ఎమ్మెల్యే పదవికి ఉత్తమ్‌ రాజీనామా

6 Jun, 2019 04:11 IST|Sakshi

అసెంబ్లీ కార్యదర్శికి రాజీనామా సమర్పించిన టీపీసీసీ చీఫ్‌

ఎంపీగా గెలవడంతో రాజీనామా అనివార్యం

ఖాళీ అయిన హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే స్థానం

అసెంబ్లీలో 18కి తగ్గిన కాంగ్రెస్‌ బలం

సాక్షి, హైదరాబాద్‌: హుజూర్‌నగర్‌ టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇటీవల వెలువడిన పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాల్లో నల్లగొండ నుంచి ఉత్తమ్‌ ఎంపీగా ఎన్నికైన సంగతి తెలిసిందే. దీంతో ఆయన తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. బుధవారం అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచారికి తన రాజీనామా లేఖను ఉత్తమ్‌ అందజేశారు. ఉత్తమ్‌రాజీనామాను ఆమోదిస్తూ అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్‌ విడుదల చేశారు. దీంతో హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే స్థానానికి ఉపఎన్నిక అనివార్యంగా మారింది. గతేడాది అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ రాష్ట్రవ్యాప్తంగా మెజారిటీ స్థానాలను కైవసం చేసుకున్నా.. హుజూర్‌నగర్‌లో ఉత్తమ్‌ మాత్రం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఉత్తమ్‌ 1999 నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. ప్రస్తుతం హుజూర్‌నగర్‌ స్థానం ఖాళీ అవడంతో ఆరు నెలల్లోపు ఉపఎన్నిక నిర్వహిస్తారు.  

మరో ఎమ్మెల్యే చేజారితే.. సీఎల్పీ కష్టమే
2018 అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున 19 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఉత్తమ్‌ రాజీనామాతో సాంకేతికంగా 18కి చేరింది. ఇప్పటికే 11 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. వీరంతా అధికారికంగా టీఆర్‌ఎస్‌లో చేరనప్పటికీ.. వారు కాంగ్రెస్‌తో ఎలాంటి సంబంధాలు కొనసాగించడంలేదు. ఇక ఎమ్మెల్యేలు భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, సీతక్క, పోడెం వీరయ్య, రోహిత్‌రెడ్డి, జగ్గారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాత్రమే పార్టీలో కొనసాగుతున్నారు. ఉత్తమ్‌ రాజీనామాతో అసెంబ్లీలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల బలం 18కి తగ్గింది.

సాంకేతికంగా 11 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడితే.. అసెంబ్లీలో సీఎల్పీ మనుగడ కష్టతరంగా మారనుంది. 11 మంది ఎమ్మెల్యేలకు తోడుగా మరో ఎమ్మెల్యే పార్టీకి దూరమైతే అసెంబ్లీలో సీఎల్పీ మనుగడ ప్రశ్నార్థకం. వచ్చే నెలలో అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు టీఆర్‌ఎస్‌ పావులు కదిపేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌తో టచ్‌లో ఉన్నారని గాంధీభవన్‌ సమాచారం. వీరిలో ఒక్కరు చేజారినా.. అసెంబ్లీలో సీఎల్పీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేసే ప్రక్రియను వేగవంతం చేయనుందని సమాచారం.

ఉత్తమ్‌ ప్రస్థానమిదీ..
సూర్యాపేట జిల్లా తాటిపాముల గ్రామానికి చెందిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భారత్‌–చైనా సరిహద్దుల్లో దేశ భద్రతా దళంలో యుద్ధవిమానాల పైలట్‌గా చాలాకాలం పనిచేశారు. తర్వాత రాష్ట్రపతి భవన్‌లో మాజీ రాష్ట్రపతులు ఆర్‌.వెంకట్రామన్, శంకర్‌దయాళ్‌ శర్మల వద్ద ఉన్నతాధికారి హోదాలో పనిచేశారు. అనంతరం ఆ పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. 1999, 2004, 2009, 2014, 2018లో ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వీటిలో 1999, 2004లో కోదాడ నుంచి ప్రాతినిధ్యం వహించిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం 2009 నుంచి హుజూర్‌నగర్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్‌ సాధించారు.

2004లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉత్తమ్‌కుమార్‌కు పార్టీలో ప్రాధాన్యం పెరిగింది. శాసనసభ పబ్లిక్‌ అండర్‌ టేకింగ్‌ కమిటీ చైర్మన్‌గా, ఎస్టిమేషన్‌ కమిటీ చైర్మన్‌గా 610 జీవో హౌస్‌ మెయింటెన్‌ కమిటీ చైర్మన్‌గా ఉత్తమ్‌ సేవలందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గృహనిర్మాణశాఖ మంత్రిగా పనిచేశారు. 20 ఏళ్ల పాటు రెండు నియోజకవర్గాలలో ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ప్రధానంగా ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీటి అభివృద్ధి, విద్యుత్‌ సబ్‌ స్టేషన్లు, రహదారుల నిర్మాణం, ఇంటర్‌ డిగ్రీ కళాశాలలు, ఆసుపత్రులు అనేక అభివృద్ధి పనులు ఈ జాబితాలో ఉన్నాయి.

కోదాడ, హుజూర్‌నగర్‌ ప్రజలను మర్చిపోలేను: ఉత్తమ్‌
రాజీనామా అనంతరం ఉత్తమ్‌ మీడియాతో మాట్లాడుతూ.. తనను గత మూడు దశాబ్దాలుగా కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాల ప్రజలు తనను ఎంతో ఆదరించారన్నారు. ఇపుడు ఎంపీగా కూడా గెలిపించి వారి అభిమానాన్ని మరోసారి చాటుకున్నారని అన్నారు. ఎంపీగా గెలిచిన తరువాత ఎమ్మెల్యేగా రాజీనామా అనివార్యం అయిందని వివరించారు. వారి కుటుంబసభ్యులలో ఒకరిగా ఎంతో ప్రేమగా చూసుకున్నారని, ఆ అభిమానాన్ని ఎన్నటికీ మర్చిపోలేనని అన్నారు. ఎంపీగా ఆ రెండు నియోజకవర్గాలతోపాటు మరో ఐదు నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే అవకాశం ఉందని ఇది తనకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. నా ప్రాణం ఉన్నంత కాలం నాకు ప్రజాసేవ చేసుకునేందుకు అవకాశం ఇచ్చిన నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని, వారి సేవకే అంకితం అవుతానని ఉద్ఘాటించారు.

మరిన్ని వార్తలు