ఘనంగా తెలంగాణ అవతరణ సంబరాలు

2 Jun, 2018 09:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావుతోపాటు పలువురు మంత్రులు పాల్గొననున్నారు. ఉదయం 10గంటలకు తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు గన్‌పార్క్‌లో సీఎం కేసీఆర్‌  నివాళులర్పించనున్నారు. 10:30గంటలకు పరేడ్‌ గ్రౌండ్‌లో జాతీయజెండాను ఆవిష్కరించనున్నారు. తర్వాత 11గంటల సమయంలో ఆయన ప్రసంగం ఉంటుంది. జిల్లాల్లో జరగనున్న వేడుకలకు మంత్రులతో పాటు ప్రముఖులు హాజరుకానున్నారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలంగాణ భవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు.  

ఆత్మగౌరవం కోసం తెలంగాణ సాధించుకున్నాం
హక్కులు, ఆత్మగౌరవం కోసమే తెలంగాణ సాధించుకున్నామని స్పీకర్‌ మధుసూదనాచారి అన్నారు. బంగారు తెలంగాణే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని అన్నారాయన. శనివారం అసెంబ్లీలో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలను పురష్కరించుకుని ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ శాసనమండలిలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. 

  • వికారాబాద్ : వికారాబాద్‌ పోలీసు గ్రౌండ్‌లో జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారాయన. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఊమర్ జలీల్, ఎంఎల్ఏ సంజీవరావు, యాదయ్య, ఎంఎల్సీ పట్నం నరేందర్ రెడ్డి, ఎస్పీ అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.
  • కొమురం భీం ఆసిఫాబాద్ : జిల్లా కేంద్రంలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగిన వేడకలకు రాష్ట్ర శాసన మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ పాల్గొన్నారు. అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన ఆయన ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు.
  • నల్గొండ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా స్థానిక క్లాక్ టవర్ సెంటర్‌లో అమరవీరుల స్థూపానికి శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ రావు, జెడ్పి చైర్మన్ బాలు నాయక్, జిల్లా అధికారులు నివాళులు అర్పించారు.  
  • ఖమ్మం : జిల్లాలో జరిగిన తెలంగాణ అవతరణ వేడుకలలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ పార్టీ జెండాను ఆవిష్కరించారాయన. ఈ కార్యక్రమంలో ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , ఎమ్మెల్యే అజయ్ కుమార్‌, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ , జడ్పీ చైర్ పర్సన్ గడిపల్లి కవిత తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది.
  • మహబూబ్ నగర్ జిల్లా : జిల్లాలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి మక్తల్ ఎంపీడీఓ, ఎంఆర్‌ఓ, మార్కెట్ కార్యాలయాల్లో జాతీయ జెండా ఎగుర వేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, అధికారులు పాల్గొన్నారు. 

లోటస్‌ పాండ్‌లో ఘనంగా తెలంగాణ అవతరణ వేడుకలు

హైదరాబాద్‌ : వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం లోటస్‌ పాండ్‌లో తెలంగాణ అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయజెండాను ఆవిష్కరించారాయన.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా