ఆర్టీసీ సమ్మె షురూ..

5 Oct, 2019 02:40 IST|Sakshi
సమ్మె కారణంగా బస్సులు లేక వెలవెలబోతున్న ఎంజీబీఎస్‌ బస్టాండ్‌..

శనివారం ఉదయం 5 గంటల నుంచే ప్రారంభం 

ఎక్కడికక్కడ నిలిచిపోయిన బస్సులు  

శుక్రవారం నుంచే మొదలైన ప్రయాణికుల ఇబ్బందులు 

శనివారం ఉదయానికి ప్రైవేటు డ్రైవర్లతో ఆర్టీసీ బస్సులు సిద్ధం

సాయంత్రానికి పరిస్థితి మెరుగయ్యే అవకాశం.. 

సాక్షి, హైదరాబాద్‌ : కార్మికులు పట్టు వీడలేదు.. ఐఏఎస్‌ అధికారుల కమిటీ మెట్టు దిగలేదు.. ఫలితంగా నాలుగేళ్ల తర్వాత మరోసారి ఆర్టీసీలో సమ్మె సైరన్‌ మోగింది. కార్మికులతో త్రిసభ్య కమిటీ శుక్రవారం జరిపిన చర్చలు కూడా విఫలం కావడంతో కార్మికులు సమ్మెకే సై అన్నారు. ముందే ప్రకటించినట్లే శనివారం (5వ తేదీ) ఉదయం 5 గంటల నుంచి సమ్మె ప్రారంభించారు. చర్చలు విఫలమైన వెంటనే సమ్మె మొదలైనట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికులను సంఘాలు అప్రమత్తం చేశాయి. 

దీంతో దూరప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో విధులు నిర్వహిస్తున్న వారు శుక్రవారం మధ్యాహ్నం ఉన్న పళంగా విధుల నుంచి వైదొలిగారు. దూరప్రాంతాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్లే సర్వీసుల డ్రైవర్లు విధులు బహిష్కరించారు. దీంతో శుక్రవారమే సమ్మె మొదలైనట్లయింది. శుక్రవారం నాటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కొలిక్కి రాకపోవటంతో ఈ సర్వీసులు నడిపే పరిస్థితి లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కాకపోతే కొన్ని ప్రాంతాలకు ఏపీ బస్సులు రావటంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు. 
(చదవండి : ఆర్టీసీ సమ్మె : కేసీఆర్‌ కీలక నిర్ణయం)

తుదిదశ చర్చలూ విఫలం 
బుధ, గురువారాల్లో జరిగిన చర్చల్లో ప్రతిష్టంభన నెలకొనటంతో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన చర్చలపై అందరి దృష్టి నిలిచింది. ఇటు కార్మిక సంఘాలు బెట్టు వీడటమో, అధికారుల కమిటీ మెట్టు దిగటమో జరిగి సమ్మె తప్పుతుందని ప్రయాణికులు ఎదురు చూశారు. ఆదివారం సద్దుల బతుకమ్మ కావడంతో లక్షల మంది సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో జనం ఊళ్లకు వెళ్లినా, ఉద్యోగులు శనివారమే పయనమవుతున్నారు. సరిగ్గా అదే రోజు సమ్మె మొదలు కానుండటంతో శుక్రవారం టెన్షన్‌తో గడిపారు. సమ్మె లేదనే శుభవార్త కోసం ఎదురు చూశారు. 

కాగా, నిర్ధారిత సమయంలో హామీలు నెరవేరుస్తామంటూ లిఖిత పూర్వకంగా స్పష్టమైన హామీ ఇస్తే సమ్మె యోచన విరమణపై ఆలోచిస్తామని కార్మిక సంఘాలు గట్టిగా డిమాండ్‌ చేశాయి. కానీ ఆర్థిక పరమైన అంశంతో ముడిపడ్డ డిమాండ్లపై ఉన్నఫళంగా లిఖిత పూర్వక హామీ సాధ్యం కాదని, దసరా తర్వాత మళ్లీ చర్చలు ప్రారంభిద్దామని, అప్పటి వరకు సమ్మెను వాయిదా వేసుకోవాలని అధికారుల కమిటీ స్పష్టం చేసింది. దీంతో కమిటీ తమ మాట వినదని, కార్మిక సంఘాల జేఏసీ చర్చలను బహిష్కరించి అక్కడి నుంచి నిష్కమించింది. 

చర్చల్ని బహిష్కరించి వెళ్లిపోతున్న జేఏసీ నేతలు..

డీఎం ఒక్కరే 
సమ్మెల సమయంలో డిపోల్లో మేనేజర్లకు అసిస్టెంట్‌ మేనేజర్లు, ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్లు, ఇతర సిబ్బంది సాయంగా ఉంటారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో వీరిదే కీలక పాత్ర. కానీ ఈసారి కార్మికులతోపాటు సూపర్‌వైజరీ కేడర్‌ అధికారుల సంఘం కూడా సమ్మెకు సై అనటంతో వారు అందుబాటులో ఉండరు. దీంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లతోపాటు డిపో మొత్తం పర్యవేక్షణకు ఒక్క డిపో మేనేజర్‌ మాత్రమే ఉండాల్సిన దుస్థితి నెలకొంది. ఇప్పుడు ఇదే పెద్ద సమస్యగా మారింది. ఒక్క వ్యక్తి మొత్తాన్ని పర్యవేక్షించే పరిస్థితి లేక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా ఇబ్బందిగా మారాయి. దీంతో ఆగమేఘాల మీద ఉన్నతాధికారులు రిటైర్డ్‌ ఆర్టీసీ అధికారుల సేవలు పొందేందుకు ఏర్పాట్లు ప్రారంభించింది. శనివారం సాయంత్రానికి వారు కొంతమంది విధుల్లో చేరే అవకాశం ఉంది. 

ప్రైవేటు డ్రైవర్ల చేతికి స్టీరింగ్‌ 
రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు డ్రైవర్ల గుర్తింపు బాధ్యతను గురువారమే ఐఏఎస్‌ అధికారుల కమిటీ రవాణ శాఖకు అప్పగించింది. స్థానిక మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్లు తమ వద్ద ఉన్న డ్రైవర్ల వివరాల ఆధారంగా వారికి సమాచారం అందించి పిలిపించారు. 18 నెలలు, అంత కంటే ఎక్కువ కాలం క్రితం హెవీ మోటార్‌ వెహికిల్‌ లైసెన్సు తీసుకుని ఉన్న వారిని అర్హులుగా పేర్కొన్నారు. వారి డ్రైవింగ్‌ నైపుణ్యాన్ని పరిశీలించి, గతంలో యాక్సిడెంట్‌ కేసులు లేకుంటే వారి పేరును ఆర్టీసీ అధికారులకు సిఫారసు చేస్తున్నారు. 

అలా వచి్చన డ్రైవర్లు శనివారం ఉదయం 4 గంటల కల్లా డిపోలకు రావాల్సి ఉంది. పదో తరగతి ఉత్తీర్ణులైన వారిని కండక్టర్లుగా తీసుకుంటున్నారు. ఈ తాత్కాలిక డ్రైవర్లకు రోజుకు రూ.1,500, కండక్టర్లకు రూ.వెయ్యి చెల్లించాలని ఆర్టీసీ నిర్ణయించింది. అయితే వారి చేతికి పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ బస్సులు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించారు. డీలక్స్‌ బస్సులపై తర్జనభర్జన పడుతున్నారు. వేగంగా వెళ్లటంతోపాటు ఖరీదు కూడా ఎక్కువ ఉండే సూపర్‌ లగ్జరీ, రాజధాని, గరుడ, గరుడ ప్లస్‌ బస్సులను వారి చేతికి ఇవ్వొద్దని నిర్ణయించారు. 

‘ఎస్మా’ఏం చెబుతోంది.. 
ఎస్సెన్షియల్‌ సరీ్వసెస్‌ మెయింటెనెన్స్‌ యాక్ట్‌ (ఎస్మా) 1971లోని సెక్షన్‌ 3(1) పరిధిలోకి ఆర్టీసీ సమ్మెలు వస్తాయి. దీని ప్రకారం ప్రస్తుతం సమ్మెను నిషేధిస్తూ గత మే 27న ప్రభుత్వం ఉత్తర్వు నెం.9 వెలువరించింది. ప్రస్తుతం అది అమల్లో ఉంది. మోటార్‌ ట్రాన్స్‌పోర్టు ఇండస్ట్రీ ఇండ్రస్టియల్‌ డిస్ప్యూట్స్‌ (ఐడీ) యాక్ట్‌ ప్రకారం చర్చల ప్రొసీడింగ్స్‌ గడువు ముగిసే వరకు సమ్మె చేయటం చట్ట వ్యతిరేకం. ఒకవేళ సమ్మె చేస్తే క్రమశిక్షణ ఉల్లంఘనగా భావిస్తూ సమ్మె చేసిన కార్మికులపై చర్యలు తీసుకునే అవకాశం కల్పిస్తుంది. ఇప్పుడు ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటే క్లాసిఫికేషన్‌ కంట్రోల్‌ అండ్‌ అప్పీల్‌ (సీసీఏ) రెగ్యులేషన్‌ 9(1) ప్రకారం డిస్మిస్‌ చేసే అధికారం ఉంటుంది. 

అప్పట్లో ఏం జరిగింది.. 
2015మేలో ఆర్టీసీ కార్మికులు ఇలాగే సమ్మెలోకి వెళ్లారు. వేతన సవరణ గడువు దాటినా కొత్తది ప్రకటించలేదన్న ఆగ్రహంతో మూకుమ్మడి సమ్మెకు దిగారు. దీన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్లను హడావుడిగా తీసుకుని బస్సులు అప్పగించింది. దాదాపు 5 వేల బస్సులు తిప్పగలిగారు. ఆరు రోజులపాటు సమ్మె కొనసాగింది. ఏడో రోజు కార్మికులను ప్రభుత్వం చర్చలకు పిలవటం, వేతన సవరణకు అంగీకరించటంతో సమ్మె ఆగింది.  

మరిన్ని వార్తలు