బంగారు తెలంగాణకు బలమైన పునాది

3 Jun, 2016 02:23 IST|Sakshi
బంగారు తెలంగాణకు బలమైన పునాది

► రాష్ట్ర అవతరణ దినోత్సవంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌
► ప్రజలందరినీ వికాసపు దారుల వైపు నడిపిస్తాం
► అభివృద్ధి అంటే మౌలిక వసతుల కల్పన కాదు
► ప్రజల జీవన ప్రమాణాలు పెరిగినప్పుడే నిజమైన అభివృద్ధి
► పేదరికాన్ని రాష్ట్రం నుంచి తరిమికొడతాం
► దసరా నుంచే కొత్త జిల్లాలు
► ఇక కరెంటు కోతలు ఉండవు.. త్వరలోనే సాగుకు 9 గంటల విద్యుత్‌
► ప్రాజెక్టులకు ఏపీ మోకాలడ్డుతోంది.. ఎవరి ఆటలూ సాగనివ్వం
► కోటి ఎకరాలకు నీరిచ్చేలా 2022 నాటికి ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తాం
► వందశాతం అక్షరాస్యతను సవాలుగా స్వీకరించాం

సాక్షి, హైదరాబాద్‌
కొత్త రాష్ట్రానికి ఎంత బలమైన పునాది వేయగలిగితే రాబోయే తరతరాల వారి భవిష్యత్తు అంత ఉజ్జ్వలంగా ఉంటుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ‘‘అభివృద్ధి అంటే మౌలిక వసతుల కల్పన కాదు.. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగినప్పుడే నిజమైన అభివృద్ధి. మనిషి జీవితకాలం పెరగాలి. కడుపు నిండా తిండి, స్వచ్ఛమైన తాగునీరు, నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం, యోగ్యమైన నివాసం, పరిశుభ్రమైన పరిసరాలు, సామాజిక సమానత్వం, ఆత్మగౌరవంతో కూడిన జీవితం.. ఇవే నిజమైన మానవాభివృద్ధి సూచికలు. ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్‌ చెప్పినట్లు మానవాభివృద్ధికి నిధులు వెచ్చించకుండా సాధించే ఆర్థిక వృద్ధి అస్థిరమైనది.. అనైతికమైనది...’’ అని పేర్కొన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గురువారం పెరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించిన వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. పోలీసు వందనం స్వీకరించిన అనంతరం ప్రసంగించారు. ‘‘ప్రజా బలంతో అజేయంగా పురోగమిస్తాం. అన్ని వర్గాల ప్రజలను వికాసపు దారుల వైపు నడిపించి తీరుతాం.. బంగారు తెలంగాణకు అర్థం పరమార్థం అదే....’’ అని ఉద్ఘాటించారు. సీఎం ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..

పేదరికంపై యుద్ధం ప్రకటిస్తాం
రాష్ట్రంలో ప్రజలకు మౌలిక వసతులు కల్పించే పనులు చేస్తున్నాం. సాగునీరు, తాగునీరు, రహదారులు, విద్యుత్, విద్య, వైద్య రంగాల్లో అధికంగా నిధులు వెచ్చిస్తున్నాం. రాబోయే నాలుగైదేళ్లలో వీటికి నిర్వహణ వ్యయం తప్ప నిర్మాణ వ్యయం ఉండదు. ప్రాజెక్టులతోపాటు మేజర్‌ పనులు పూర్తవుతాయి. రాష్ట్ర ఆదాయం పెద్దఎత్తున పెరుగుతుంది. అప్పుడు పేదరికంపై యుద్ధం ప్రకటిస్తాం. ప్రతి పేద కుటుంబాన్ని తట్టి లేపుతాం. పేదరికాన్ని రాష్ట్రం నుంచి తరిమికొడతాం.

ఆ మూడు అంశాలే కొత్త జిల్లాలకు గీటురాళ్లు
దసరా పండుగ నుంచే కొత్త జిల్లాలు కొలువుదీరుతాయి. జిల్లాలతో పాటు రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలు ఏర్పాటు కానున్నాయి. కొత్తగా 14–15 జిల్లాల ఏర్పాటు అవసరమవుతుందని భావిస్తున్నాం. జిల్లాల ఏర్పాటు కసరత్తు జరుగుతోంది. భౌగోళిక సామీప్యం, ప్రజలకు సౌకర్యం, పరిపాలన సౌలభ్యం అనే మూడు అంశాలు గీటురాయిగా జిల్లాల ఏర్పాటు జరగాలని నిర్ణయించాం.

598 అమరుల కుటుంబీకులకు ఉద్యోగాలు
అమరుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో ప్రకటించింది. ఇచ్చిన మాట ప్రకారం అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 598 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందిస్తున్నాం. రెండేళ్లలో ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచి కాలేజీ, యూనివర్సిటీ హాస్టళ్లకు సన్నబియ్యం సరఫరా చేస్తాం.

జర్నలిస్టులకు ప్రత్యేక కాలనీ
డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. తెలంగాణలో జర్నలిస్టులకు హైదరాబాద్‌లో ప్రత్యేక కాలనీ నిర్మించాలని నిర్ణయించాం. దశలవారీగా మిగతా చోట్ల నిర్మిస్తాం. జర్నలిస్టులు, హోంగార్డులు, భవన నిర్మాణ కార్మికులు, డైవర్లకు రూ.5 లక్షల ప్రమాద బీమా..  దళిత కుటుంబాలకు మూడెకరాల భూ పంపిణీ.. ఇలా సంక్షేమ రంగంలో తెలంగాణ దేశంలోనే నంబర్‌ వన్‌గా నిలిచింది.

వ్యవసాయానికి 9 గంటల కరెంట్‌
త్వరలోనే వ్యవసాయానికి పగటిపూట తొమ్మిది గంటల కరెంటు ఇవ్వడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రం ఏర్పడిన అయిదో నెల నుంచే కోతల్లేని విద్యుత్‌ అందించాం. ఇక కరెంటు కోత ఉండదు. రాబోయే మూడేళ్లలో కొత్త విద్యుత్‌ ప్లాంట్ల ద్వారా 24 వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నాం. మిషన్‌ భగీరథ ద్వారా ఈ ఏడాది చివరి నాటికి 6,100 గ్రామాల్లో నీటిని సరఫరా చేస్తాం. వచ్చే ఏడాది చివరి నాటికి 90 శాతం గ్రామాల్లో శుద్ధి చేసిన నీటి సరఫరా జరుగుతుంది. మిగతా ప్రాంతాలకు 2018లో నీరందిస్తాం.

ఎవరి ఆటలు సాగనివ్వం
కృష్ణా గోదావరిలో మన వాటాలో చుక్కనీటిని కూడా వదిలే సమస్య లేదు. గోదావరిపై నిర్మించే ప్రాజెక్టులకు మహారాష్ట్ర, కృష్ణాపై తలపెట్టిన ప్రాజెక్టులకు కర్ణాటక ప్రభుత్వాల నుంచి ఆశించిన సహకారం అందుతోంది. ఏపీ ప్రభుత్వం మోకాలడ్డే ప్రయత్నం చేస్తోంది. ఎవరి ఆటలు సాగనివ్వం. కోటి ఎకరాలకు సాగునీరు అందేలా ప్రాజెక్టులు రీడిజైన్‌ చేశాం. 2018 నాటికి కాళేశ్వరం, పాలమూరు, డిండి, సీతారామ, ప్రాణహిత ప్రాజెక్టులకు నీళ్లు వస్తాయి. 2022 వరకు ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయి.

ఖరీఫ్‌ నుంచే ఆయకట్టుకు నీరు
ఖరీఫ్‌లో కల్వకుర్తి ద్వారా 1.5 లక్షలు, నెట్టెంపాడు ద్వారా 1.5 లక్షలు, బీమా ద్వారా 1.4 లక్షలు, కోయిల్‌సాగర్‌ ద్వారా 20 వేల ఎకరాలు, ఆదిలాబాద్‌లోని కొమురం భీమ్‌ ప్రాజెక్టు ద్వారా 25 వేల ఎకరాలు, నీల్వాయి ప్రాజెక్టు ద్వారా 6 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తాం. 2017 నాటికి కొమురం భీమ్, నీల్వాయి, జగన్నాథపురం ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. ఖమ్మం జిల్లాలోని భక్త రామదాసు ప్రాజెక్టును ఈ ఆగస్టు నాటికే పూర్తి చేసి పాలేరు, కూసుమంచి, తిరుమలాయపాలెం మండలాలను సస్యశ్యామలం చేస్తాం. కరీంనగర్‌ మిడ్‌మానేరులో ఈ వర్షాకాలంలో మూడు టీఎంసీలు నిల్వ చేసి ఎల్‌ఎండీ ద్వారా ఎస్సారెస్పీ కాల్వలకు నీటిని వదులుతాం. ఎల్లంపల్లిలో 20 టీఎంసీల నీటిని నిల్వ చేస్తాం. దీంతో హైదరాబాద్‌ మంచినీటికి ఢోకా ఉండదు. ఆదిలాబాద్‌ కడెం ప్రాజెక్టులో 30 ఎకరాల చివరి ఆయకట్టుకు నీరందిస్తాం. మంథని లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌ ద్వారా పది వేల ఎకరాలకు నీరందుతోంది. మెదక్‌లో సింగూరు ప్రాజెక్టు ద్వారా ఖరీఫ్‌లో 40 వేల ఎకరాలకు, ఘన్‌పూర్‌ ఆనకట్ట ద్వారా 25 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తాం. మిషన్‌ కాకతీయ తొలి దశలో ఎనిమిది వేల చెరువులను పునరుద్ధరించాం. రెండో దశలో మరో 9 వేల చెరువుల పనులు చేస్తున్నాం.

సిటీ చుట్టూ రీజనల్‌ రింగ్‌ రోడ్‌
హైదరాబాద్‌ చుట్టూ ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణం పూర్తవుతోంది. భువనగిరి, చౌటుప్పల్, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్, చేవెళ్ల, శంకరపల్లి, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, జగదేవ్‌పూర్‌ మీదుగా మరో రీజనల్‌ రింగ్‌ రోడ్డు నిర్మించే ప్రణాళిక సిద్ధం చేశాం.

అసైన్డ్‌ ల్యాండ్‌ డెవలప్‌మెంట్‌కు కార్పొరేషన్‌
అసైన్డ్‌ భూముల పంపిణీ ప్రహసనంగా మారింది. 25 లక్షల ఎకరాలు పంచినట్లు రికార్డులున్నా అవన్నీ ఏమయ్యాయో తెలియడం లేదు. అసైన్డ్‌ భూముల నిగ్గు తేల్చడానికి సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. అన్యాక్రాంతమైనవి స్వాధీనం చేసుకుని పేదలకు తిరిగి పంచి పెట్టేందుకు ప్రభుత్వం పట్టుదలతో ఉంది. వీటిని సాగుకు యోగ్యంగా మార్చేందుకు అసైన్డ్‌ ల్యాండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ కూడా ఏర్పాటు చేస్తున్నాం.

జూలైలో హరితహరం
వానలు వాపస్‌ రావాలే.. కోతులు వాపస్‌ పోవాలె.. అనే నినాదంతో ప్రతి నియోజకవర్గంలో ఏడాదికి 40 లక్షల మొక్కల చొప్పున 40 కోట్ల మొక్కలు నాటుతాం. హైదరాబాద్‌లో మరో 10 కోట్ల మొక్కలు నాటాలనేది లక్ష్యం. మూడేళ్లలో 230 కోట్ల మొక్కలు నాటి ఆకుపచ్చని తెలంగాణ సాధిద్దాం. వచ్చే జూలైలో జరిగే హరితహారం కార్యక్రమంలో అందరూ పాల్గొనాలి. ఉద్యమస్ఫూర్తితో విరివిగా మొక్కలు నాటాలి.

బక్క రైతులకు బంగారు కానుక
రైతుల ఇబ్బందులు తొలిగించేలా భూపరిపాలనలో సంస్కరణలు తెస్తున్నాం. సాదా బైనామాలపై జరిగిన భూముల అమ్మకాలు, కొనుగోళ్లను ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేయాలని నిర్ణయించాం. సాదాబైనామాలపై గ్రామాల్లో ఐదెకరాల లోపు  జరిగిన లావాదేవీలకు ఆర్‌వోఆర్‌ చేస్తాం. ఈ రోజు(జూన్‌ 2) నుంచి పదో తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి. వారసత్వంగా వచ్చిన భూముల మ్యుటేషన్‌ పది రోజుల్లో, రిజిస్ట్రేషన్‌ అయిన భూముల మ్యుటేషన్‌ 15 రోజుల్లో చేసే విధానం అమలు చేస్తాం. చిన్న కమతాలన్నీ ఒకేచోట చేర్చేందుకు కమతాల ఏకీకరణ కార్యక్రమం చేపడతాం.

అక్షరాస్యతను సవాలుగా స్వీకరిస్తాం
అక్షరాస్యతలో తెలంగాణ వెనుకబడి ఉంది. దేశ సగటు 72 శాతమయితే.. తెలంగాణలో 67 శాతమే ఉంది. వంద శాతం అక్షరాస్యత సాధించడాన్ని ప్రభుత్వం సవాలుగా తీసుకొని ప్రత్యేక కార్యక్రమం రూపొందించుకుంది. ఎస్సీలకు 130, ఎస్టీలకు 50, మైనారిటీలకు 70.. వీటిలో 30 రెసిడెన్షియల్‌ కాలేజీలతోపాటు మొత్తం 250 రెసిడెన్షియల్‌ స్కూళ్లను ఈ ఏడాది నుంచే ప్రారంభిస్తున్నాం.

అద్దంలా రోడ్లు.. ఆరోగ్యంగా ఆసుపత్రులు..
సమగ్ర రహదారుల విధానంతో రెండేళ్లలోనే రహదారులు బాగుపడ్డాయి. రూ.10 వేల కోట్లు ఖర్చు పెట్టి తెలంగాణలోని రోడ్లను అద్దంలా నిర్మిస్తున్నాం. హాస్పిటళ్లలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించే చర్యలు చేపడుతున్నాం.  ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ, మామ్మోగ్రామ్, అల్ట్రా సౌండ్‌ స్కానింగ్‌ పరికరాలను సమకూరుస్తున్నాం. చికిత్స పొందుతూ మరణించిన వారిని ఇంటికి ఉచితంగా చేర్చేందుకు అంబులెన్స్‌లు ఏర్పాటు చేస్తున్నాం. పేద ప్రజల పాలిట శాపంగా పరిణమించిన గుడుంబా తయారీని అరికట్టాం. గుడుంబా తయారీ దారులను శిక్షించడమే కాకుండా వారికి జీవనోపాధి మార్గం చూపించడంపై దృష్టి సారించాం.

క్యూ కడుతున్న పారిశ్రామికవేత్తలు
నూతన పారిశ్రామిక విధానానికి విశేష స్పందన వచ్చింది. పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి రావడానికి క్యూ కడుతున్నారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన ల్యాండ్‌బ్యాంక్‌ మన దగ్గర ఉంది. ఐటీ రంగంలో తెలంగాణ సంచలనాలు సృష్టిస్తోంది. అనతి కాలంలోనే 1,300 యూనిట్లు ఏర్పాటయ్యాయి. గత ఏడాది ఐటీ సేవల్లో తెలంగాణ దేశంలోనే నంబర్‌ వన్‌గా నిలిచింది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కోవిడ్‌ రోగులకు కోరుకున్న ఆహారం..

భలే..భలే..ఆన్‌లైన్‌ క్లాస్‌

ముఖ్యమంత్రి చొరవ.. ఈ చిన్నారి హ్యాపీ..

సరిపడా మాస్కులు, శానిటైజర్లు ఉన్నాయా?

లాక్‌డౌన్‌ టైం..రిపేర్‌ ప్రాబ్లం

సినిమా

కరోనాతో హాలీవుడ్‌ నటుడు మృతి

ఫిజికల్‌ డిస్టెన్స్‌.. సెల్ఫీ

నటి కుమారుడి ఆత్మహత్యాయత్నం?

కరోనా విరాళం

నిర్మాత కరీమ్‌కు కరోనా

డ్రైవర్‌ పుష్పరాజ్‌