కడెం డివిజన్‌లో పులి సంచారంపై అప్రమత్తం

17 Dec, 2018 10:05 IST|Sakshi
పులి అడుగులు సేకరిస్తున్న అటవీ సిబ్బంది  

కవ్వాల్‌ టైగర్‌జోన్‌లో పులి రాకపై ఆశలు

అనువుగా ఉండేందుకు అధికారుల చర్యలు

సాక్షి, జన్నారం(ఖానాపూర్‌): కడెం డివిజన్‌లోని పాడ్వాపూర్‌ బీట్‌ ప్రాంతంలో పులి సంచారం నేపథ్యంలో కవ్వాల్‌ టైగర్‌జోన్‌ పరిధిలోని జన్నారం అటవీ డివిజన్‌ అధికారులు అప్రమత్తం అయ్యారు. పాడ్వాపూర్‌ బీట్‌ పరిధిలోని గంగాపూర్‌ ప్రాంతం, ఇస్లాంపూర్‌ అడవి నుంచి కవ్వాల్‌ సెక్షన్‌లో పులి పర్యటించే అవకాశం ఉంది. దీంతో ఆదివారం ఇందన్‌పల్లి రేంజ్‌ అధికారి శ్రీనివాసరావు అధ్వర్యంలో అధికారులు కవ్వాల్‌ టైగర్‌జోన్‌ పరిధిలోని కవ్వాల్‌ సెక్షన్‌లోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. పులి అడుగులు, ఇతర గుర్తింపులు ఏమైనా ఉన్నాయా అని పరిశీలించారు. అటవీ ప్రాంతంలో రహదారులు, వాగులు, ఇతర ప్రాంతాల్లో అధికారులు పులి అడుగుల కోసం అన్వేషించారు. ఎక్కడా అడుగులు కనిపించలేదు. గంగాపూర్‌ మీదుగా కవ్వాల్‌కు వచ్చే అవకాశం ఉన్నందున ముందస్తుగా ఎలాంటి అలజడి లేకుండా, పశువులు రాకుండా జాగ్రత్తలు వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

పులి కవ్వాల్‌ సెక్షన్‌లో ప్రవేశిస్తే ఇక్కడి సౌకర్యాల దృష్ట్యా తిరిగి వెళ్లే పరిస్థితి ఉండదనే ఆశాభావం అధికారులు వ్యక్తం చేస్తున్నారు. కవ్వాల్‌ అభయారణ్యాన్ని 2012 జనవరి 10న కేంద్ర ప్రభుత్వం టైగర్‌జోన్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి అసెంబ్లీ స్పీకర్‌ మనోహర్‌ కవ్వాల్‌ అభయారణ్యంలో పర్యటించి ఆయన చేసిన సూచన మేరకు 49వ టైగర్‌జోన్‌గా ఏర్పాటు చేశారు. టైగర్‌జోన్‌ ఏర్పాటు నుంచి పులి రాక కోసం అధికారులు అన్నిరాకాలుగా ప్రయత్నాలు చేసినా ఫలితం రాలేదు. మూడేళ్ల క్రితం కొన్ని రోజులు రాకపోకలు కొనసాగించింది. ఈ క్రమంలో హైదరాబాద్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ సొసైటీ సభ్యులు, అటవీశాఖ అధికారులు పులికి రక్షణ కల్పించారు. కొంత అలజడి వల్ల వచ్చిన పులి మూడు  సంవత్సరాలుగా కనిపించకుండా పోయింది. ఎట్టకేలకు ఈ నెల 15 న కడెం రేంజ్‌ పరిధిలోని పాడ్వాపూర్‌ బీట్, గంగాపూర్‌ పరిధిలో బేస్‌క్యాంపు సిబ్బందికి పులి కనిపించింది. వారు అప్రమత్తమై ఉన్నత అధికారులకు తెలియజేయడంతో కెమరాలు అమర్చడం వల్ల పులి కెమెరాకు చిక్కింది. దీంతో అధికారుల అనుమానం నిజమైంది. 

అడుగుల సేకరణలో సిబ్బంది  
కవ్వాల్‌ అభయారణ్యం పరిధిలో ఇటీవలే పెద్ద పులి కనిపించడంతో అధికారులు వాటి సంఖ్యను క్షేత్రస్థాయిలో గుర్తించేందుకు ఆదివారం అడుగుల సేకరణ నిర్వహించారు. శనివారం కడెం ఆటవీ రేంజ్‌ ఫరిధిలోని పాండ్వపూర్, బీట్ల ఫరిధిలో అటవీ అధికారులు ఏర్పాటు చేసిన కెమెరాల్లో పెద్ద పులి కనిపించడంతో అంతకుముందు దాని పాదలు గుర్తించిన అధికారులు వాటి సంఖ్యను గుర్తించేందుకు ఆదివారం అడుగుల సేకరణ పనిలో ఉన్నారు. కడెం రేంజ్‌ ఫరిధిలోని పాండ్వపూర్‌ బీట్లతోపాటు ఇతర బీట్‌లలో వాటి అనవాళ్లు ఉన్నాయా అనే కోణంలో పరిశీలించారు. అధికారులు బృందాలుగా ఏర్పడి వాటిని గుర్తించే పనిలో ఉన్నారు. ఆదివారం హైదరాబాద్‌ అటవీ శిక్షణ ఎఫ్‌ఆర్‌ఓలు శిక్షణకు రావడంతో ఈ ప్రాం తం, జంతువుల వివరాలను అటవీ అధికారులు తెలియజేశారు. ఎఫ్‌ఆర్‌వో రమేశ్‌ రాథోడ్, ఎఫ్‌ఎస్‌ఓలు ప్రభాకర్, మమత పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు