పచ్చ బంగారమాయేనా..!

20 Jan, 2018 17:01 IST|Sakshi

ఇంటి పంటగా పసుపు సాగు..

ఈ ఏడాది తెగుళ్లతో దిగుబడి అంతంతమాత్రమే...

పసుపు తవ్వే పనిలో రైతన్న బిజీ..

ధర నిర్ణయంపైనే ఆసక్తి..

కలగా మిగిలిన పసుపు బోర్డు  

వాణిజ్య పంటగా పేరొందిన పసుపు పంటపైనే జిల్లా రైతులు ఆశలు పెంచుకున్నారు. రెండు, మూడేళ్లుగా అంతంతమాత్రంగానే ఉన్న పసుపు ఉత్పత్తుల ధరలు.. ఈ ఏడాది ఎలా ఉంటాయోనని ఎదురుచూస్తున్నారు. ఈసారి వాతావరణ ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో తెగుళ్లు సోకినా పంటను కాపాడుకున్నారు. ప్రస్తుతం పసుపు పంట ఆకులు కోసి.. కొమ్ములను తవ్వే పనిలో అన్నదాత బిజీగా ఉన్నాడు. ఇక మార్కెట్‌కు తరలించడమే తరువాయి.. తీరా దిగుబడి మార్కెట్‌కు తరలించే సమయానికి ధర ఎంత ఉంటుందోనని రైతులు  ఆందోళన చెందుతున్నారు. పెట్టుబడి పెరిగిన నేపథ్యంలో క్వింటాల్‌కు రూ.10వేలు ఇవ్వాలని కోరుతున్నారు.   

జగిత్యాల అగ్రికల్చర్‌ :  జిల్లాలో ప్రధానంగా జగిత్యాల, మెట్‌పల్లి, కోరుట్ల, ఇబ్రహీంపట్నం, కథలాపూర్, మల్లాపూర్, సారంగాపూర్, రాయికల్, మేడిపల్లి మండలాల్లో అత్యధికంగా, గొల్లపల్లి, బీర్‌పూర్, మల్యాల, పెగడపల్లి, ధర్మపురి, బుగ్గారం మండలాల్లో ఓ మోస్తారుగా పసుపు సాగుచేస్తుంటారు. దాదాపు 42 వేల ఎకరాల్లో సాగుచేస్తున్నట్లు అంచనా. పసుపుకు అనుకూలమైన ఎర్రనేలలు ఉండడం, యాజమాన్య పద్ధతులు అవలంబిస్తుండడంతో లాభసాటిగా మారింది. నాలుగేళ్ల క్రితం పసుపు ధరలు బంగారంతో పోటీపడటంతో అన్నదాత ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్‌లో పసుపు పంటకు ధర ఉన్నా.. లేకున్నా ఇంటి పంటగా భావించి ఒక్కో రైతు ఎకరం నుంచి ఐదెకరాల వరకు సాగుచేస్తున్నారు. ఇక్కడి రైతులు గుంటూర్, అర్మూర్‌ రకాలతోపాటు సుగుణ, సుదర్శన్‌ వంటి రకాలను వేస్తున్నారు. వీటిలో కుర్కుమిన్‌ శాతం తక్కువగా ఉండటంతో కొందరు కేరళ, ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన రకాలనూ సాగుచేస్తున్నారు. ఇటీవల బెడ్‌ పద్ధతిని అవలంబిస్తూ కొంతమంది ఎకరాకు 35 నుంచి 40 క్వింటాళ్ల దిగుబడి సాధిస్తున్నారు.

ఈసారి అంతంతే..
ఈ ఏడాది వాతావరణ ప్రభావంతో జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పసుపుకు తెగుళ్లు సోకాయి. ఆకురోగం, దుంపకుళ్లు రోగంతో మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మెట్‌పల్లి ప్రాంతాల్లో కొంతనష్టం జరిగింది. జగిత్యాల, గొల్లపల్లి, రాయికల్‌ మండలాల్లో పెద్దగా తెగుళ్లు రాకున్నా ఆశించినస్థాయిలో దిగుబడులు రావడంలేదని రైతులు చెపుతున్నారు. కనీసం ఎకరాకు 5క్వింటాళ్ల మేర తగ్గే అవకాశముంది. మార్కెట్‌లో గతేడాది క్వింటాల్‌కు రూ.5–7 వేల మధ్యలో ధర పలకగా.. దిగుబడులు వచ్చినా రేటు రాక  నష్టపోయారు. ఈ ఏడాది క్వింటాల్‌కు రూ.6–8 వేలు ఉన్నట్లు మార్కెట్‌వర్గాలు చెబుతున్నాయి. అయితే పంట మార్కెట్‌కు వచ్చే వరకు ధర ఎలా ఉంటుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. సాగుకు పెరుగుతున్న పెట్టుబడుల నేపథ్యంలో కనీసం క్వింటాల్‌కు రూ.10వేలు ఉంటేనే గిట్టుబాటవుతుందని చెబుతున్నారు.

అంతర్జాతీయంగా డిమాండ్‌ ఉన్నా..
పసుపును ఆహార పదార్థాల్లోనే కాకుండా మందులు, చర్మ సౌందర్యానికి వాడే పరిమళ ద్రవ్యాల తయారీ, రంగుల పరిశ్రమలో వాడుతుండడంతో అంతర్జాతీయంగా డిమాండ్‌ఉంది. ఏటా రేట్లు హెచ్చు తగ్గులకు లోనవుతుండటంతో మార్కెట్‌లో ఏ రేటు వస్తుందో తెలియని పరిస్థితి. రైతులు పోటీ పడి దిగుబడులు తీస్తున్నా మార్కెటింగ్‌ సమయంలో పెట్టుబడికి తగ్గ ధర రాక డీలా పడుతున్నారు. కొన్నేళ్లుగా పసుపు బోర్డు, కోల్డ్‌ స్టోరేజీలు ఏర్పాటు చేసేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నా ఫలితం మాత్రం కానరావడం లేదు. చివరకు లోకల్‌ మార్కెట్లో ఏదో ఓ రేటుకు అమ్ముకుని నష్టాలను చవిచూస్తున్నారు. పసుపు రైతులకు పెరిగిన పెట్టుబడుల నేపథ్యంలో 9 నెలలు కష్టపడితే ఎకరాకు కనీసం రూ.25 వేలు రావడం లేదని ఆందోళన చెందుతున్నారు.

మద్దతు ధర ఇవ్వాలి..
పసుపు పంటకు మద్దతు ధర ఇవ్వాలి. అప్పుడే రైతులకు గిట్టుబాటు అయ్యే అవకాశముంది. కష్టపడి దిగుబడులు తీస్తున్నాంగానీ మార్కెట్‌కు పోయి వ్యాపారుల కాళ్లావేళ్లా పడాల్సి వస్తంది. క్వింటాల్‌కు కనీసం రూ.10వేలు ఉంటేనే రైతులకు గిట్టుబాటవుతుంది.   –దొడ్లె జీవన్‌రెడ్డి, జగిత్యాల రైతు

ధర చెప్పలేం..
పసుపు పంటమార్కెట్‌కు తీసుకెళ్లే వరకు ఏ రేటు ఉంటుందో చెప్పలేని పరిస్థితి. ఏ మాత్రం గిట్టుబాటు కావడం లేదు. తాత, తండ్రుల నుంచి వస్తున్న పంట కావడంతో లాభం వచ్చినా, నష్టం వచ్చినా సాగు చేస్తున్నాం.  
–తీపిరెడ్డి రాజవ్వ, పసుపు రైతు
 

మరిన్ని వార్తలు