యంత్రం...గుంతలకు మంత్రం

28 Sep, 2014 00:18 IST|Sakshi
యంత్రం...గుంతలకు మంత్రం
  • బెంగళూర్ తరహాలో పూడ్చివేత
  • పరిశీలిస్తున్న జీహెచ్‌ఎంసీ
  • త్వరలో వినియోగంలోకి
  • సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని రహదారులపై గుంతల (పాట్‌హోల్స్‌ను) పూడ్చివేతకు అధునాతన యంత్రాన్ని తీసుకొచ్చేందుకు జీహెచ్‌ఎంసీ యత్నిస్తోంది. ఈ తరహా పనులకు ఇప్పటికే రోడ్ డాక్టర్ అనే యంత్రాన్ని వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. దీనికంటే మెరుగైన యంత్రాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు యత్నిస్తోంది. బెంగళూరు, ఢిల్లీల్లో ఈ పనులు నిర్వహిస్తున్న రెండు కాంట్రాక్టు సంస్థలతో జీహెచ్‌ఎంసీ ఇంజినీర్ ఇన్ చీఫ్ ధన్‌సింగ్, చీఫ్ ఇంజినీర్ సురేష్‌కుమార్, తదితరులుశనివారం సమావేశమయ్యారు. కాంట్రాక్టు ప్రతినిధులు ఆయా నగరాల్లో తాము వినియోగిస్తున్న వివిధ రకాల యంత్రాల పనితీరును వారికి వివరించారు.

    వీటిల్లో గ్రేటర్‌కు ఏది అనువుగా ఉంటుందనే విషయమై కమిషనర్ సోమేశ్ కుమార్‌తో చర్చించాక నిర్ణయం తీసుకోనున్నారు. ఆధునిక యంత్రాలతో ఖర్చు చాలా వరకూ తగ్గనున్నట్టు తెలుస్తోంది. బెంగళూర్‌లో గత ఏడాదిగా ఆధునిక పద్ధతిలో గుంతలు పూడుస్తున్నారు.అక్కడ నాలుగు లేన్ల రోడ్లలో పనులకు కి.మీ.కు ఏడాదికి రూ.85 వేల వంతున చెల్లిస్తున్నారు. నగరంలో అది మరింత తగ్గేందుకు అవకాశం ఉందని ప్రతినిధులు జీహెచ్‌ఎంసీ అధికారులకు వివరించారు.
     
    ఇదీ పనితీరు

    కెనడా రూపొందించిన పైథాన్-5000 అనే వాహనాన్ని వినియోగించడం ద్వారా మూడు నిమిషాలకో గుంతను పూడ్చి వేయవచ్చని సంబంధిత ప్రతినిధులు తెలిపారు. బెంగళూర్‌లో గడచిన పది నెలల్లో 1400 గుంతలు పూడ్చి వేశామన్నారు. కెనడా, అమెరికా, బ్రెజిల్‌లలో ఈ వాహనాలతో రోడ్ల మరమ్మతులు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు గుంతల పూడ్చివే తతో పాటుచదును చేసే పనిని కూడా వెంటనే పూర్తి చేస్తుంది. దీని వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవు. వర్షం నీటిలో సైతం దీని ద్వారా పనులు చేసేందుకు వీలవుతుంది. దీన్ని వినియోగించేందుకు ఒక్కరున్నా సరిపోతుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో వినియోగిస్తున్న యంత్రాలను ఢిల్లీలో ఉపయోగిస్తున్నారు. జెట్ ప్యాచర్‌గా వ్యవహరించే దీనితో 15 నిమిషాల్లో గుంతను పూడ్చవచ్చు.

    నగర రోడ్లకు ఏది ఎక్కువ సదుపాయంగా ఉంటుంది? దేనికి ఎంత ఖర్చవుతుంది? ఒకసారి గుంత పూడ్చాక ఎంతకాలం వరకు మన్నికగా ఉంటుంది తదితర అంశాలు అధ్యయనం చేశాక తగిన యంత్రాలను గ్రేటర్‌లో వినియోగించాలని యోచిస్తున్నారు. మెట్రోపొలిస్ సదస్సు సమయంలో ఒక వేళ వర్షం కురిస్తే.. దెబ్బతిన్న రోడ్లకు వెనువెంటనే మరమ్మతులు చేసేందుకు ఇవి ఉపయోగకరంగా ఉంటాయని యోచిస్తున్నారు. వీలైతే ప్రయోగాత్మకంగా వీటి పనితీరును పరిశీలించాలని భావిస్తున్నారు.
     

మరిన్ని వార్తలు