పెద్ద చదువులు.. చిల్లర బుద్ధులు

9 Oct, 2014 04:04 IST|Sakshi
పెద్ద చదువులు.. చిల్లర బుద్ధులు

- చైన్‌స్నాచింగ్ లకు పాల్పడుతున్న ఇంజినీరింగ్, డిగ్రీ విద్యార్థులు
- జల్సాల కు అలవాటుపడి నేరాలు
- ఏటా పెరుగుతున్న కేసులు
- మూడు గ్యాంగ్‌లను పట్టుకున్న పోలీసులు

నిజామాబాద్ అర్బన్ : జిల్లాలో చైన్‌స్నాచింగ్ ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఒక్క సెప్టెంబర్ నెలలో 12 రోజుల వ్యవధిలో పది చైన్‌స్నాచింగ్‌లు జరిగాయి. పెరుగుతున్న చైన్‌స్నాచింగ్ కేసులు పోలీసులకు సవాలుగా మారాయి. మహిళలు ఒంటరిగా బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. కనీసం మహిళలు ఇళ్ల ముందర ధైర్యంగా కల్లాపి చల్లాలంటే జంకాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో మెడలో బంగారు ఆభరణాలు ధరించాలని మహిళలు భయపడుతున్నారు. నిందితుల్లో ఇంజినీరింగ్, డిగ్రీ విద్యార్థులు ఉండడం విస్మయం గొలుపుతోంది. జల్సాలకు అల వాటు పడి వారు ఇలాంటి నేరాలకు పాల్పడుతుండడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.
 
రోజురోజుకు...
జిల్లాలో ఐదేళ్లలో 413 చైన్ స్నాచింగ్ కేసులు నమోదయ్యాయి.  2009లో 30 , 2010లో 75, 2011లో 81, 2012లో 89 , 2013లో 121 , 2014 ఇప్పటి వరకు 48 కేసులు నమోదయ్యాయి. *1.18 కోట్ల సొత్తు అపహరణకు గురైంది. ఒక్క ఆగస్టు నెలలోనే  2,4,6,8,11,30 తేదీల్లో వేరువేరు చోట్ల రెండు నుంచి మూడు చైన్‌స్నాచింగ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల తీరు ఇటీవల విపరీతంగా పెరగడం పోలీసులకు ఆందోళన కలిగించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చైన్‌స్నాచర్ల ఆటను కట్టించడానికి పూనుకున్నారు. దీంతో దొరికిన ఒకరిని విచారించి మూడు గ్యాంగ్‌లను పట్టుకుని అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి  *12 లక్షల విలువగల బంగారం, ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి చైన్‌స్నాచర్ల వివరాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
 
జల్సాలకు అలవాటుపడి...
ఇంజినీరింగ్, డిగ్రీ విద్యనభ్యసిస్తున్న పలువురు విద్యార్థులు జల్సాలకు అలవాటుపడి చైన్‌స్నాచింగ్‌కు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణ తెలిసింది. ఖరీదైన ఫోన్లు, బైకులు, దుస్తులు కొనుగోలు చేయడం, అమ్మాయిలకు వలవేయడం వంటి కార్యక్రమాలకు డబ్బులు ఎక్కువ మొత్తంలో అవసరం పడడంతో చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు. తేలికగా డబ్బులు రావడం, జల్సాలు చేయడం  అలవాటుగా మారి ఈ నేరాలను కొనసాగిస్తున్నారు.
 
చదువులకు పంపిస్తే...
నిజామాబాద్ మండలం కాలేపల్లి క్యాంపునకు చెందిన గణేష్ జిల్లాకేంద్రంలోని ఓ డిగ్రీ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. మహేశ్‌రెడ్డి జిల్లాకేంద్రంలోని ఖలీల్‌వాడీలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అలాగే కాలేపల్లి క్యాంపునకు చెందిన లక్కు నవీన్‌రెడ్డి డిగ్రీ విద్యను అసభ్యసిస్తున్నారు. వీరు చోరీ చేసిన బంగారు మంగళసూత్రాలు, చైన్‌లను ఇతర ప్రాంతాల్లో అమ్మేవారు.

వచ్చిన డబ్బు ద్వారా ఖరీదైన ఫోన్లు, దుస్తులు కొనుగోలు చేయడం , అమ్మాయిల వెంట పడడం, ఖరీదైన గిఫ్టులతో వారిని ఆకర్షింపజేసుకోవడం పనిగా పెట్టుకునేవారు. ఇలా చేతిలో డబ్బులు ఉన్నన్ని రోజులు జల్సాలు చేసేవారు. డబ్బులు అయిపోగానే మళ్లీ  చైన్‌స్నాచింగ్ చేసేవారు. జిల్లాకేంద్రంలోని పలువురు ఇంజినీరింగ్ విద్యార్థులు కూడా ఈ చైన్‌స్నాచింగ్‌లో ముఖ్యులుగా ఉన్నారు. పేద, మధ్య తరగతి విద్యార్థులతో, ఇందులో ప్రముఖ నాయకుల కుమారులు ఉండడం గమనార్హం. ఒక ప్రముఖ పార్టీ నాయకుడి కుమారుడు చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడడం పోలీసులనే విస్మయానికి గురిచేసింది.  
 
తనిఖీల్లో పట్టుబడి...
చైన్‌స్నాచింగ్‌కు పాల్పడుతున్న మూడు గ్యాంగులు పోలీసులకు చిక్కాయి. వీరిని ఆరా తీసిన పోలీసులు వివరాలు తెలుసుకొని ఆశ్చర్యపోయారు. ఈనెల 8న కమ్మర్‌పల్లి పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. మెట్‌పల్లి వైపు నుంచి నలుగురు యువకులు నెంబర్‌ప్లేటు లేని బైకులపై వస్తున్నారు. వీరిని పోలీసులు తనిఖీలు చేయగా వారి వద్ద నుంచి మంగళసూత్రాలు, చైన్‌లు లభించాయి.

ఇందులో మోర్తాడ్ మండలం తొర్తి గ్రామానికి చెందిన గజానంద్, పెర్కిట్ గ్రామానికి చెందిన మహ్మద్ ఇలియాస్, కాలేపల్లి క్యాంపునకు చెందిన గణేష్ , లక్క నవీన్‌రెడ్డి ఉన్నారు. వీరిని పోలీసులు విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అలాగే నిజామాబాద్ ప్రాంతంలో చైన్‌స్నాచింగ్ పాల్పడుతున్న మరో గ్యాంగ్‌ను పోలీసులు పట్టుకున్నారు. వీరు చేసిన చైన్‌స్నాచింగ్ వివరాలను గుర్తించి కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. చైన్‌స్నాచింగ్‌లను ఊపేక్షించమని, కఠినంగా వ్యవహరిస్తామని జిల్లా పోలీసులు హెచ్చరిస్తున్నారు.
 
‘గతనెల 6వ తేదీ జిల్లాకేంద్రంలోని వినాయక్‌నగర్‌లో ఏఆర్ ఎస్సై ప్రతాప్ భార్య లక్ష్మి ఉదయం ఇంటి ముందు వాకిలి ఊడుస్తుంది. అటుగా ఇద్దరు యువకులు పల్సర్‌బైక్‌పై వచ్చి ఓ ఇంటి అడ్రస్ అడిగారు. ఆమె వారి మాటలు వినేలోపు మెడలో ఉన్న మూడు తులాల బంగారు గొలుసును తెంపుకుని పరారయ్యారు. జరిగిన సంఘటనతో హతాశులవడం ఆమె వంతైంది.
 
జిల్లాలో ఇటీవలి కాలంలో చైన్‌స్నాచింగ్ కేసులు పెరిగాయి. మహిళలు బంగారు ఆభరణాలు ధరించి బయటకు వెళ్లాలంటేనే జంకాల్సిన పరిస్థితి నెలకొంది. కనీసం వాకిలీ ఊడవడం, ఇళ్ల ముందర కల్లాపి చల్లుదామన్న భద్రతా లేకుండా పోయింది. ఎందుకంటే ఎక్కడి నుంచి వస్తారో.. ఎలా వస్తారో తెలియదు చైన్‌స్నాచర్లు. కళ్లు తెరచి చూసేలోపు పనికానిచ్చేస్తున్నారు. నిందితుల్లో ఎక్కువగా ఇంజినీరింగ్, డిగ్రీ విద్యార్థులు ఉండడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. జల్సాలకు అలవాటు పడి, సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశకు పోయి వారు ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు