'సంగీత' లీలా భన్సాలీ | Sakshi
Sakshi News home page

'సంగీత' లీలా భన్సాలీ

Published Sat, Jan 20 2018 5:06 PM

Sanjay Leela Bhansali Musical storm in Bollywood - Sakshi

ఇటీవల అత్యంత వివాదాస్పదమైన సినిమా పద్మావత్‌. ఎన్నో ఇ‍బ్బందులు, ఇంకెన్నో  అడ్డంకులు, లెక్కలేనన్ని బెదిరింపులతో హాట్‌టాపిక్‌గా మారిన  సినిమా పద్మావత్‌. సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సుప్రీంకోర్టు తీర్పుతో ఊరట లభించింది. అయితే ఇలాంటి వివాదాస్పద సినిమాలు తీయడం భన్సాలీకి కొత్తేమి కాదు. వినూత్న కథలతో, భారీ ఖర్చు, విజువల్‌ గ్రాండియర్‌తో అందరికంటే భిన్నంగా సినిమాలను తీయడం భన్సాలీకే సొంతం.

దర్శకత్వ బాధ్యతలు మోస్తూ ఆ సినిమాకు సంగీతం కూడా అందించటం చాలా కష్టం. అలాంటి కష్టాన్ని ఎప్పుడు చాలెంజ్‌గా తీసుకొని సక్సెస్‌ సాధిస్తుంటాడు భన్సాలీ. దర్శకుడిగా తనేంటో నిరూపించుకున్న భన్సాలీ సంగీతంలోని ఇష్టాన్ని తన సినిమాలోని పాటల ద్వారా తెలియజేశారు. తాజాగా ఆయన చిత్రీకరించిన సినిమా ‘పద్మావత్‌’ వివాదాస్పదమై సంచలనం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలోని పాటలు ‘గూమర్‌, ఏక్‌ దిల్‌ ఏక్‌ జాన్‌’ వింటే భన్సాలీ సంగీత ప్రియుడని మరోసారి రుజువైంది. ఇప్పటికే ఆ పాటలు యూట్యూబ్‌లో వైరల్‌గా మారాయి. గూమర్‌, ఏక్‌ దిల్‌ ఏక్‌ జాన్‌ పాటలు కేవలం సంగీతపరంగానే కాదు, దృశ్యకావ్యంగానూ అద్భుతంగా మలిచారు భన్సాలీ. బాలీవుడ్‌లో ఒక పాటను చూస్తే.. కచ్చితంగా ఇది భన్సాలీ పాటే అని చెప్పవచ్చు. అంతలా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. అతడు దర్శకుడిగా, సంగీత దర్శకుడిగానూ రెండు పడవలపై సక్సెస్‌ఫుల్‌గా ప్రయాణిస్తున్నారు.

భన్సాలీ సినిమా విజువల్స్‌ ఒక ఎత్తు, సంగీతం మరో ఎత్తు. సినిమాలోని పాటలు, నేపథ్య సంగీతం ఇలా అన్నింటితో ప్రేక్షకులను చూపు తిప్పుకోకుండా చేస్తారు క్రియేటివ్‌ జీనియస్‌. డైరెక్టర్‌గా కామోషీ నుంచి పద్మావత్‌ వరకు ఆయన సినీ సంగీత సాగరాన్ని ఓ సారి పలకరిద్దాం.

కామోషీ , హమ్‌ దిల్‌ దే చుకే సనమ్(హెచ్‌డిడిసిఎస్‌)‌, దేవ్‌దాస్‌, బ్లాక్‌, గుజారీష్‌, గోలియాన్‌ కి రాస్‌లీల : రామ్‌లీల, బాజీరావ్‌ మస్తానీ ఇవన్నీ మ్యూజికల్‌ హిట్సే. బాలీవుడ్‌లో ఓ పది ఆణిముత్యాల్లాంటి గీతాలను తీస్తే..అందులో భన్సాలీ సినిమాలోని పాటలకు సమున్నత స్థానం ఉంటుంది. నింబుడా నింబుడా, డోలా రే డోలా, మార్‌ డాలా, పింగా, నగాడా సంగ్‌ డోల్‌.. ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో మరుపురాని పాటలు భన్సాలీ మస్తిష్కం నుంచే పుట్టాయి. ఆయన మ్యూజిక్‌ డైరెక్టర్‌ కాకముందునుంచీ కూడా  సినిమాలోని ప్రతీ పాటపై ఎంతో జాగ్రత్త వహించేవారనీ ఆయనతో పనిచేసిన వారంతా చెబుతారు.

భన్సాలీ గురించి సింగర్‌ కవితా కృష్ణమూర్తి మాటల్లో....
‘భన్సాలీ తల్లి నాట్య కళాకారిణి. తండ్రి సినిమా ఇండస్ట్రీకి చెందినవారే. దీంతో భన్సాలీకి చిన్నప్పటినుంచే కళారంగంపై మక్కువ ఏర్పడింది. సంగీత దర్శకుడు ఇస్మాయిల్‌తో భన్సాలీది ప్రత్యేక అనుబంధం. వారిద్దరు మంచి మిత్రులు. అందుకే భన్సాలీ మనసులో ఏం అనుకుంటాడో ఇస్మాయిల్‌ కు అర్ధమైపోయేది. అందుకు తగ్గట్టుగా సంగీతమందించేవారు ఇస్మాయిల్‌ తనకు కావల్సినట్టు వచ్చే వరకు వొదిలిపెట్టేవాడు కాదు. భన్సాలీ పాటలోని ప్రతి చిన్న విషయాన్ని ఎంతో నిశితంగా పరిశీలించే వారు. పాటను ఏవిధంగా చిత్రీకరించాలో ముందే ఒక అవగాహన ఉంటుంది. పాట రికార్డింగ్‌ జరిగేప్పుడు కూడా అక్కడే ఉండేవాడు. భన్సాలీ సినిమాల(హమ్‌ దిల్‌ వే చుకే సనమ్‌, దేవ్‌దాస్‌)కు పాడిన పాటలు నాకెంతో గుర్తింపును తెచ్చాయి’ అన్నారు.
 
సంగీత దర్శకుడు ఇస్మాయిల్‌ మాట్లాడుతూ...
‘నేను కంపోజ్‌ చేసిన పాటలకు భన్సాలీ మాత్రమే ప్రాణం పోయగలరు. నేను ఏ విధంగా సంగీతాన్ని ఇస్తే..దానికి మించి తను వాటిని విజువలైజ్‌ చేసేవారు. ఆయన పాటలోని చిన్న మ్యూజిక్‌ బిట్‌ను కూడా వదిలేవారు కాదు. టింగ్‌ అనే చిన్న శబ్దం వచ్చినా దానికి కూడా తెరపై అందంగా చూపించేవారు. మ్యూజిక్‌పై ఎంతో ఇష్టం ఉంటే గానీ ఇలా చేయలేరు. హమ్‌ దిల్‌ దే చుకే సనమ్‌ రోజుల్ని గుర్తు చేసుకుంటూ... నేను చేసిన పాటను అందరికీ వినిపించేవాడిని. కానీ ఏ ఒక్కరు సరిగా వినేవారుకాదు. సంజయ్‌ మాత్రం విని, మళ్లీ వినిపించు అనేవాడు. ‘తడప్‌ తడప్‌’ సాంగ్‌ విన్న తరువాత సంజయ్‌ నా వద్దకు వచ్చి ఇస్మాయిల్‌..ఈ సాంగ్‌ తరువాత నా సినిమాని ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలిసింది. ఎక్కడ ఇంటర్వెల్‌, క్లైమాక్స్‌ ఉండాలో తెలిసింది.’ అన్నారు.

ఉదిత్‌ నారాయణ్‌ మాట్లాడుతూ....
‘భన్సాలీతో పనిచేయడం నాకు ఎంతో గర్వంగా ఉంటుంది. భన్సాలీ సినిమాల్లో ఏది తీసుకున్నా అదొక మ్యూజిక్‌ సెన్సెషనే‌. ఆ సినిమాల్లోని పాటలు, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌, డైలాగ్స్‌ ఇలా ప్రతి ఒక్కటి ప్రేక్షకులను మంత్ర ముగ్దుల్ని చేస్తుంది. ఆయన స్వయంగా రికార్డింగ్‌ రూంలో ఉండి ప్రతీది గమనించేవారు. నాకు వంద శాతం రిజల్ట్‌ కావాలి అనేవారు. హెచ్‌డిడిసిఎస్‌ సినిమా టైంలో జరిగిన ఒక సంఘటన గురించి చెపుతూ...చాంద్‌ చుపా బాదల్‌ మైన్‌..అనే పాట సినిమా రిలీజ్‌ అయిన తరువాత పదిరోజుల వరకు ప్రదర్శించారు. ఒక రోజు సంజయ్‌ వచ్చి ఈ పాట వద్దని కొంతమంది అంటున్నారు తీసేద్దాం అన్నారు. మళ్లీ నాలుగు రోజుల తర్వాత డిస్ట్రిబ్యూటర్స్‌ వచ్చి మళ్లీ సాంగ్‌ పెట్టండి అన్నారు. ఆ సాంగ్‌ ఎంతో పాపులర్‌ అయింది.

ఆదిత్యనారాయణ్‌ మాట్లాడుతూ....
‘పాటలోని ప్రతీ బీట్‌ను ఆయన గమనిస్తారు. ఆలాపన , తాళం ప్రతీ విషయాన్ని సూక్ష్మంగా చూస్తారు. ఆయన డైరెక్టర్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ కావడం వల్ల ఎక్కడ ఏ సన్నివేశానికి ఎలాంటి మ్యూజిక్‌ ఇవ్వాలో ఆయనకు బాగా తెలుస్తుంది. ఎడిటింగ్‌ రూంలో కూడా సంగీతం గురించి ఆలోచించేవాడు’ అని రామ్‌లీల సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన అనుభవాల్ని తెలిపారు.

భన్సాలీకి భారతీయ సంగీతం, జానపదాలు అంటే ఇష్టమని ఆయన సినిమాలోని పాటలను చూస్తే తెలుస్తుంది.  క్లాసికల్‌ సాంగ్స్‌‘అల్‌బెలా సజన్‌’, ‘కాహే చెడ్‌ మోహె’.. జానపద గీతాలు.. దోలీ తారో, నింబుడా, డోలా రే డోలా, పింగా, నగడా సంగ్‌ డోల్‌, లహు ముహ్‌ లగ్‌ గయ, తాజాగా పద్మావత్‌ లోని గూమర్‌ పాటను చూస్తే భన్సాలీ పాటను చిత్రీకరించే విధానం తెలుస్తుంది. పాటకు తన ఆలోచనలతో ప్రాణం పోస్తాడు భన్సాలీ. విరహ వేదన, ప్రణయ గీతాలను కూడా అంతే అందంగా చూపిస్తారు. ‘ఆంకోన్‌ కి గుస్తాకియాన్‌, జాన్‌క హవా కా, బైరీ పియ, సిల్‌సిలా ఏ చాహత్‌ క, జబ్‌ సే తేరా నైనా, మూన్‌ షబ్‌నామీ, తోడే బద్మాష్‌, లాల్‌ ఇష్క్‌, ఆయత్‌ , దీవానీ మస్తానీ లాంటివే ఇందుకు నిదర్శనం. తన పాటలతో తన వ్యక్తిత్వం ఏంటో తెలియజేశాడు భన్సాలీ. ఆయన మ్యూజిక్‌లో సాంప్రదాయ సంగీతానికి స్థానం కల్పించాడు. జానపదాలనూ గౌరవించాడు.  నింబుడా, డోలా రే డోల, ఉడి ఉడి పాటలను ప్రస్తావించకుండా బాలీవుడ్‌ సంగీతం గురించి చెప్పలేం. భారతీయ సినీ సంగీతంలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్న భన్సాలీ మరిన్ని దృశ్యకావ్యాలను మనకందించాలని ఆశిద్దాం.

Advertisement

తప్పక చదవండి

Advertisement