రూ.200 కంటే తక్కువకే ఫర్నీచర్‌ | Sakshi
Sakshi News home page

రూ.200 కంటే తక్కువకే ఫర్నీచర్‌

Published Sat, Jun 2 2018 9:45 AM

Ikea To Offer Its Products At Rs 200 Or Less - Sakshi

హైదరాబాద్‌ : స్వీడిష్‌కు చెందిన ఫర్నీచర్‌ దిగ్గజ కంపెనీ ‘ఐకియా’  భారత్‌లో ధరల యుద్ధానికి సిద్ధమైంది. ఈ జూలై నెలలో హైదరాబాద్‌లో తన ఫర్నీచర్‌ స్టోర్‌ను నెలకొల్పి, తొలిసారి భారత్‌లోకి అడుగుపెట్టబోతోంది. తొలిసారి భారత మార్కెట్‌లోకి వస్తున్న క్రమంలో తన 15 శాతం ఉత్పత్తులను 200 రూపాయలకు లేదా అంతకంటే తక్కువకే ఆఫర్‌ చేయబోతున్నట్టు టాప్‌ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ చెప్పారు. ఐకియా ప్రపంచంలోనే అతిపెద్ద ఫర్నీచర్‌ రిటైలర్‌. సరసమైన ధరల్లో ఈ కంపెనీ తన ఉత్పత్తులను ఆఫర్‌చేస్తోంది. భారత వినియోగదారుల కోసం ఈ ధరలను మరింత తగ్గించబోతున్నట్టు తెలిపారు. ‘తక్కువ ధరలతో మేము భారత మార్కెట్‌లోకి ఎంతో విశ్వాసంతో ప్రవేశిస్తున్నాం. స్టోర్‌ ప్రారంభించినప్పుడు 15 శాతం ఉత్పత్తులను అంటే 1000 ప్రొడక్ట్‌లను 200 రూపాయల కంటే తక్కువకు ఆఫర్‌ చేస్తాం’ అని ఐకియా ఇండియా మహారాష్ట్ర మార్కెట్‌ మేనేజర్‌ పర్‌ హార్నెల్‌ చెప్పారు. తమ రెండో స్టోర్‌ను ముంబైలో ఏర్పాటు చేస్తామని, దాన్ని 2019 మధ్యలో లాంచ్‌ చేయనున్నట్టు పేర్కొన్నారు. 

ఆశ్చర్యకరంగా ఐకియా, ముంబై లాంచ్‌ అనంతరం తన ఆన్‌లైన్‌ స్టోర్‌ను కూడా ఏర్పాటు చేయనుంది. డిజిటల్‌ విపరీతంగా పెరుగుతున్న క్రమంలో ఇప్పటి వరకు ఈ కంపెనీ ఆన్‌లైన్‌ అమ్మకాలపై అంత సీరియస్‌గా తీసుకోకపోవడం గమనార్హం. హోమ్‌ ఫర్నీసింగ్‌ కన్సల్టెన్సీ వంటి కొత్త బిజినెస్‌ మోడల్స్‌ను కూడా ఐకియా పరిశీలిస్తోంది. ఐకియా ఇటీవలే అర్బన్‌ క్లాప్‌ అనే మొబైల్‌ ఆధారిత సర్వీసు ప్లాట్‌ఫామ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. తన హైదరాబాద్‌ స్టోర్‌కు ఇదే ఫర్నీచర్‌ సర్వీసు పార్టనర్‌. తక్కువ ధరలకే సర్వీసులు అందజేయడానికి ఇది అనుమతి ఇస్తుందని హార్నెల్‌ చెప్పారు. భారత హోమ్‌ ఫర్నీచర్‌, ఫర్నీసింగ్‌ మార్కెట్‌ 2016 నుంచి 2021 మధ్యలో 13 శాతం కాంపౌండ్‌ వార్షిక వృద్ధిని సాధించినట్టు కన్సల్టెన్సీ సంస్థ వాజిర్‌ అడ్వయిజర్స్‌ పేర్కొంది. 2016 సెప్టెంబర్‌ నుంచి 2017 ఆగస్టు వరకు ఐకియా గ్రూప్‌ రెవెన్యూలు 1.7 శాతం పెరిగాయి. కంపెనీ వెబ్‌సైట్‌ 2.3 బిలియన్‌ హిట్స్‌ను సాధించింది. గ్లోబల్‌గా తమ రిటైల్‌ స్టోర్లను 936 మిలియన్‌ మంది సందర్శించినట్టు కూడా పేర్కొంది. మొత్తం 49 మార్కెట్లలో 403 స్టోర్లను ఐకియా కలిగి ఉంది.


 

Advertisement
Advertisement