మున్సి‘పోల్స్‌’కు ముందడుగు

25 Jun, 2019 01:38 IST|Sakshi

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గణన షురూ

వచ్చే నెల 19న తుది జాబితా

ఆ తర్వాత ఎప్పుడైనా ఎన్నికలు

సాక్షి, హైదరాబాద్‌ : మున్సి‘పోల్స్‌’కు ముందడుగు పడింది. ఎన్నికల క్రతువులో కీలక ఘట్టానికి తెరలేచింది. రిజర్వేషన్ల ఖరారుకు ప్రాతిపదికగా భావించే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియను ప్రభుత్వం చేపడుతోంది. ప్రస్తుత పురపాలికల పదవీకాలం వచ్చే నెల 2వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో పురపాలక సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని కృతనిశ్చయంతో ఉన్న సర్కారు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపునకు ఇంటింటి సర్వే మొదలుపెట్టింది. వాస్తవానికి గత ఫిబ్రవరిలోనే ఈ సామాజికవర్గాల ఓటర్లను పురపాలక శాఖ గుర్తించింది. తాజాగా గుర్తించిన ఓటర్లను పరిశీలించి జాబితా సిద్ధం చేసే పనిలో నిమగ్నమైంది. శనివారం ప్రారంభమైన డోర్‌ టు డోర్‌ సర్వే వచ్చే నెల నాలుగో తేదీ వరకు కొనసాగనుంది. ఆ తర్వాత ఐదో తేదీన జాబితాను పరిశీలించి ఆరో తేదీన ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రదర్శించనున్నారు. మున్సిపాలిటీ/నగర పాలక సంస్థ, ఆర్డీఓ, తహసీల్దార్‌ కార్యాలయాల్లో ప్రదర్శించడమే కాకుండా.. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు ప్రతిని అందజేయనున్నారు. 

5 రోజులు అభ్యంతరాల స్వీకరణ.. 
ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను జూలై 7 నుంచి 11వ తేదీ వరకు స్వీకరించనున్నారు. ఈ అభ్యంతరాలు/క్లెయిమ్స్‌ను 12 నుంచి 14వ తేదీలలో పరిశీలించి 15, 16వ తేదీలలో క్షేత్రస్థాయిలో విచారించి పరిష్కరించనున్నారు. ఆ తర్వాత ఓటర్ల జాబితాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్లను గుర్తించేలా మార్కింగ్‌ చేసి జూలై 19వ తేదీన మున్సిపాలిటీల్లో ఓటర్ల తుది జాబితాను ప్రకటించనున్నారు. ఓటర్ల జాబితా అందుబాటులోకి రాగానే వార్డులు, మేయర్‌/చైర్‌పర్సన్‌ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. 

జూలైలోనే ఎన్నికలు..? 
కొత్త పురపాలక చట్టం తీసుకొచ్చిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో మున్సిపల్‌ యాక్ట్‌ డ్రాఫ్ట్‌ కాపీని న్యాయశాఖకు పంపించింది. అయితే చట్టం తీసుకురావడంలో జాప్యం జరుగుతుండటంతో నిర్ణీత గడువులోగా ఎన్నికలు నిర్వహించలేమని ఇటీవల పురపాలకశాఖ హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్‌లో స్పష్టం చేసింది. పాలకవర్గాల కాలపరిమితి ముగుస్తున్నా ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలేదని రాష్ట్ర ఎన్నికల సంఘం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేసినందున సకాలంలో ఎన్నికలు నిర్వహించలేమని, వార్డుల విభజన, ఓటర్ల జాబితా, రిజర్వేషన్ల ఖరారుకు 151 రోజుల సమయం పడుతుందని, అందువల్ల ఎన్నికలకు వ్యవధి కావాలని ప్రభుత్వం కోరింది. అయితే అదేరోజు ముఖ్యమంత్రి కేసీఆర్‌ జూలైలో పురపోరు జరుగుతుందని, ఈ మేరకు రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను చేపట్టాలని పురపాలకశాఖ కార్యదర్శిని ఆదేశించినట్లు ప్రకటించారు. దీంతో ఎన్నికల నిర్వహణపై కొంత సందిగ్ధత కనిపించింది. ఒకవైపు దాదాపు ఐదు నెలలు కావాలని కోర్టులో కౌంటర్‌ దాఖలు చేస్తునే మరోవైపు ఎన్నికలకు సీఎం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో ఒకింత ఆయోమయం నెలకొంది.

అయితే తాజాగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపునకు చకచకా షెడ్యూల్‌ ప్రకటించడం, ఇది వచ్చే నెల మూడో వారంలోగా ముగియనుండటంతో సీఎం మదిలో ఉన్నట్లు జూలై చివర్లో లేదా ఆగస్టు మొదటి వారంలో పురపోరుకు నగారా మోగే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల నిర్వహణకు ముందస్తు కసరత్తుకు ఐదు నెలల టైమ్‌లైన్‌ అవసరమని భావించినా ఓటర్ల గుర్తింపు, అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం, వార్డుల విభజనను ఏకాకాలంలో పూర్తి చేసుకోవడం ద్వారా కొన్నింటి సమయం తగ్గించవచ్చని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. అదే సమయంలో రాజ్యాంగబద్ధంగా కొన్నింటికి మాత్రం గడువు కచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టం చేస్తున్నాయి. అయితే వార్డుల విభజన ప్రక్రియను అంతర్గతంగా పూర్తి చేయడంతో ఓటర్ల గణనను సర్కారు యుద్ధప్రాతిపదికన చేస్తోంది. ఆర్డినెన్స్‌ ద్వారా చట్టం తీసుకురావడమే తరువాయి రిజర్వేషన్లను ఖరారు చేయనుంది. 

జూలై 2న ముగియనున్న గడువు... 
ప్రస్తుత పాలకవర్గాల పదవీకాలం జూలై 2వ తేదీతో ముగియనుంది. జీహెచ్‌ఎంసీ, గ్రేటర్‌ వరంగల్, సిద్దిపేట, ఖమ్మం, అచ్చంపేట మినహా మిగతా 53 మున్సిపాలిటీలు, మూడు నగర పాలక సంస్థల కాలపరిమితికి ఆ రోజు తెరపడనుంది. అయితే వేగంగా జరుగుతున్న పట్టణీకరణతో 68 కొత్త పురపాలికలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తాజాగా వాటికి కూడా పాలకవర్గాలను ఎన్నుకోవాల్సివుంది. అయితే జడ్చర్ల గ్రామ పంచాయతీని బాదేపల్లి మున్సిపాలిటీలో విలీనం చేయడం, నకిరేకల్‌కు వచ్చే ఏడాది చివరి వరకు కాలపరిమితి ఉండటంతో వాటికి మినహా మిగతా వాటికి ఎన్నికలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది. గ్రేటర్‌ హైదరాబాద్, గ్రేటర్‌ వరంగల్, ఖమ్మం, సిద్దిపేట, అచ్చంపేట మున్సిపాలిటీలకు మాత్రం మరో రెండేళ్ల హయాం మిగిలి ఉంది. 

మరిన్ని వార్తలు