‘నీట్‌’గా జరగలేదు..

8 May, 2017 02:27 IST|Sakshi
కొండాపూర్‌లోని నీట్‌ పరీక్షా కేంద్రం వద్ద కుమార్తె చెవి కమ్మలను తీస్తున్న ఓ తల్లి

కఠిన నిబంధనల కారణంగా విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు
ముక్కు పుడక నుంచి చెవికమ్మలు, బూట్ల వరకు దేన్నీ వదలని అధికారులు
కంటతడి పెట్టిన అమ్మాయిలు.. తల్లిదండ్రుల ఆగ్రహం


తెలంగాణలో పరీక్ష రాసిన 56,806 మంది.. 97 శాతంపైగా హాజరు
వరంగల్‌లో తెలుగు మీడియం బదులు ఆంగ్ల మీడియం ప్రశ్నపత్రం
ఆందోళన వ్యక్తం చేసిన విద్యార్థులు, తల్లిదండ్రులు
గతేడాది కంటే పరీక్ష సులువుగానే ఉందన్న నిపుణులు

► 500 మార్కులు దాటితే రాష్ట్రంలో ప్రభుత్వ కాలేజీలో సీటు!


సాక్షి, హైదరాబాద్‌:
వైద్య విద్య (ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్‌) కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆదివారం నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌) స్వల్ప ఆందోళనల మధ్య ప్రశాంతంగా ముగిసింది. హైదరాబాద్‌లోని 59 పరీక్షా కేంద్రాల్లో 48,999 మంది, వరంగల్‌లోని 16 పరీక్షా కేంద్రాల్లో 7,805 మంది కలిపి మొత్తంగా.. 56,804 మంది పరీక్ష రాశారని సమన్వయకర్తలు వెల్లడించారు. మొత్తంగా 97 శాతం మంది హాజరైనట్లు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరిగింది. కాగా.. దేశవ్యాప్తంగా నీట్‌ పరీక్షకు 11,38,890 మంది హాజరైనట్లు సీబీఎస్‌ఈ ప్రకటించింది. దేశవ్యాప్తంగా సుమారు 65 వేల ఎంబీబీఎస్‌ సీట్లు, 25 వేల బీడీఎస్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయి. 1,522 మంది ఎన్నారైలు, 613 మంది విదేశీయులు నీట్‌కు హాజరైనట్లు అధికారులు తెలిపారు.

వరంగల్‌లో ఆందోళన
తెలుగు మాధ్యమానికి బదులు ఆంగ్ల మాధ్యమంలో ప్రశ్నపత్రం ఇచ్చారంటూ వరంగల్‌ అర్బన్‌ జిల్లా కేంద్రంలో నీట్‌ అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. హన్మకొండలోని సెయింట్‌ పీటర్స్‌ పాఠశాల కేంద్రంలో సుమారు 600 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. అందులో 100 మందికిపైగా తెలుగు మీడియంలో రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. కానీ వారికి ఆంగ్ల మాధ్యమంలో ప్రశ్నపత్రం ఇవ్వడంతో అవాక్కయ్యారు. ఈ విషయాన్ని ఇన్విజిలేటర్‌కు చెప్పినా.. ‘తెలుగు సెట్‌ రాలేదు.. మీరు పరీక్ష రాయడం మొదలుపెట్టండి.. ఆలోపు తెప్పిస్తా’మంటూ దాటవేసే ప్రయత్నం చేశారని అభ్యర్థులు మండిపడ్డారు. చివరికి ఆంగ్ల మాధ్యమంలోనే పరీక్ష రాయాలని తేల్చడంతో.. విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలసి పరీక్ష కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఇక అభ్యర్థులంతా పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలు తప్పక తీసుకురావాలని సూచించినా.. అనేకచోట్ల విద్యార్థులు తీసుకురాలేదని, దీంతో ఫొటోగ్రాఫర్‌ను పిలిపించి ఫొటోలు తీయించాల్సివ చ్చిందని పరీక్ష హైదరాబాద్‌ సమన్వయకర్త ఒకరు తెలిపారు.

సిలబస్‌లో లేని ప్రశ్నలు
గతేడాదితో పోలిస్తే ఈసారి నీట్‌ సులభంగానే ఉందని విద్యా రంగ నిపుణులు, విద్యార్థులు పేర్కొంటున్నారు. అయితే జువాలజీకి సంబంధించి మాత్రం పలు సిలబస్‌లో లేని ప్రశ్నలు ఇచ్చారు. ఫ్రాగ్‌ అనే చాప్టర్‌ నీట్‌ సిలబస్‌లో లేదు. కానీ అందులోంచి రెండు ప్రశ్నలు ఇచ్చారు. మరో రెండు ప్రశ్నలూ సిలబస్‌లో లేనివే ఇచ్చారు. ఇక ఆర్గానిక్‌ కెమిస్ట్రీకి సంబంధించి గతేడాది ప్రశ్నలు చాలా కఠినంగా రాగా.. ఈ సారి కొంత సులువుగానే వచ్చాయని చెబుతున్నారు. కానీ రెండు ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలు అస్పష్టంగా ఉన్నాయని, వాటికి ఇచ్చిన ఆప్షన్లలో ఏది సరైనదో అర్థంకాని పరిస్థితి ఉందని చెబుతున్నారు. ‘ఎక్స్‌’సిరీస్‌లోని 157వ ప్రశ్నకు ఆప్షన్లలో 3, 4 రెండూ సరైన జవాబులే. ఇది విద్యార్థులను గందరగోళానికి గురిచేసింది. అదే సిరీస్‌లోని 164 ప్రశ్నకు 1, 4 జవాబుల్లో ఏది సరైనదో అర్థంకాక విద్యార్థులు గందరగోళానికి గురయ్యారు. ఇక ఫిజిక్స్‌ ప్రశ్నలు సాధారణంగానే ఉన్నాయి. మొత్తంగా పరీక్ష గతేడాది కంటే సులువుగా ఉందని శ్రీచైతన్య జూనియర్‌ కాలేజీ డీన్‌ డి.శంకర్‌రావు విశ్లేషించారు. 720 మార్కులకు గాను ఈసారి అత్యధికంగా 695 మార్కుల వరకు రావొచ్చన్నారు. 400 మార్కులు దాటితే రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో ఎక్కడో ఒకచోట ఎంబీబీఎస్‌ సీటు వచ్చే అవకాశం ఉంటుందని అంచనా వేశారు. 500 మార్కులు దాటితే ప్రభుత్వ కాలేజీల్లో సీటు వస్తుందని చెప్పారు. గతేడాది ప్రశ్నపత్రం కఠినంగా ఉండటంతో అర్హత మార్కు 148గా ఉండగా... ఈసారి పేపర్‌ సులువుగా ఉండటంతో జనరల్‌ కేటగిరీలో 175 మార్కులు అర్హతగా ఉండొచ్చని తెలిపారు. నీట్‌ ఫలితాలు జూన్‌ 8న విడుదల కానున్నాయి.

కఠిన నిబంధనలతో విద్యార్థులు విలవిల
నీట్‌ పరీక్ష ఉదయం 10 గంటలకు ప్రారంభంకాగా.. 7.30 గంటల నుంచే అభ్యర్థులను అనుమతించారు. విద్యార్థులను అడ్మిట్‌కార్డు, హాల్‌టికెట్, ఐడీ కార్డులు తప్ప మరెలాంటివీ పరీక్షా హాల్లోకి అనుమతించలేదు. వస్త్రధారణ, అలంకరణపై కఠిన నిబంధనలు అమలు చేశారు. అబ్బాయిలు, అమ్మాయిలు పొడుగు చేతుల వస్త్రాలు, పైజామా, కుర్తా, బూట్లు, హైహీల్స్, వాచీలు వంటివి ధరించడంపై ఆంక్షలు విధించారు. ఇవేగాకుండా గాజులు, జుట్టుకున్న పిన్నులు, కాళ్ల పట్టీలు, మెడలోని బంగారు ఆభరణాలు, ఉంగరాల వంటివాటిని తొలగించాకే పరీక్షా హాల్లోకి రానిచ్చారు. దీంతో చాలా మంది అమ్మాయిలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చెవిపోగులు, ముక్కు పుడకలు వంటివి తీసే సమయంలో కొంత మందికి గాయాలై రక్తం కారింది. దీంతో కొందరు కంటతడి పెట్టారు కూడా. విద్యార్థుల వెంట వచ్చిన తల్లిదండ్రులు ఇది చూసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోనీటెయిల్‌తో రావద్దనే నిబంధనతో హన్మకొండలోని పరీక్ష కేంద్రం వద్ద స్నేహితురాలికి జడవేస్తున్న విద్యార్థి
కేరళలో నీట్‌ పరీక్షకు హజరైన విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాలా మంది జీన్స్‌ వంటి దుస్తులు ధరించి రావడంతో పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు. దాంతో విద్యార్థినులకు స్థానికులు దుస్తులు అందించారని, దగ్గర్లోని ఓ ముస్లిం కుటుంబం ఒక్కటే ఆరు జతల దుస్తుల్ని అందించిందని స్థానికులు తెలిపారు. ఇక చెన్నైలో పొడుగు చేతుల చొక్కాలతో పరీక్షకు హాజరైన విద్యార్థులు.. పరీక్షా కేంద్రాల వద్దే చొక్కాల చేతులను కత్తిరించుకున్నారు.

ఇంత అనుమానమా?
‘‘సాధారణ డ్రెస్సులు మాత్రమే వేసుకుని పరీక్షకు హాజరుకావాలన్నారు. అవేకాదు ఎన్నో కఠినమైన నిర్ణయాలతో విద్యార్థులను తీవ్ర ఇబ్బందులు పెట్టారు. విద్యార్థులపై ఇంత అనుమానం అవసరం లేదు..’’
– విల్సన్, విద్యార్థి తండ్రి, కర్నూల్‌

పేపర్‌ కన్నా నిబంధనలే కఠినం
‘‘పరీక్ష పేపర్‌ కన్నా నిబంధనలే కఠినం అనిపించాయి. ముందుగా ఎలాంటి సూచనలు ఇవ్వలేదు. బూట్లను, పెన్నులను అనుమతించబోమని చెప్పి.. చివరికి చెవి రింగులను తీయించేశారు..’’
– తరుణ్‌కుమార్, విద్యార్థి, హైదరాబాద్‌

చున్నీలను కూడా అనుమతించలేదు
‘‘విద్యార్థినులకు చున్నీలను కూడా పరీక్ష హాల్లోకి అనుమతించలేదు. పొడవు చేతుల దుస్తులు వేసుకున్నవారి పరిస్థితి దారుణంగా ఉంది. కొందరు విద్యార్థినులు చెవిదిద్దులు తీసే సమయంలో గాయమై రక్తం వచ్చింది కూడా..’’
– దివ్య, విద్యార్థిని, హైదరాబాద్‌

ఇంత ఇబ్బంది పెట్టడం సరికాదు
‘‘నిబంధనలు ఉండాలే కానీ ఇంతగా ఇబ్బందులు పెట్టకూడదు. ఇలాంటి సమయాల్లో ముందుగానే నిబంధనలను ప్రచారం చేసి ఉండాల్సింది. తోడుగా ఎవరూ లేకుండా ఒంటరిగా పరీక్ష రాయడానికి వచ్చిన నాలాంటి వారికి చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి..’’
– దిలీప్, విద్యార్థి, కర్నూల్‌
 

మరిన్ని వార్తలు