ఉద్యోగాలు: ఇంకా ఎదురుచూపులే!

2 Jun, 2015 00:52 IST|Sakshi
ఉద్యోగాలు: ఇంకా ఎదురుచూపులే!
  • తొలి ఏడాది నిరుద్యోగులకు నిరాశే
  • ఉద్యోగుల విభజన పూర్తికాకపోవడం,
  • పోస్టుల సంఖ్య తేలకపోవడమే కారణం
  • త్వరలోనే నోటిఫికేషన్లు ఇస్తామంటూ హామీలు
  • కనీసం పోటీ పరీక్షల స్కీం,
  •  సిలబస్ ఖరారు చేయని వైనంసాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో తొలి ఏడాదిలో నిరుద్యోగులకు మాత్రం నిరాశే ఎదురయింది. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూపులు తప్పలేదు. తెలంగాణ, ఏపీల మధ్య ఉద్యోగుల విభజన, ఖాళీ పోస్టుల వివరాలు ఇంకా తేలకపోవడంతో పాటు ఉన్నతాధికారుల కొరత వల్ల ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేయలేకపోతున్నామని ప్రభుత్వం చెబుతోంది. దాంతోపాటు ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ చేపట్టనున్న దృష్ట్యా డీఎస్సీ నిర్వహించలేమని పేర్కొంటోంది. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు వస్తాయని ఆశించిన నిరుద్యోగులంతా కోచింగ్ కేంద్రాల్లో చేరి శిక్షణ పొందుతున్నారు. ఇందుకోసం అప్పులు చేసి మరీ వేలకు వేలు ఖర్చుచేస్తున్నారు. కానీ ప్రభుత్వం ఇప్పటికీ ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టకపోవడంతో ఆందోళనలో మునిగిపోయారు. ఇక ‘ఇప్పటికే టీచర్లు ఎక్కువగా ఉన్నారు. డీఎస్సీ ఇప్పట్లో ఇచ్చేది కష్టమే..’ అంటూ కొందరు మంత్రులు చేసిన వ్యాఖ్యలతో ఉపాధ్యాయ అభ్యర్థులు ఆవేదనలో కూరుకుపోయారు.
     అనుమతులకే దిక్కులేదు..
     తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ)ను ఏర్పాటు చేసినా.. నోటిఫికేషన్ల జారీకి మాత్రం ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అసలు టీఎస్‌పీఎస్సీ ఏర్పాటు కాగానే రాష్ట్రానికి అనుగుణంగా పరీక్షల విధానం (స్కీమ్), పోటీ పరీక్షల సిలబస్‌ను రూపొందించేందుకు ప్రొఫెసర్ హరగోపాల్ నేతృత్వంలో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఫిబ్రవరిలో నివేదికను అందజేయగా.. ఇంతవరకు ప్రభుత్వం ఆ ప్రతిపాదనలకు ఆమోదం తెలుపలేదు. అంతేగాకుండా రాష్ట్రంలో 371 (డీ)ని కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేయలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న రోస్టర్ కమ్ రిజర్వేషన్ విధానాన్ని అమలు చేస్తుందా, కొత్త రోస్టర్ విధానాన్ని ప్రవేశపెడుతుందా? అన్నదాని పైనా స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితిని ఐదేళ్లు పెంచుతామని ప్రకటించినా, ఇంకా ఉత్తర్వులు జారీ కాలేదు.
     విభజనతో సంబంధం లేకున్నా..
     విభజనతో సంబంధం లేని పోస్టుల భర్తీపైనా ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. ప్రస్తుతం జిల్లా స్థాయి పోస్టుల్లో గెజిటెడ్  కేటగిరీలో 592, నాన్ గెజిటెడ్ కేటగిరీలో 59,231, లాస్ట్‌గ్రేడ్ కేటగిరీలో 14,353, ఎయిడెడ్ విభాగాల్లో 2,369 పోస్టులు.. మొత్తంగా 76,548 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీకి ఉద్యోగుల విభజనతో సంబంధం లేకపోయినా ప్రభుత్వం దృష్టి సారించడం లేదని నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాటిని వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇటీవల కేబినెట్ భేటీలో పోలీస్ కానిస్టేబుళ్లు (డ్రైవర్లు) 3,620, నీటిపారుదల శాఖలో డీఈఈలు 26, విద్యుత్ విభాగంలో ఏఈలు 1,492, సబ్ ఇంజనీర్లు 427, నీటిపారుదల శాఖలోనే 635 ఏఈ పోస్టులకు ఆమోదం తెలిపారు. కానీ వాటి భర్తీకి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదు.
     
     ఉపాధ్యాయ ఖాళీలపై గందరగోళం

     ప్రస్తుతం రాష్ట్రంలో 17,702 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్) చేపడితే తప్ప ఇందులో ఎన్ని పోస్టులు అవసరం అవుతాయన్న విషయంలో స్పష్టత వస్తుందని.. అప్పటివరకు భర్తీపై స్పష్టత రావడం కష్టమేనని అంటున్నారు. అంతేగాకుండా టీచర్లు ఇప్పటికే విద్యార్థుల నిష్పత్తి కంటే ఎక్కువగా ఉన్నారని.. పిల్లల కోసం డీఎస్సీ ఇవ్వాలా, ఉద్యోగాల కోసం ఇవ్వాలా? అని ప్రభుత్వం పేర్కొంటుండడం గమనార్హం. దీంతో ఉపాధ్యాయ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న లక్షల మంది ఆందోళనలో పడ్డారు.

>
మరిన్ని వార్తలు