సీజన్‌లోనూ పైపైకి..

22 Sep, 2014 04:35 IST|Sakshi
సీజన్‌లోనూ పైపైకి..
  • తగ్గని కూరగాయల ధరలు
  • ధరలపై నియంత్రణలేని ఫలితం
  • యథేచ్ఛగా వ్యాపారుల దోపిడీ
  • సాక్షి, సిటీబ్యూరో : సీజన్ ప్రారంభమైనా నగర మార్కెట్లో కొన్ని రకాల కూరగాయల ధరలు ఇంకా మండుతూనే  ఉన్నాయి.  దిగుబడి పెరిగితే ధరలు తగ్గుతాయనుకున్న వినియోగదారులకు నిరాశే మిగిలింది.  మొన్నటి వరకు డిమాండ్ సరఫరాల మధ్య అంతరం ఉండడంతో కూరగాయల ధరలు భారీగా పెరిగిపోయాయి. అయితే... ఇప్పుడు అన్నిరకాల కూరగాయల దిగుబడి పెరిగినా...  ధరలు మాత్రం తగ్గకపోవడం ఆందోళ కలిగిస్తోంది. ప్రస్తుతం నగరానికి సీమాంధ్ర నుంచేగాక స్థానికంగా ఉత్పత్తి అవుతున్న కూరగాయలు కూడా సమృద్ధిగా సరఫరా అవుతున్నాయి.

    కానీ రిటైల్ వ్యాపారులు మాత్రం ధరలను తగ్గించేందుకు ఇష్టపడట్లేదు. వీరిపై మార్కెటింగ్ శాఖ నియంత్రణ లేకపోవడంతో పాత ధరలనే కొనసాగిస్తూ వినియోగదారులను యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నారు. పచ్చిమిర్చి, బెండ, కాకర, బీర, చిక్కుడు, క్యాప్సికం, ఫ్రెంచి బీన్స్ ధరలు ఇంకా సామాన్యుడికి అందనంత దూరంలోనే ఉన్నాయి.

    హోల్‌సేల్ మార్కె ట్లో వీటి ధరలు కేజీ రూ.20-39ల మధ్యలోనే ఉన్నాయి. రిటైల్‌కు వచ్చేసరికి రూ.8-14లు అధిక ధర నిర్ణయిస్తూ  వినియోగదారుడి జేబుకు చిల్లు పెడుతున్నారు. బోయిన్‌పల్లి హోల్‌సేల్ మార్కెట్‌లో ఆదివారం పచ్చిమిర్చి కేజీ రూ.30లు ధర పలుకగా ఇదే రిటైల్ మార్కెట్లో రూ.44లకు విక్రయిస్తున్నారు.

    ఇక  బెండ, బీర, చిక్కుడు, కాకర, క్యాప్సికం, సొర వంటి వాటికి వ్యాపారులు ఇష్టారీతిన ధర నిర్ణయించి వసూలు చేస్తున్నారు. హోల్‌సేల్‌గా రూ.25లు ధర పలికిన ఉల్లి రిటైల్ మార్కెట్లోకి వచ్చేసరికి రూ.32లకు చేరింది. ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల పంటలు బాగా దెబ్బతిని నగరానికి కూరగాయల సరఫరా తగ్గిందని ఫలితంగా ధరలు కిందికి దిగిరావట్లేదని వ్యాపారులు సాకుగా చెబుతుండడం గమనార్హం.
     

మరిన్ని వార్తలు