ఆ ఇద్దరు ఉగ్రవాదుల్ని హాజరుపర్చండి

18 Apr, 2014 03:52 IST|Sakshi
ఆ ఇద్దరు ఉగ్రవాదుల్ని హాజరుపర్చండి

సాక్షి, హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్‌లోని ఏ-1 మిర్చ్ సెంటర్, 107 బస్టాప్‌ల వద్ద గతేడాది ఫిబ్రవరి 21న జరిగిన జంట పేలుళ్ల కేసుల్లో నిందితులుగా ఉన్న ఇద్దరు ఉగ్రవాదుల్ని సిటీకి తరలించడానికి వీలుగా నాంపల్లి కోర్టు గురువారం పీటీ వారెంట్లు జారీ చేసింది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) చేసిన అభ్యర్థన మేరకు ప్రస్తుతం ఢిల్లీ పోలీసు కస్టడీలో ఉన్న వఖాస్, తెహసీన్ అక్తర్‌లను వచ్చే నెల 9న హాజరుపర్చాలని స్పష్టం చేసింది.

జంట పేలుళ్లకు బాంబుల తయారీ, 107 బస్టాప్‌లో విధ్వంసానికి కారణమైన ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాది, పాకిస్తానీ జియా ఉర్ రెహ్మాన్ అలియాస్ వఖాస్‌ను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు గతనెల 23న రాజస్తాన్‌లో అరెస్టు చేశారు. ‘దిల్‌సుఖ్‌నగర్ కేసు’లో ఇతడు మూడో నిందితుడు (ఏ-3)గా ఉన్నాడు. అలాగే, ఏ-1 మిర్చ్ సెంటర్ దగ్గర బాంబుతో కూడిన సైకిల్‌ను పెట్టి వెళ్లిన తెహసీన్ అక్తర్ అలియాస్ మోను కూడా గతనెల 25న ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులకే చిక్కాడు.

వీరిద్దరినీ కస్టడీకి తీసుకునే విషయంలో ఢిల్లీ పోలీసులు, జాతీయ దర్యాప్తు సంస్థ మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. ఎట్టకేలకు వీరిద్దరినీ ఢిల్లీ హైకోర్టు స్పెషల్ సెల్ కస్టడీకే అప్పగించింది.  బుధవారం వీరి కస్టడీ పొడిగింపు పిటిషన్ విచారణ సమయంలో దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసులో తమ దర్యాప్తు సక్రమంగా జరగకుండా ఢిల్లీ స్పెషల్ సెల్ అడ్డుపడుతూ, వేధిస్తోందంటూ ఎన్‌ఐఏ ఢిల్లీ హైకోర్టుకు నివేదించింది.

ఈ పరిణామాల మధ్య నాంపల్లి కోర్టు ద్వారా వీరిద్దరిపై ఎన్‌ఐఏ అధికారులు ప్రిజనర్స్ ట్రాన్సిట్ (పీటీ) వారెంట్ తీసుకున్నారు. ప్రణాళిక ప్రకారం ఇరువురినీ వచ్చే నెల 9న సిటీకి తీసుకురాగలిగితే... మరో పిటిషన్ దాఖలు చేసి తమ కస్టడీలోకి తీసుకుని దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసులో విచారించాలని ఎన్‌ఐఏ భావిస్తోంది. ఈ కేసులో రెండు, ఐదో నిందితులుగా ఉన్న అసదుల్లా అక్తర్, యాసీన్ భత్కల్‌లను గత ఏడాదే నగరానికి తరలించి విచారించిన విషయం విదితమే.

మరిన్ని వార్తలు