కడియం చైర్మన్‌గా ‘కేబ్’ ఉపసంఘం

26 Oct, 2016 00:43 IST|Sakshi
కడియం చైర్మన్‌గా ‘కేబ్’ ఉపసంఘం

ప్రకటించిన కేంద్ర మంత్రి జవదేకర్
- బాలికల విద్య అంశాలపై అధ్యయనం చేయనున్న కమిటీ
- 64వ కేబ్ సమావేశంలో పలు నిర్ణయాలు
- ‘నో డిటెన్షన్ పాలసీ’అమలుపై రాష్ట్రాలకు స్వేచ్ఛ
- డిటెన్షన్ విధానాన్ని వ్యతిరేకించిన కడియం
- లోటుపాట్లు సరిచేస్తే సత్ఫలితాలు వస్తాయని స్పష్టీకరణ
 
 సాక్షి, న్యూఢిల్లీ: బాలికల విద్యకు సంబంధించిన పలు అంశాలను అధ్యయనం చేసేందుకు తెలంగాణ డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి చైర్మన్‌గా ‘కేబ్’ (సెంట్రల్ అడ్వయిజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్) ఉపసంఘం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. జాతీయ స్థాయిలో విద్యారంగ వ్యవహారాలపై కేంద్ర ప్రభుత్వానికి సలహాలు, సూచనలివ్వడానికి ఏర్పాటైన కేబ్ 64వ సమావేశంలో జవదేకర్ ఈ మేరకు ప్రకటించారు. జాతీయ నూతన విద్యా విధానంతోపాటు విద్యా ప్రమాణాలు మెరుగుపర్చేందుకు తీసుకోవాల్సిన అంశంపై మంగళవారం ఇక్కడ జరిగిన సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగింది.

 నో డిటెన్షన్‌పై నిర్ణయం రాష్ట్రాలకే..!
 విద్యా హక్కు చట్టంలో భాగంగా అమలు చేస్తున్న ‘నో డిటెన్షన్’ విధానంపై రాజస్థాన్ విద్యా శాఖ మంత్రి అధ్యక్షతన ఏర్పా టైన కేబ్ ఉపసంఘం తమ నివేదికను సమావేశంలో అందించింది. నో డిటెన్షన్ పాలసీ వల్ల ఫలితాలు ఆశించిన మేరకు లేవని, విద్యా ప్రమాణాలు తరగడమే కాక నాణ్యమైన విద్య కొరవడుతోందని పలు రాష్ట్రాల విద్యా శాఖ మంత్రులు అభిప్రాయపడ్డారు. ‘నో డిటెన్షన్’ పాలసీని ఎత్తివేయాలని మెజారిటీ రాష్ట్రాల మంత్రులు డిమాండ్ చేశారు. అయితే కడియం అందుకు వ్యతిరేకించారు. పాఠశాల స్థాయిలో విద్యార్థుల వెనుకబాటుతనానికి ఈ పాలసీ కారణం కాదని స్పష్టంచేశారు. ఈ విధానాన్ని కొనసాగిస్తూనే విద్యా ప్రమాణాలు పెంచడానికి మార్గాలను అన్వేషించాలని సూచించారు.

టీచర్లను తగిన సంఖ్యలో అందుబాటులో ఉంచి, డ్రాపవుట్స్ పెరగకుండా జాగ్రత్తలు పాటిస్తే సత్ఫలితాలు సాధించవచ్చన్నారు. డిటెన్షన్ విధానాన్ని అమలు చేయడమంటే విద్యా హక్కును కాలరాయడమేనన్నారు. దీంతో నిరుపేద విద్యార్థులు చదువుకు దూరమవుతారన్నారు. అందువల్ల డిటెన్షన్ విధానం అమలుకు తాము సుముఖంగా లేమన్నారు. ప్రస్తుత విధానంలో లోటుపాట్లు ఉంటే సరి చేయాలని, స్కూళ్లలో మౌలిక వసతులు పెంచాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఏటా డ్రాపవుట్స్ శాతం పెరగడానికి ప్రైవేటు స్కూళ్లకు ఊతమిచ్చేలా ఉన్న కొన్ని ప్రభుత్వ పథకాలే కారణమని, వాటిని సవరించాల్సిన అవస రముందన్నారు. ఈ వాదనలతో కొన్ని రాష్ట్రాల విద్యా శాఖ మంత్రులు ఏకీభవించారు. దీంతో ఈ పాలసీని సమీక్షించే స్వేచ్ఛను రాష్ట్రాలకే ఇస్తామని జవదేకర్ తెలిపారు. విద్య జాతీయ ఎజెం డా అని, నాణ్యమైన విద్య అందించే విషయంపై ప్రతి ఒక్కరూ దృష్టి కేంద్రీకరించాల్సి ఉందన్నా రు. శిక్షణ లేని టీచర్లకు శిక్షణనిచ్చే కార్యక్రమాన్ని రానున్న ఐదేళ్లలో పూర్తి చేయాలని నిర్ణయిం చారు. కేంద్రమంత్రులు విజయ్ గోయల్, రాజీవ్ ప్రతాప్ రూడీ తో పాటు వివిధ రాష్ట్రాల విద్యా శాఖ మంత్రులు ఈ భేటీలో పాల్గొన్నారు.
 
 ఆడపిల్లల విద్యపై చర్చ ఏది?
 బాలికల విద్య అంశాన్ని కేబ్ భేటీలో చర్చించకపోవడం దురదృష్టకరమని మంత్రి కడియం శ్రీహరి అన్నారు. ప్రధాని మోదీ ఎర్రకోట వేదికగా ఆడపిల్లల విద్య కోసం ‘బేటీ బచావో... బేటీ పడావో’ నినాదాన్ని ఇచ్చిన సంగతిని గుర్తు చేశారు.  వెంటనే స్పందించిన కేంద్రమంత్రి జవదేకర్... కడియం నేతృత్వంలోనే కేబ్ ఉపసంఘం ఏర్పాటు చేయడం గమనార్హం.

మరిన్ని వార్తలు