పాఠశాలలకో రేటింగ్‌

30 Sep, 2019 04:10 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌ : మార్కులను బట్టి విద్యార్థులకు గ్రేడ్లు ఇస్తుంటారు కదా.. మరి స్కూళ్లకు? స్కూళ్లకేమో రేటింగ్‌ ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. తద్వారా స్టార్‌ స్కూల్స్‌– 5 స్టార్‌ నుంచి 1 స్టార్‌ వరకు నిర్ణయించా లని చర్యలు చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో బోధనతోపాటు ఇతర అంశాల్లో మెరుగుదల సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు పరిశుభ్రతకు పట్టం.. క్రమశిక్షణకు పెద్దపీట.. స్వచ్ఛతకు చేయూత.. ఇదీ సర్కార్‌ బడుల ఇతర ప్రాధాన్యతాంశాలు.

ప్రతి అంశానికి మార్కులు.. ఆ మార్కుల ఆధారంగా స్కూళ్లకు రేటింగ్‌. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రోగ్రెస్‌ తీసుకురావాలని నిర్ణయించింది. విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్‌ బి.జనార్దన్‌రెడ్డి సూచన మేరకు ఆరు అంశాల్లో మార్కులు కేటా యించేందుకు విద్యాశాఖ పలు చర్యలు చేపట్టింది. ఈ మేరకు పాఠశాల విద్యాకమిషనర్‌ విజయ్‌కుమార్‌ డీఈవోలకు, ప్రధానోపాధ్యాయులకు పలు మార్గదర్శకాలను జారీ చేశారు.

మార్కులు ఇలా..

 

వ్యక్తిగత పరిశుభ్రత
పిల్లలు ప్రతిరోజు స్నానం చేయడం, మరుగుదొడ్డి వినియోగించాక, భోజనానికి ముందు సబ్బుతో చేతులు కడుక్కోవడం, గోర్లు కత్తిరించుకోవడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.

వంట సిబ్బంది..
వంట సిబ్బంది గోర్లు కత్తిరించుకోవడం, వారు జుట్టు ముడి వేసుకొని క్యాప్‌ ధరిం చడం, శుభ్రంగా చేతులు కడుక్కోవడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. 

రక్షిత నీరు..
రక్షిత మంచినీటిని అందుబాటులో ఉంచ డం, నీటి ట్యాంకును ప్రతినెలా శుభ్రం చేయ డం, తాగునీటి పాత్రలపై మూతలు పెట్టడం వంటి అంశాల్లో మార్కులు ఇస్తారు. 

మరుగుదొడ్లు..
మరుగుదొడ్లలో నీటిని అందుబాటులో ఉంచడం, శుభ్రమయ్యే వర కు నీరు పోయడం, బాలికల టాయిలెట్‌లో మూత కలిగిన చెత్తబుట్ట ఉంచటం వంటి వాటిని పరిగణనలోకి తీసుకుంటారు. 

పరిసరాల పరిశుభ్రత..
వ్యర్థ జలాన్ని మొక్కలకు మళ్లించడం, దాతల సహకారంతో పాఠశాల గదులకు సున్నం వేయించడం, తరగతి గదుల్లో చెత్త బుట్టలను అందుబాటులో ఉంచడం వంటి అంశాల ఆధారంగా మార్కులను ఇస్తారు. ఆ మార్కులను బట్టి రేటింగ్‌ ఇస్తారు. 

అడ్వొకసీకి అత్యధిక మార్కులు..
స్వచ్ఛ పాఠశాలలో భాగంగా అడ్వొకసీ విభాగానికి అత్యధిక మార్కులు ఇవ్వాలని నిర్ణయించింది. స్వచ్ఛతపై విద్యార్థుల్లో అవగాహన కల్పించి, వారు ఇతరులకు అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టడం, స్వచ్ఛత క్లబ్‌ల ఏర్పాటు, అమలు, స్వచ్ఛ నమస్కారం, 90 శాతానికి మించి నెలవారీ హాజరు అంశాలను పరిగణనలోకి తీసుకోనుంది. ప్రధానోపాధ్యాయుడు చైర్మన్‌గా, పీఈటీ/టీచర్‌ మెంబర్‌ కన్వీనర్‌గా, విద్యార్థుల భాగస్వామ్యంతో స్వచ్ఛత క్లబ్‌లను ఏర్పాటు చేయాలి. వీటన్నింటినీ స్వీయ మూల్యాంకనం చేసుకొని ప్రతి పాఠశాలకు రేటింగ్‌ ఇచ్చుకోవాలి. ఆ వివరాలను పై అధికారులకు తెలియజేయాలి.

మరిన్ని వార్తలు