వేలానికి స్వగృహ ఇళ్లు 

11 Mar, 2020 02:04 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అమ్ముడుపోకుండా ఏళ్లుగా పాడుబడ్డ గూళ్ల తరహాలో ఉండిపోయిన రాజీవ్‌ స్వగృహ ఇళ్లను వేలంలో అమ్మేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం విధివిధానాలను ఖరారు చేసేందుకు ప్రభుత్వ కార్యదర్శులతో ఉన్నతస్థాయి త్రిసభ్య కమిటీని నియమించింది. గృహనిర్మాణ శాఖను పర్యవేక్షిస్తున్న ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్‌లు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ‘ఉన్నవి ఉన్నట్టుగా’బండ్లగూడ, పోచారంలలో ఉన్న గృహ సముదాయాలను వేలం ద్వారా అమ్మేయనున్నారు.

ఆ ఇళ్లకు ఏ ధర నిర్ణయించాలో తేల్చేందుకు రియల్‌ ఎస్టేట్‌ రంగంలో అనుభవం ఉన్న సంస్థను కన్సల్టెంటుగా నియమించనున్నారు. ఈ ప్రక్రియను త్రిసభ్య కమిటీ పర్యవేక్షిస్తుంది. కాగా, ఇప్పటికే కొన్ని ప్రైవేటు రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు ఆ ఇళ్లను గుండుగుత్తగా కొనేందుకు ఏర్పాటు చేసుకుంటున్నట్టు సమాచారం. బండ్లగూడ, పోచారంలో దాదాపు నాలుగువేల ఇళ్లతో కూడిన సముదాయాలు సిద్ధంగా ఉన్నాయి. గాజుల రామారం, జవహర్‌నగర్‌లలో అసంపూర్తి నిర్మాణాలు ఉన్నా, వాటి విషయంలో త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

మరిన్ని వార్తలు