ఆద్యంతం.. ఉత్సాహం

19 Nov, 2014 03:34 IST|Sakshi
ఆద్యంతం.. ఉత్సాహం

కరీంనగర్ సిటీ:  రామ్‌గోపాల్ వర్మ కరీంనగర్‌కు ఉదయం చేరుకున్నది మొదలు అభిమానులు, కళాకారులు  చూసేందుకు, కలిసేందుకు ఎగబడ్డారు. శ్వేతహోటల్‌లో దిగగానే పలువురు అభిమానులు ఆయనకు ఘనస్వాగతం పలికా రు. అక్కడినుంచి దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న చల్మెడ ఆనందరావు మెడికల్ కళాశాల ఆడిటోరియం వరకు రాంగోపాల్‌వర్మ వెంట వందల సంఖ్యలో అనుసరించారు.

ఆడిటోరియంలో ఏకధాటిగా రెండు గంటలపాటు ఔత్సాహికులు, అభిమానులు, విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలిస్తూ ఉత్తేజపరిచారు. ముఖ్యంగా తాము సిని మాలు తీయగలమా అనే మీమాంసలో ఉన్న ఔత్సాహికుల్లో మనోధైర్యం నింపి, సినిమా తీయడం ఎంత సులువో వివరించారు. ఉదాహరణగా తాను ఇటీవల తీసిన ‘ఐస్‌క్రీం2’ సినిమా క్లిప్పిం గ్ ప్రదర్శించి, అతి తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో సినిమా ఎలా తీయొచ్చో చూపిం చారు.

తాను ఈ సినిమాకు మూడు కెమెరాలు వాడానని చెప్పిన వర్మ మూడో కెమెరా తన సెల్‌ఫోనేనని చెప్పారు. సరైన ఆలోచనతో సెల్‌ఫోన్‌లోనూ సినిమా తీసేయొచ్చన్న వర్మ కాన్సెప్ట్ ఔత్సాహికుల్లో ఆసక్తిని రేపింది. కరీంనగర్ జిల్లాతో పాటు తెలంగాణలోని ఇత ర జిల్లాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి కూడా పలువురు ఔత్సాహికులు ఈ కార్యక్రమానికి హాజరై తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.

మరిన్ని వార్తలు