ఫస్ట్ ర్యాంక్ జస్ట్ మిస్సా..?

13 Jun, 2015 10:34 IST|Sakshi
ఫస్ట్ ర్యాంక్ జస్ట్ మిస్సా..?

ఎంతో కష్టపడ్డాం.. రాత్రనకా, పగలనకా చదివాం... అయినా ఫస్ట్‌ర్యాంక్ మిస్సయింది. ఎప్పుడూ చదవనట్టే కనిపించని కీర్తి ఫస్ట్ ర్యాంక్ కొట్టేసింది. ఎందుకు? ... ఈ ప్రశ్నకు జవాబు ఎక్కడో లేదు. మీ దగ్గరే, ఇంకా చెప్పాలంటే మీలోనే ఉంది. ఒక్కసారి లాస్ట్ ఇయర్ స్కూల్ డేస్ రీల్‌ను రివైండ్ చేసుకోండి.. యస్! నాకు లాస్ట్ ఆగస్టులో టైఫాయిడ్ జ్వరం వచ్చింది. 20 రోజులపాటు అసలు బడికే వెళ్లలేదు. అప్పుడే కీర్తి నన్ను దాటేసి ముందుకెళ్లిపోయింది. ఒకవేళ నాకు జ్వరం రాకపోతే ఫస్ట్ ర్యాంక్ నాదే... కదా? మీరేకాదు చాలా మంది పిల్లలు చదువులో వెనుకబడి పోవడానికి ఇదే కారణం.

తరచూ జలుబు చేయడం, జ్వరం రావడం, తలనొప్పి వంటి అనారోగ్య సమస్యలతో బడి మానేస్తారు. దీంతో ఆరోజు చెప్పిన పాఠాలు అర్థం కాక మిగతావారి కంటే వెనుకబడిపోతారు. మరి అలా వెనుబడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? సింపుల్ ఆరోగ్యంగా ఉండడమే. మంచి అలవాట్లు మనల్ని ఆరోగ్యంతో ఉంచుతాయి. ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మెదడు ఉంటుంది. అది చురుకుగా పనిచేస్తే క్లాస్ ఫస్ట్ ఏంటి.. స్కూల్ ఫస్ట్ కూడా రావొచ్చు. మరి ఆరోగ్యంగాఉండడమెలాగో తెలుసుకుందామా?
 
 ఆరోగ్యానికి, సమయానికి సంబంధమేంటి? ఇదే ప్రశ్నకు నిపుణులు చెబుతున్న విషయాలు వింటే మీరు ఈ ప్రశ్న అడగరు. అదేంటంటే.. ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడు చేయకుండా సమయాన్ని వృథా చేయడం వల్ల పరీక్షల సమయంలో మనపై మానసికంగా తీవ్ర ఒత్తిడి పడుతుంది. ఇది శారీరక ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. 9 గంటలకు స్కూల్‌లో ఉండాలి. ఇందుకోసం మనం ఉదయం 6 గంటలకే లేచామనుకోండి ఎటువంటి సమస్య ఉండదు. అదే 8 గంటలకు నిద్రలేస్తే? గంటలో బ్రష్ చేసుకోవడం, స్నానం చేయడం, టిఫిన్ చేయడం పూర్తవుతుందా? ఏదో ఒకటి చేయకుండానే వెళ్లిపోతాం. చాలామంది పిల్లలు టిఫిన్ చేయకుండా స్కూల్‌కు వెళ్లిపోతారు. ఓవైపు కడుపులో ఎలుకలు పరిగెడుతుంటే టీచర్ చెప్పే పాఠాలు ఎలా అర్థమవుతాయి? పైగా టైమ్ అయిపోతుందనే హడావుడిలో ఎన్నో మర్చిపోతుంటాం. తీరా స్కూల్‌కు వెళ్లాక బ్యాగులో అవసరమైనవి లేకపోతే మళ్లీ ఆందోళనే. ఇటువంటి చిన్న చిన్న కారణాలే మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అందుకే స్కూల్‌కు రెడీ అవ్వడం నుంచి పరీక్షకు సిద్ధమయ్యేదాకా ప్రతీది టైం ప్రకారం జరగాలి. అప్పుడు ఏ ఆందోళనా ఉండదు. మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా మనం ఫిట్‌గా ఉంటాం.
 
కంటినిండా నిద్ర..
కూరలో ఉప్పు ఎక్కువైనా, తక్కువైనా ఆ కూర బాగుండదు. అలాగే నిద్ర కూడా ఎక్కువైనా, తక్కువైనా మన ఆరోగ్యం కూడా బాగుండదు. ఎక్కువ నిద్రపోయేవారిలో సోమరితనం కనిపిస్తుంది. తక్కువగా నిద్రపోయేవారిలో అలసట కనిపిస్తుంది. అందుకే ఎవరికి ఎన్నిగంటలు నిద్ర అవసరమో అంతసేపు మాత్రమే నిద్రపోవాలి. లోయర్ సెక్షన్ పిల్లలైతే కనీసం 9-10 గంటలు నిద్రపోవాలి. 6 నుంచి 10 వతరగతి చదివే పిల్లలకు 8 గంటలు నిద్ర చాలు. అమ్మకు ఎన్నో పనులుంటాయి. నాన్నకు ఆఫీస్‌కు సంబంధించిన పనులుంటాయి. వారు పడుకోవడం లేదని మనం కూడా వారితోపాటు మెలకువగా ఉంటే పాడయ్యేది మన ఆరోగ్యమే. అందుకే రాత్రి 9 గంటలకల్లా పడుకొని ఉదయం 5 గంటలకు నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి. అలసటగా ఉన్నా, జలుబు వంటి సమస్యలతో బాధపడుతుంటే ఒకట్రెండు గంటలు ఎక్కుగా నిద్రపోవడం తప్పనిసరి. అప్పుడే శరీరానికి అవసరమైన విశ్రాంతి లభిస్తుంది. తర్వాత రోజంతా చురుగ్గా ఉంటాం.
 
 హెల్త్ ఈజ్ వెల్త్
 ఆరోగ్యమే మహాభాగ్యం అనే విషయం మనకు తెలిసిందే. ఏదీ సాధించాలన్నా ముందు మనం ఆరోగ్యంగా ఉండాలి. అయితే మనలో చాలా మందికి అనేక అనారోగ్య సమస్యలుంటాయి. కొందరికి చల్లగాలి పడదు. మరికొందరికి వర్షంలో తడిస్తే పడదు. ఇంకొందరికి స్వేచ్ఛగా గాలి ఆడకపోతే సమస్య. మన అనారోగ్య సమస్యలను టీచర్లకు ముందే చెప్పాలి. చల్లగాలి పడనివారు కిటికీల దగ్గర కూర్చోకూడదు. ఆస్తమా వంటి సమస్యలతో బాధపడుతున్నారు వాతావరణం అనుకూలంగా లేని సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరో ఏదో అనుకుంటారని అనారోగ్యాన్ని కొనితెచ్చుకోవద్దు. స్నేహితులు తడుస్తున్నారు కదా.. అని మనం కూడా వర్షంలో తడిస్తే మరుసటి రోజు స్కూల్‌కు రాలేని పరిస్థితి ఎదురయ్యే అవకాశముంది. అందుకే ముందుగా ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సింది మనమే.
 
అమ్మానాన్నలకు చెబుదాం...
మనలో చాలమంది పిల్లలకు దూరంగా ఉన్న బ్లాక్ బోర్డుపై అక్షరాలు సరిగ్గా కనపడవు. దగ్గరికెళ్తే స్పష్టంగా కనిపిస్తాయి. ఇంకొందరికి దగ్గరగా ఉన్న పుస్తకంలోని అక్షరాలు సరిగ్గా కనపడవు, అదే బ్లాక్ బోర్డుపై ఉన్న అక్షరాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తాయి. దీనిని చాలామంది పిల్లలు నిర్లక్ష్యం చేస్తారు. అలా కనపడడం లేదంటే మనకు కంటిచూపు సమస్య ఉన్నట్టు. తరచూ తలనొప్పి రావడం, కళ్లు తిరగడం, వాంతులు వస్తున్నట్లుగా అనిపించడం వంటి లక్షణాలు కూడా కంటి చూపునకు సంబంధించినవే. మీలో ఎవరు ఈ సమస్యను ఎదుర్కొంటున్నా వెంటనే మీ అమ్మానాన్నలకు చెప్పేయండి. ఎందుకంటే వారు ఐ స్పెషలిస్ట్ దగ్గరకు మిమ్మల్ని తీసుకెళ్తారు. డాక్టర్ సూచనలను పాటిస్తే మీ సమస్యలన్నీ సులభంగా పరిష్కారమైపోతాయి.
 
ఆహారంతోనే ఆరోగ్యం
ఉదయం బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం స్కూల్ నుంచి రాగానే స్నాక్స్, రాత్రిభోజనం ఇవన్నీ క్రమం తప్పకుండా చేస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాం.  స్కూల్ టైమ్ అయిపోతోందనే తొందరలో బ్రేక్ ఫాస్ట్ చేయకుండా వెళ్లడం, ఇష్టమైన కూరలేదనే కారణంతో లంచ్‌బాక్స్‌ను అలాగే ఇంటికి తెచ్చేయడం, రాత్రికి తినకుండానే పడుకోవడం చాలామంది పిల్లలు చేసే పనులే. ఇది మన ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. సమయానికి తిన్నా అందులో సరైన పోషకపదార్థాలు లేకపోయినా మన ఎదుగుదల సరిగ్గా ఉండదు.

మరిన్ని వార్తలు