రెండు తలల పాములకు అతీంద్రియ శక్తులుండవు

17 Feb, 2018 04:08 IST|Sakshi

అలాంటి అసత్య ప్రచారాలు నమ్మొద్దు: అటవీ శాఖ ప్రత్యేకాధికారి శంకరన్‌ 

సాక్షి, హైదరాబాద్‌: రెండు తలల పాములకు అతీంద్రియ శక్తులు ఉండవని, అన్ని పాముల్లానే అవి కూడా సాధారణ విష రహిత సర్పాలని వణ్యప్రాణి నిపుణుడు, అటవీ శాఖ ప్రత్యేకాధికారి ఎ.శంకరన్‌ స్పష్టం చేశారు. రెండు తలల పాములతో గుప్త నిధులు సాధించవచ్చంటూ జరుగుతున్న ప్రచారం మోసమని పేర్కొన్నారు. వాస్తవానికి ఆ పాముకు ఒకే తల ఉంటుందని, అయితే దాని తోక కూడా తలను పోలి ఉండటంతో రెండు తలల పాముగా వాడుకలోకి వచ్చిందని తెలిపారు.

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ సమీపంలో మల్కాపూర్, హైదరాబాద్‌ బేగంపేట రైల్వే స్టేషన్, ఎయిర్‌ ఫోర్స్‌ కాలనీ, మేడ్చల్‌లలో ఈ పాములను అటవీ శాఖాధికారులు స్వాధీనం చేసుకొని గురువారం రక్షిత అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఈ సందర్భంగా శంకరన్‌ మాట్లాడుతూ.. గుప్త నిధుల బలహీనత ఆసరాగా పాముల వేట కొనసాగుతోందని, ఈ విషయమై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రెండు తలల పాముల అమ్మకం, అతీంద్రియ శక్తులుంటాయని ఎవరైనా ప్రచారం చేస్తే అటవీ శాఖ టోల్‌ ఫ్రీ నంబర్‌ 1800 4255 364కు ఫిర్యాదు చేయాలని చెప్పారు. అలాంటి నేరాలకు వన్యప్రాణి సంరక్షణ చట్టం సెక్షన్‌ 51 కింద మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశముందన్నారు.

మరిన్ని వార్తలు