చల్లబడ్డ తెలంగాణ

2 Mar, 2015 01:47 IST|Sakshi
చల్లబడ్డ తెలంగాణ

* ద్రోణి ప్రభావంతో అక్కడక్కడ వర్షాలు
* వారంపాటు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం
* హైదరాబాద్‌లో పలు చోట్ల తేలికపాటి జల్లులు
* స్వైన్‌ఫ్లూ విజృభించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్న వైద్యులు
* గాంధీలో 28 పాజిటివ్ కేసుల నమోదు

 
సాక్షి, హైదరాబాద్: కొద్ది రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా, ఆదివారం వాతావరణం చల్లబడింది. ఎండ సెగతో ఉక్కిరిబిక్కిరవుతున్న వారు పలుచోట్ల చిరుజల్లులతో ఉపశమనం పొందారు. వాతావరణంలో ఏర్పడిన వెస్ట్రన్ డిస్టర్బెన్స్ కారణంగా తెలంగాణ నుంచి రాయలసీమ వరకు ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో తెలంగాణ, ఏపీలలో రాగల 48 గంటల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

ఈ ద్రోణి ప్రభావం మరో వారం రోజులపాటు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్త సీతారాం ‘సాక్షి’కి తెలిపారు. ఈ వారంరోజులు అధిక ఉష్ణోగ్రతల నుంచి స్వల్ప ఉపశమనం ఉంటుందని, తరువాత గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగే అవకాశాలున్నాయన్నారు. ద్రోణి ప్రభావంతో హైదరాబాద్‌లో ఆదివారం పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. గరిష్టంగా 27.7 డిగ్రీలు, కనిష్టంగా 18.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ 66 శాతంగా నమోదైంది.
 
 స్వైన్‌ఫ్లూ టై: వాతావరణంలో తేమ శాతం బాగా పెర గడం, గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గడంతో స్వైన్‌ఫ్లూ వైరస్ హెచ్1ఎన్1 విజృంభించే అవకాశాలుండడం ఆందోళన కలిగిస్తోంది. ముందుజాగ్రత్తలు తీసుకోకుంటే అనర్థాలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు బహిరంగ ప్రదేశాల్లో తిరిగే సమయాల్లో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు. ఆదివారం గాంధీ ఆస్పత్రిలో 28 స్వైన్‌ఫ్లూ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, వీరిలో ఐదుగురు చిన్నారులు కూడా ఉన్నారని వైద్యులు తెలిపారు. మరో 35 స్వైన్‌ఫ్లూ అనుమానిత కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు