సార్లకు చికెన్‌ బిర్యానీ.. పిల్లలకు నీళ్లచారు

27 Oct, 2017 19:55 IST|Sakshi
తరగతి గదిలో ఖాళీ బీరు సీసాలు. (ఇన్‌సెట్‌లో) మసాలా పట్టించిన చికెన్‌ ముక్కలు, నీళ్ల చారుతో అన్నం తింటున్న విద్యార్థులు

సాక్షి, నర్సాపూర్ : ఆదర్శంగా ఉంటూ విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు తప్పుదారి పడుతున్నారు. ఇందుకు తాము పని చేస్తున్న పాఠశాలనే అడ్డాగా చేసుకున్నారు. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పిల్లలకు నీళ్ల చారు వడ్డిస్తూ.. తాము మాత్రం చికెన్‌ బిర్యానీ వండుకు తింటున్న విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. పాఠశాలకు చెందిన పలువురు ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజనం వండిపెడుతున్న ఏజెన్సీ నిర్వాహకులతో, అదే పథకానికి  చెందిన బియ్యంతో వారానికి రెండు సార్లు చికెన్‌ బిర్యానీ వండించుకుంటున్నారని తెలుస్తోంది. అప్పుడప్పుడు మద్యం సేవిస్తారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. శుక్రవారం విద్యా కమిటీ చైర్మన్‌ పద్మారావు పాఠశాలను సందర్శించినప్పుడు విద్యార్థులకు నీళ్ల చారు వడ్డించిన విషయం బయటపడింది.

ఉపాధ్యాయుల కోసం బిర్యానీ తయారు చేసేందుకు మసాలా కలిపి సిద్ధం చేసిన చికెన్‌ ముక్కలు, బియ్యం ఉడికించేందుకు పెట్టిన ఎసరు కూడా కనిపించడంతో ఆయన ఆశ్చర్యపోయారు. పాఠశాలలోని ఒక గదిలో ఖాళీ బీరు సీసాలు లభించడంతో వారు మద్యం కూడా తాగుతున్నారనే అనుమానాలకు బలం చేకూరుతోంది. పాఠశాలకు ప్రహరీ లేనందున రాత్రి పూట మైదానంలో గుర్తు తెలియని వ్యక్తులు తాగి పడవేసిన బీరు సీసాలను మధ్యాహ్న భోజనం వండి పెట్టె మహిళ తెచ్చుకుని ఒక గదిలో దాచి పెట్టిందని ప్రధానోపాధ్యాయుడు విజయ్‌కుమార్‌ చెబుతున్నారు. బిర్యానీ వండించిన సంగతి తనకు తెలియదని అంటున్నారు. ఈ విషయాలను ఉన్నతాధికారులకు నివేదిస్తానన్నారు.

చర్యలకు డిమాండ్‌
పాఠశాలలో పర్యవేక్షణ సరిగా లేనందునే పలువురు ఉపాధ్యాయులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని విద్యా కమిటీ చైర్మన్‌ పద్మారావు ఆరోపించారు. వారు మధ్యాహ్న భోజన బియ్యంతో బిర్యానీ వండించుకోవడంతోపాటు, తరగతి గదులలో మద్యం సేవిస్తున్నారని ఆరోపించారు. తప్పుడు పనులకు పాల్పడుతున్న ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌  చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా చూడాలని అధికారులను కోరారు.

మరిన్ని వార్తలు