జీతాలెప్పుడు ఇస్తారు

17 Oct, 2019 02:32 IST|Sakshi

ఆర్టీసీ యాజమాన్యాన్ని ప్రశ్నించిన హైకోర్టు

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ ఉద్యోగులు సెప్టెంబర్‌లో పని చేసిన కాలానికి జీతాలు ఎందుకు నిలుపుదల చేశారో.. ఎప్పటిలోగా జీతాలు చెల్లిస్తారో తెలియజేయాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆర్టీసీ ఉద్యోగుల సెప్టెంబర్‌ జీతాలు చెల్లించకపోవడాన్ని తప్పుపడుతూ తెలంగాణ ఆర్టీసీ జాతీయ మజ్దూర్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి కె.హనుమంతు దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌ను బుధవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలి విచారించారు. ఆర్టీసీ యాజమాన్య వివరణపై  ఈ నెల 21న తదుపరి విచారణ జరుపుతామని న్యాయమూర్తి తెలిపారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ వాదిస్తూ.. జీతాల మొత్తాన్ని హైకోర్టు రిజిస్ట్రీ వద్ద ఆర్టీసీ యాజమాన్యం డిపాజిట్‌ చేసేలా ఉత్తర్వులివ్వాలని కోరారు.

రెండ్రోజుల్లో జీతాలు చెల్లించేలా ఆదేశాలివ్వాలని, జీతాల చెల్లింపు కోసం సిబ్బంది అవసరమైతే కార్మిక యూనియన్‌కు చెందిన 100 మంది పనిచేసేందుకు వస్తారని తెలిపారు. ఇప్పటికే ఏడుగురు కార్మికులు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారని, అప్పు చెల్లించలేక ఒక కార్మికుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పనిచేసిన కాలానికి జీతాలు చెల్లించకపోవడం చట్ట వ్యతిరేకమని, ఈ విధంగా చేయడాన్ని సుప్రీం కోర్టు కూడా పలు కేసుల్లో తప్పుపట్టిందని చెప్పారు. ఆర్టీసీ యాజమాన్యం తరఫు న్యాయవాది వాదిస్తూ.. జీతభత్యాలు చెల్లించే ఉద్యోగులు కూడా సమ్మెలో ఉన్నారని, అందుకే చెల్లింపులు ఆగిపోయాయని చెప్పారు. 

మరిన్ని వార్తలు