ఖరీఫ్‌కు ఊపిరి.. సాగర్‌కు కృష్ణమ్మ

19 Aug, 2018 01:19 IST|Sakshi
శనివారం రాత్రి శ్రీశైలం డ్యామ్‌ గేట్లు ఎత్తడంతో సాగర్‌వైపు పరుగులు తీస్తున్న కృష్ణమ్మ

  శ్రీశైలం ప్రాజెక్టు 8 గేట్లు ఎత్తివేత

  నాగార్జున సాగర్‌ వైపు కృష్ణమ్మ...

  2.32 లక్షల క్యూసెక్కుల ప్రవాహం

  172 టీఎంసీలకు చేరిన నిల్వ

  నిండేందుకు మరో 140 టీఎంసీలు అవసరం

  200 టీఎంసీలకు చేరిన శ్రీశైలం నిల్వలు

  3.53 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

  ఆయకట్టు నీటి కోసం కృష్ణా బోర్డుకు ఇండెంట్‌ సమర్పించిన రాష్ట్ర ప్రభుత్వం  

సాక్షి, హైదరబాద్‌: ఖరీఫ్‌ ఆయకట్టు ఆశలను మోస్తూ నాగార్జున సాగర్‌ వైపు కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. తడారిన గొంతుల్ని తడిపేందుకు.. ఆయకట్టు పంటలకు ప్రాణం పోసేందుకు వరద పోటెత్తుతోంది. చాలా రోజుల తర్వాత శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండిన నేపథ్యంలో 8 గేట్లు పైకెత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో శనివారం సాయంత్రానికి ప్రాజెక్టులోకి 2.32 లక్షల క్యూసెక్కుల మేర ప్రవాహం నమోదైంది. ఈ ప్రవాహం ఆదివారానికి మరింత పెరిగే అవకాశం ఉంది. భారీ వరదకు సాగర్‌ మట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 590 అడుగులకు గానూ 532 అడుగుల్లో 172.27 టీఎంసీల నిల్వలున్నాయి. 

వచ్చేదంతా సాగర్‌కే.. 
కృష్ణానదీ బేసిన్లో సాగర్‌ ఎగువన ఉన్న ప్రాజెక్టులన్నీ జలకళతో ఉట్టిపడుతున్నాయి. ఎగువ కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్‌ జలాశయాలు నిండటంతో వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వదులుతున్నా రు. దీంతో జూరాలకు రోజూ స్థిరంగా 1.38 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదవుతోంది. ఈ నీటిని దిగువ శ్రీశైలానికి వదలడం, ఈ ప్రవాహానికి సుం కేసుల నుంచి వస్తున్న వరద తోడవడంతో శ్రీశైలంలోకి 3.53 లక్షల క్యూసెక్కుల మేర ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ 215 టీఎంసీలకు గానూ 200 టీఎంసీలకు చేరడంతో శనివారం ఉద యం ఆరుగేట్లు ఎత్తి స్పిల్‌వే ద్వారా 1.59 లక్షల క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేశారు. సాయంత్రం మరో 2 గేట్లు ఎత్తారు. దీనికి అదనంగా కుడి, ఎడమ కాల్వల పవర్‌హౌస్‌ల ద్వారా ఏపీ, తెలంగాణ 72 వేల క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నాయి.

కల్వకుర్తికి 2,400, హంద్రీనీవాకి 2,025, పోతిరెడ్డిపాడు ద్వారా 26 వేల క్యూసెక్కుల నీటి వినియోగం జరుగుతోంది. శ్రీశైలం నుంచి నీటి విడుదలతో సాగర్‌కు శనివారం సాయంత్రానికి  2.32 లక్షల క్యూసెక్కుల మేర ప్రవా హం వస్తోంది. దీంతో ప్రాజెక్టులో నిల్వలు 312 టీఎంసీలకు గానూ 172.27 టీఎంసీలకు చేరాయి. మరో 140 టీఎంసీలు చేరితే ప్రాజెక్టు నిండనుంది. ఎగువ ప్రాజెక్టుల నుంచి స్థిరంగా ప్రవాహాలు కొనసాగుతుండటం, భారీ వర్షాలు కురుస్తుండటంతో ఇకపై వచ్చిన ప్రవాహాలు వచ్చినట్లుగా సాగర్‌కు చేరనున్నాయి. ఇవే ప్రవా హాలు కొనసాగినా 15 రోజుల్లో ప్రాజెక్టు నిండే అవకాశాలున్నాయి. ఒకవేళ ఎగువ వరద ఆగినా నదీ గర్భంలోనే 100 నుంచి 120 టీఎంసీలు ఉంటాయ న్న అంచనా సాగర్‌ ఖరీఫ్‌ఆశలను సజీవం చేస్తోంది.

సాగర్‌ అవసరం.. 52.50 టీఎంసీలు 
నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులో నిల్వలు పెరు గుతుండటంతో నీటి అవసరాలపై కృష్ణా బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం ఇండెంట్‌ సమర్పించింది. మొత్తంగా ఈ సంవత్సరం నవంబర్‌ వరకు తాగు, సాగు నీటి అవసరాలకు కలిపి 52.50 టీఎంసీలు కావాలని కోరింది. ఇందులో సాగర్‌ కింద 6.25 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చేందుకు 33 టీఎంసీలు, ఎస్‌ఎల్‌బీసీ కింద చెరువులను నింపేందుకు 12 టీఎంసీలు, హైదరాబాద్‌ నగర తాగునీటి అవసరాలకు 7.50 టీఎంసీలు కలిపి మొత్తంగా 52.50 టీఎంసీలు కేటాయించాలని కోరింది. ఈ అవసరాలపై బోర్డు సోమవారం తర్వాత నిర్ణయం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఆగస్టు వరకు తాగు, సాగునీటి అవసరాలకు కృష్ణా బోర్డు 30 టీఎంసీలు కేటాయించిన విషయం తెలిసిందే.

ఆశలు రేపుతున్న ఎస్సారెస్పీ 
గోదావరి బేసిన్‌ ప్రాజెక్టుల్లోకి ప్రవాహాలు ఆశాజనకంగా కొనసాగుతున్నాయి. మహారాష్ట్ర, స్థానిక పరీవాహకంలో కురిసిన వర్షాలతో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 42,520 క్యూసెక్కుల మేర ప్రవాహం వస్తోంది. దీంతో ప్రాజెక్టు నిల్వ 30 టీఎంసీలకు చేరింది. మరో 60 టీఎంసీలు చేరితే ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది. క్రమంగా నిల్వ లు పెరుగుతుండటంతో ఇక్కడి 9.68 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటి విడుదలపై త్వరలోనే స్ప ష్టత వచ్చే అవకాశం ఉంది. ఎల్లంపల్లికి వరద ఉధృతి కొనసాగుతోంది. 38 వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా, ప్రాజెక్టులో 20 టీఎంసీల పూర్తి మట్టం ఉండటంతో 43 వేల క్యూసెక్కులు దిగువకు వదిలేస్తున్నారు. కడెంలోకి 5 వేల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది.

మరిన్ని వార్తలు