ఉద్యోగాలు వచ్చుడు కాదు... ఊడుతున్నాయి

22 Mar, 2015 20:55 IST|Sakshi

కాగజ్‌నగర్ : తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఆశతో ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు నిరాశే మిగిలిందని, కొత్త ఉద్యోగాలు వచ్చుడు కాదు.. ఉన్న ఉద్యోగాలు ఊడుతున్నాయని టీడీఎల్పీ ఉప నేత రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లోని ఎస్పీఎం(సిర్పూర్ పేపర్ మిల్లు) కార్మికులకు మద్దతుగా నిర్వహించిన మహాధర్నాలో పాల్గొనడానికి వచ్చిన ఆయన స్థానికంగా విలేకరులతో సమావేశమయ్యారు. నిజాం నవాబు స్థాపించిన ఎస్పీఎం మూతపడడానికి ప్రభుత్వ విధానాలే కారణమని ఆరోపించారు. మన నీళ్లు, మన నిధులు, మన ఉద్యోగాలు అంటూ ఎన్నికలకు ముందు గొప్పలు చెప్పిన కేసీఆర్ మాటలు నీటి మూటలయ్యాయని అన్నారు.

గత సంవత్సరం సెప్టెంబర్ 27 నుంచి సిర్పూర్ పేపర్ మిల్లులో ఉత్పత్తి నిలిచిపోయి, మూతబడే స్థాయికి చేరుకోగా.. ఇప్పటివరకు సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు రాలేదని అన్నారు. మిల్లు గుర్తింపు కార్మిక సంఘానికి అధ్యక్షుడిగా సాక్షాత్తు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఉన్నా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు, వారి కుటుంబ సభ్యుల బాధలు, ఆకలి కేకలపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం కార్మిక సమస్యలపై కళ్లు మూసుకుందని ధ్వజమెత్తారు. ఎస్పీఎం సమస్యపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని, కార్మికుల పక్షాన పోరాటాలు చేస్తామని హామీ ఇచ్చారు. మిల్లు మూతపడిందనే మనస్తాపంతో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు పార్టీ తరఫున రూ.50 వేల చొప్పున  ఆర్థికసాయం అందిస్తామని ప్రకటించారు.
 

మరిన్ని వార్తలు