ఎల్‌ఆర్‌ఎస్‌కు మరో అవకాశం! 

8 Jun, 2018 02:34 IST|Sakshi

ఫీజు చెల్లింపు, దరఖాస్తుల పరిష్కారానికీ గడువు పొడిగింపు 

సాక్షి, హైదరాబాద్‌: లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్‌) కింద దరఖాస్తు చేసుకుని గడువులోగా ఫీజు చెల్లించలేకపోయిన వారికి శుభవార్త. క్రమబద్ధీకరణ ఫీజు చెల్లించేందుకు మరో అవకాశం కల్పించాలనే ప్రతిపాదనలపై రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉంది. గత నెలాఖరుతో ముగిసిపోయిన ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిష్కారానికి సంబంధించిన గడువును మరో నెల రోజులు పొడిగించడంతో పాటు ఫీజు చెల్లించని వారికి మరో అవకాశం ఇచ్చేందుకు సూత్రప్రాయంగా నిర్ణయించింది. 

అనధికార లే అవుట్ల క్రమబద్ధీకరణ కోసం 2015, నవంబర్‌ 11న రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ను ప్రవేశపెట్టి నిర్దేశిత ఫీజులతో సహా దరఖాస్తుల సమర్పణకు 2016, మార్చి వరకు సమయమిచ్చింది. ఎల్‌ఆర్‌ఎస్‌ కింద 2.6 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అందులో 20 వేలకు పైగా దరఖాస్తుదారులు గడువులోగా ఫీజులు చెల్లించలేకపోయారు. రెండేళ్లుగా ఈ దరఖాస్తులు పెండింగ్‌లో ఉండిపోయాయి. ఫీజు బకాయిలను వడ్డీతో సహా చెల్లిస్తే ఈ దరఖాస్తులను సైతం పరిష్కరించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

దీంతో హెచ్‌ఎండీఏతో పాటు ఇతర పురపాలికలకు మరింత ఆదాయం రానుందని భావిస్తోంది. ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిష్కారానికి గడువు గత నెలాఖరుతో ముగిసింది. అప్పటికి హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ పరిధిలో దాదాపు 40 వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటి పరిష్కారం కోసం ప్రభుత్వం ఈ నెలాఖరులోగా గడువు పొడిగించనుంది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక శాఖ నుంచి ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు వచ్చే అవకాశముంది.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా