రాష్ట్రానికి 'డబుల్' నిరాశ!

19 Nov, 2015 03:15 IST|Sakshi
  •  'హౌజ్ ఫర్ ఆల్' కింద కేంద్రం నుంచి మంజూరైనవి 10,290 ఇళ్లే
  •   వాటి రూపంలో వచ్చే నిధులు రూ.154 కోట్లు
  •  ఎక్కువ ఇళ్లు వచ్చేలా లాబీయింగ్ చేయటంలో ప్రభుత్వం విఫలం
  •  సాక్షి, హైదరాబాద్: కేంద్రం నుంచి వీలైనంత ఎక్కువ సాయం పొందాలని రాష్ట్రాలు ఆశించడం సహజం. కానీ డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం విషయంలో తెలంగాణ ప్రభుత్వం వెనుకబడింది. రాష్ట్రంపై కేంద్రం ఇప్పటికే శీతకన్ను వేసిన నేపథ్యంలో... ఢిల్లీపై ఒత్తిడి చేసి అందరికీ ఇళ్ల పథకం కింద ఎక్కువ ఇళ్లు మంజూరు చేసుకునేలా లాబీయింగ్ నెరపలేకపోయింది. దీంతో పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు భారీ సంఖ్యలో ఇళ్లను మంజూరు చేసిన కేంద్రం.. తెలంగాణకు అత్తెసరుగా విదిల్చింది.

    దీంతో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంలో ఖజానాపై భారం తగ్గే అవకాశాన్ని రాష్ట్రం కోల్పోయింది. 'హౌజ్ ఫర్ ఆల్' పథకం కింద కేంద్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, రాజస్థాన్‌కు ఇళ్ల సంఖ్యను ఖరారు చేసింది. ఇందులో పది పట్టణాలకు సంబంధించి తెలంగాణకు కేవలం 10,290 ఇళ్లు మాత్రమే మంజూరయ్యాయి. అదే ఆంధ్రప్రదేశ్‌కు 37 పట్టణాలకు సంబంధించి 1,93,147 ఇళ్లు మంజూరయ్యాయి. ఈ పథకం కింద కేంద్రం ఒక్కో ఇంటికి రూ.1.50 లక్షలు కేటాయిస్తుంది. అంటే తెలంగాణకు మంజూరయ్యే మొత్తం కేవలం రూ.154 కోట్లు మాత్రమే. ఆంధ్రప్రదేశ్‌కు రూ.2,900 కోట్లు అందనున్నాయి.

     భారం భారీగా ఉన్నా: దేశంలో వినూత్నంగా రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే ఈ ఇంటికి లబ్ధిదారు పేర బ్యాంకు రుణంగానీ, వారి వంతు వాటాగానీ లేదు. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు భరించేలా విధివిధానాలు ఖరారు చేశారు. కేంద్రం ఇచ్చే ఇళ్లు ప్రస్తుతానికి పట్టణాలకే పరిమితమైనందున.. పట్టణ ప్రాంత ఇంటి నిర్మాణ వ్యయాన్ని పరిశీలిస్తే ఒక్కో ఇంటికి రూ.5.30 లక్షలను యూనిట్ కాస్ట్‌గా నిర్ధారించారు.

    మౌలిక వసతుల కోసం మరో రూ.75 వేలు ఖర్చు చేయాల్సి ఉంది. అంటే ఒక్కో ఇంటికి రూ.6.05 లక్షలు. కేంద్రం ఒక్కో ఇంటికి రూ.1.50 లక్షలు ఇస్తున్నందున... అక్కడ్నుంచి వీలైనన్ని ఇళ్లు ఎక్కువగా మంజూరు చేయించుకుని ఉంటే ప్రతి ఇంటిపై రూ.లక్షన్నర మేర భారం తగ్గేది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో 60 వేల ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో పట్టణ ప్రాంతాల్లో 24 వేల ఇళ్లను నిర్మించాలని ఖరారు చేసింది. కేంద్రం 24 వేల ఇళ్లను మంజూరు చేసి ఉంటే ప్రతి ఇంటిపై రూ.లక్షన్నర చొప్పున రాష్ట్ర ఖజానాపై భారం తగ్గేది.


     ప్రణాళిక లోపం వల్లే: తమకు ఎన్ని ఇళ్లు కావాలో కోరుతూ కేంద్రానికి రాష్ట్రాలు ప్రతిపాదనలు పంపుతాయి. రాష్ట్రంలో రెండు పడక గదుల ఇళ్ల విషయంలో జాప్యం జరగటం, ఆర్థిక సంవత్సరం ముగిసే సమయం వస్తున్నా ప్రణాళిక సిద్ధం కాకపోవటంతో రాష్ట్రం కేంద్రానికి 10 వేల ఇళ్లకే ప్రతిపాదన పంపినట్టు తెలిసింది. ప్రతిపాదన పంపిన తర్వాత  పట్టణ ప్రాంతాల్లో 24 వేల ఇళ్లు నిర్మించాలని నిర్ణయించింది. ఆ తర్వాత మౌఖికంగా ఇళ్ల సంఖ్యను పెంచాలని కోరినా కేంద్రం పట్టించుకోలేదు. ప్రతిపాదనకు సవరణ చేసి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి మరిన్ని ఇళ్లు మంజూరు చేసుకోవడంపైనా  దృష్టి పెట్టలేదు.

మరిన్ని వార్తలు