గ్రాట్యుటీకి ఓకే

24 May, 2018 02:24 IST|Sakshi

సీపీఎస్‌ ఉద్యోగులకు రిటైర్మెంట్, డెత్‌ గ్రాట్యుటీ

 ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

గరిష్టంగా రూ.12 లక్షల ప్రయోజనం

సాక్షి, హైదరాబాద్‌ : కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ పథకం (సీపీఎస్‌)లో ఉన్న ఉద్యోగులకు శుభవార్త. సీపీఎస్‌లో ఉన్న ఉద్యోగులకు గ్రాట్యుటీ వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రిటైర్మెంట్‌ గ్రాట్యుటీ, డెత్‌ గ్రాట్యుటీని వర్తింపజేసింది. 2004 సెప్టెంబర్‌ ఒకటో తేదీ నుంచి ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన వారందరికీ గ్రాట్యుటీ ప్రయోజనాలు కల్పిస్తూ రాష్ట్ర ఆర్థిక ముఖ్య కార్యదర్శి ఎన్‌.శివశంకర్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2004 సెప్టెంబర్‌ నుంచి ఈ గ్రాట్యుటీ చెల్లింపులు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. రాష్ట్రంలో మొత్తం 1.26 లక్షల మంది ఉద్యోగులు సీపీఎస్‌ పరిధిలో ఉన్నారు. వీరిలో ఇప్పటికే 998 మంది పదవీ విరమణ పొందగా, 263 మంది ఉద్యోగులు మరణించారు. తాజా ఉత్తర్వుల ప్రకారం ఈ కుటుంబాలన్నీ రిటైర్మెంట్‌ గ్రాట్యుటీ, డెత్‌ గ్రాట్యుటీ ప్రయోజనాలు పొందనున్నాయి.

పాత పెన్షన్‌ విధానంలో ఉన్న ఉద్యోగులకు ప్రస్తుతం గ్రాట్యుటీ చెల్లింపు అమల్లో ఉంది. ప్రస్తుతం పదవీ విరమణ చేసినప్పుడు లేదా చనిపోయిన సందర్భంలో గరిష్టంగా రూ.12 లక్షలకు మించకుండా గ్రాట్యుటీ చెల్లిస్తోంది. అయితే సీపీఎస్‌లో ఉన్న ఉద్యోగులకు మాత్రం ఇప్పటివరకు గ్రాట్యుటీ లేకపోవడంతో ఆందోళన వ్యక్తమైంది. సీపీఎస్‌ రద్దు చేయాలని ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సీపీఎస్‌ ఉద్యోగులకు ఈ గ్రాట్యుటీ  ప్రయోజనాలను విస్తరించడంతో కొంతమేరకు ఊరట లభించనుంది. గత ఏడాది ఆగస్టులోనే సీపీఎస్‌లో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గ్రాట్యుటీని వర్తింపజేసింది. అన్ని రాష్ట్రాలు అక్కడి పరిస్థితులకు అనుగుణంగా గ్రాట్యుటీ చెల్లించే అవకాశాలను పరిశీలించాలని సూచించింది. కేంద్రం సూచన మేరకు ఇప్పటికే ఏపీ, హర్యానాతో పాటు పలు రాష్ట్రాలు సీపీఎస్‌లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గ్రాట్యుటీని వర్తింపజేశాయి. రాష్ట్రంలోనూ గ్రాట్యుటీ చెల్లిస్తామని ఇటీవలే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఉత్తర్వులు వెలువడ్డాయి.  
   

మరిన్ని వార్తలు