అడుగడుగునా ట్రాఫిక్‌ గండం!

8 Oct, 2019 14:20 IST|Sakshi
ఇలాంటి రోడ్లపై ప్రయాణం ఎలా?

వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు..  

నిలిచిపోతున్న వాహనాలు    

108, ఇతర అంబులెన్స్‌లకు దొరకని దారి   

క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించడంలో తీవ్ర జాప్యం   

సకాలంలో చికిత్స అందక మృత్యువాత  

ఆరోగ్య సమస్యలు.. ప్రమాదాలు జరిగినప్పుడు ఫోన్‌ చేస్తే పరుగెత్తుకొచ్చే 108 వాహనాలకు కురుస్తున్న వర్షాలకు తోడు ట్రాఫిక్‌ చిక్కులు తప్పడం లేదు. పురిటినొప్పులతో బాధపడుతున్న బడంగ్‌పేటకు చెందిన ఓ గర్భిణిని ప్రసవం కోసం రెండు రోజుల క్రితం 108లో ఆస్పత్రికి తరలిస్తుండగా, నల్లగొండ క్రాస్‌ రోడ్డు వద్ద ట్రాఫిక్‌ రద్దీలో ఆ వాహనం చిక్కుకుంది. గత్యంతరం లేని పరిస్థితిలో సిబ్బంది వాహనాన్ని పక్కకు నిలిపేశారు. బాధితురాలు అంబులెన్స్‌లోనే బిడ్డను ప్రసవించింది. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న బాధితులను ట్రాఫిక్‌ రద్దీ ప్రాణాలు తీస్తోందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. 

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ మహానగరం ఏడు జిల్లాల పరిధిలో దాదాపు 7,200 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఔటర్‌ రింగ్‌ రోడ్డుతో పాటు రాష్ట్ర, జాతీయ రహదారులు వీటికి ఆనుకొని ఉన్నాయి. ఈ పరిధిలో ఏటా జరుగుతున్న సుమారు రెండు వేలకుపైగా రోడ్డు ప్రమాదాల్లో 200 నుంచి 300 మంది వరకు ప్రాణాలు కోల్పోతున్నారు. వేలాది మంది క్షతగాత్రులవుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 43 వరకు 108 వాహనాలు సేవలు అందిస్తున్నాయి. గ్రేటర్‌లో సగటున 56 ప్రమాదాలు జరుగుతుంటే.. గాయపడిన వారిని కాపాడేందుకు సకాలంలో 108 వాహనాలు ఘటనా స్థలికి చేరుకోవడం లేదు. అవి వచ్చేందుకు సగటున 30 నుంచి 45 నిమిషాల సమయం పడుతోంది. ప్రధాన నగరంలో ప్రతి ఐదు కిలోమీటర్ల పరిధిలో ఓ వాహనం ఉంది. అయితే శివార్లలో ప్రతి 25 నుంచి 30 కిలోమీటర్లకు ఒక 108 వాహనం సేవలు అందిస్తోంది. దీంతో సంఘటన జరిగిందన్న సమాచారం అందుకొన్నా స్థలానికి వెళ్లేసరికి గంటన్నరకు పైనే సమయం పడుతోంది. ఫలితంగా కొన్నిసార్లు క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించినా ప్రాణాలు పోతున్నాయి.  

గోల్డెన్‌ అవర్స్‌లో వచ్చే కేసులు తక్కువే.. 
సాధారణంగా రోడ్డు ప్రమాదాలు జరినప్పుడు 70 శాతం మందిలో తల, వెన్నుముకకు గాయాలవుతున్నాయి. ఈ సందర్భాల్లో తొలి గంటను ‘గోల్డెన్‌ అవర్‌’గా పిలుస్తారు. ఆ సమయంలో ఆస్పత్రికి తీసుకెళితే ప్రాణాలు నిలిచే అవకాశాలు ఎక్కువ. ఆలస్యమయ్యే కొద్దీ కోలుకోవడం కష్టం. గతంలో నిమ్స్‌లో జరిగిన సర్వేలో తొలి గంటలో 23 కేసులకు మించి రావడం లేదు. ఆరేడు గంటల తర్వాతే చాలామందిని ఆస్పత్రిలో చేరుస్తున్నారు. దీంతో తలకు, వెన్నుముకకు బలమైన గాయాలు తగిలి, రక్తస్రావం జరిగి మృత్యువాత పడుతున్నారు. ఒకవేళ బతికినా శాశ్వతంగా వికలాంగులుగా మారుతున్నారు. 108 వాహనాలు సకాలంలో చేరుకొని 2 నుంచి 3 గంటల్లో తీసుకురాగలిగితే 30 నుంచి 40 శాతం కోలుకునే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. నగరంలో సంఘటన స్థలానికి వాహనం చేరి క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించే సమయానికి చాలా ఆలస్యమవుతోంది. శివార్లలో ఒకటి రెండు చోట్ల ఏరియా ప్రభుత్వ ఆసుపత్రులు లేవు. ఎక్కువ శాతం మంది ఉస్మానియా, గాంధీలపై ఆధార పడుతున్నారు. శివార్ల నుంచి ఇక్కడకు చేరే సరికి సమయం మించిపోతోంది. అలాకాకుండా నగరం చుట్టూ ప్రతి 30 కిలోమీటర్ల పరిధిలో ట్రామాకేర్‌తో కూడిన ఏరియా ఆస్పత్రుల ఏర్పాటు ఎంతో అవసరమని సూచిస్తున్నారు. ఇక్కడ ప్రాథమిక వైద్యం అందించిన తర్వాత అవసరమైతే ఇతర ఆస్పత్రులకు తరలించవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు.  

ఇవీ ప్రధాన సమస్యలు.. 

  • నగరంలో రెండు, మూడు కిలోమీటర్ల ప్రయాణం చేయాలన్నా ట్రాఫిక్‌ ఇబ్బందులతో వాహనం ముందుకు కదలడం లేదు. కొన్ని చోట్ల సుదూరంగా ముందుకు వెళ్లి యూటర్న్‌ తీసుకోవాల్సి వస్తోంది. ఇంతలో ట్రాఫిక్‌ రద్దీ తప్పడం లేదు. 
  • చిన్న వర్షానికే నగరంలో అనేక ప్రాంతాల్లోని రోడ్లు నీట మునుగుతున్నాయి. ఆ సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే 108 వాహనం చేరుకోవడానికి 2 నుంచి 3 గంటల సమయం పడుతోంది. 
  • ప్రస్తుతం హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలో ఉన్న వాహనాల్లో 2 అధికారిక పర్యటనలకు వచ్చే వీవీఐపీలకు కేటాయిస్తున్నారు. మిగతా వాహనాలు మాత్రమే అత్యవసర సేవలు అందిస్తున్నాయి. 
  •  హైదరాబాద్, మేడ్చల్, మెదక్, రంగారెడ్డి పరిధిలో సేవలు అందించేందుకు మరో 70 నుంచి 80 వాహనాలు అవసరముంది. ఇందుకు 2016లో కుటుంబ సంక్షేమ, వైద్య ఆరోగ్యశాఖకు ప్రతిపాదనలు పంపారు. ఇంతవరకు కార్యాచరణ చేపట్టలేదు.  
  • శివార్లలో ఉండే ప్రాంతీయ ఆస్పత్రుల నుంచి తరచూ రిఫరల్‌ కేసులను ఉస్మానియా, గాంధీలకు తరలించడానికే ఎక్కువ 108 వాహనాలు వినియోగిస్తున్నారు. దీంతో సైకిల్‌ టైం భారీగా పెరుగుతోంది. 
  • 108 వాహనాలకే కాకుండా మరో 30 వరకు బైక్‌ అంబులెన్సులు అందుబాటులో ఉన్నాయి. వాహనాలు చేరేలోపు ఈ బైక్‌ అంబులెన్సుల సేవలను సమర్థంగా వినియోగించుకునేలా అధికారులు ప్రణాళికలు రూపొందించడం వల్ల చాలా వరకు క్షతగాత్రులకు భరోసా అందించవచ్చు. అయితే, అనుకున్నంత సమర్థంగా ఈ సేవలు వినియోగించుకోవడం లేదు.   
మరిన్ని వార్తలు