీకర్‌ నుంచే మొదలెట్టండి | Sakshi
Sakshi News home page

పరీకర్‌ నుంచే మొదలెట్టండి

Published Sat, Mar 9 2019 2:56 AM

Start Probe With Manohar Parrikar - Sakshi

జైపూర్‌(ఒడిశా): రఫేల్‌ ఒప్పంద పత్రాల మాయంపై విచారణ గోవా సీఎం మనోహర్‌ పరీకర్‌ నుంచే ప్రారంభం కావాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ అన్నారు. శుక్రవారం పణజిలో జరిగిన పార్టీ బూత్‌ కార్యకర్తల సమావేశంలో రాహుల్‌∙మాట్లాడారు. గోవాలో బీజేపీ ప్రభుత్వం ఉనికిలో లేకుండా పోయినట్టే రఫేల్‌ పత్రాలు కూడా మాయమయ్యానని ఎద్దేవా చేశారు. ‘ఆ పత్రాలు తన వద్దే ఉన్నాయంటూ గతంలో పరీకరే చెప్పారు. అందుకే వాటి కోసం సాగే దర్యాప్తు పరికర్‌ నుంచే ప్రారంభం కావాలి’ అని రాహుల్‌ అన్నారు. కాగా, పరీకర్‌ రక్షణ మంత్రిగా ఉన్నపుడే ప్రభుత్వం రఫేల్‌ ఒప్పందం కుదుర్చుకుంది.

దీంతోపాటు ఈ ఒప్పంద పత్రాలు కొన్ని కనిపించడం లేదంటూ ఇటీవల కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ ‘రఫేల్‌’ డీల్‌ ద్వారా అనిల్‌ అంబానీకి లబ్ధి చేకూర్చేందుకు అధికారుల స్థాయి చర్చలను పట్టించుకోకుండానే ఒప్పందం సిద్ధం చేశారని రాహుల్‌ ఆరోపించారు. కొరాపుట్‌ జిల్లా జైపూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. యూపీఏ హయాంలో కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేసి, రూ.30వేల కోట్ల మేర అంబానీకి లాభం చేకూర్చేందుకు మోదీ కాంట్రాక్టు సిద్ధం చేశారంటూ ఓ ఆంగ్ల పత్రికలో కథనం వచ్చిందన్నారు.

బీజేపీకి దోచిపెడుతున్నారు: మమత
కోల్‌కతా: ప్రభుత్వ ధనాన్ని ప్రధాని మోదీ బీజేపీకి దోచి పెడుతున్నారని బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. రఫేల్‌ ఒప్పంద పత్రాలనే పరిరక్షించలేని ఈ ప్రభుత్వం దేశాన్ని ఎలా కాపాడగలుగుతుందని ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ఆమె శుక్రవారం కోల్‌కతాలో ప్రారంభించారు. ‘ఇంతకుముందు బీజేపీ వాళ్లకు తినడానికి తిండి కూడా ఉండేది కాదు. రఫేల్‌ డీల్, నోట్ల రద్దు ద్వారా ప్రజాధనాన్ని లూటీ చేసిన బీజేపీ నేతలు ఇప్పుడు బైక్‌లు కొంటున్నారు’ అంటూ విమర్శించారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో కశ్మీర్‌లో హింసాత్మక ఘటనలు 210 శాతం పెరిగాయంటూ ఆమె.. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైతే అక్కడ ప్రశాంతత ఏర్పడుతుందని చెప్పారు.

Advertisement
Advertisement