కేసీఆర్‌ సర్కార్‌కు హైకోర్టు షాక్‌..

1 Oct, 2019 17:11 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి భారీ షాక్‌ తగిలింది. సచివాలయం కూల్చివేతకు తెలంగాణ హైకోర్టు నో చెప్పింది. సచివాలయం కూల్చివేత పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం.. స్టే ఇచ్చింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు సచివాలయ భవనాలను కూల్చొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దసరా సెలవుల తర్వాత ఈ పిటిషన్‌పై విచారణ చేపడతామని తెలిపింది.

అయితే కొత్త సచివాలయ భవన సముదాయ​నిర్మాణంపై మంత్రివర్గ ఉపసంఘం సమర్పించిన నివేదికను నేడు తెలంగాణ కేబినెట్‌ ఆమోదించనున్న వార్తల నేపథ్యంలో కోర్టు ఈ తీర్పు వెలువడటం గమనార్హం. కేబినెట్‌ భేటీ అనంతరం సచివాలయ భవనాల కూల్చివేత, కొత్త సచివాలయ భవన సముదాయం నిర్మాణానికి సంబంధించిన పనులకు శ్రీకారం చుట్టాలని భావించిన కేసీఆర్‌ సర్కార్‌కు కోర్టు తీర్పుతో ఎదురుదెబ్బ తగిలినట్టు అయింది.

మున్సిపల్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ ఇవ్వొద్దు : హైకోర్టు
అలాగే మున్సిపల్‌ ఎన్నికలపై దాఖలైన పిటిషన్‌ తేలేంత వరకు ఎన్నికల నోటిఫికేషన్‌ ఇవ్వొద్దని మరో కేసులో హైకోర్టు ఆదేశించింది. గతంలో ఎన్నికల కమిషన్‌ పాటించిన విధానాన్ని పాటించాలని సూచించింది. అలాగే ఎన్నికల ముందు జరిగే ప్రక్రియ మొత్తం పూర్తి చేసుకోవచ్చని తెలిపింది. దసరా సెలవుల తర్వాత దీనిపై విచారణ చేపట్టనున్నట్టు కోర్టు తెలిపింది. 

సెలవుల నేపథ్యంలో అత్యవసర బెంచ్‌ల ఏర్పాటు
హైకోర్టుకు దసరా సెలవుల నేపథ్యంలో కేసుల విచారణకు అత్యవసర బెంచ్‌లను ఏర్పాటు చేయనున్నట్టు హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ తెలిపారు. ఈ నెల 9,10 తేదీలలో డివిజన్‌ బెంచ్‌, సింగిల్‌ బెంచ్‌ ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. కాగా, దసరా పండుగ సందర్భంగా ఈ నెల 3 నుంచి 11 వరకు హైకోర్టుకు సెలవులు ఉంటాయని హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు