యోగాను పాఠ్యాంశాల్లో భాగం చేయాలి 

22 Jun, 2019 02:14 IST|Sakshi

ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు 

వేడుకల్లో పాల్గొన్న కిషన్‌ రెడ్డి, తెలంగాణ బీజేపీ ఎంపీలు 

సాక్షి, న్యూఢిల్లీ: ఆరోగ్యకరమైన జీవనశైలిని పెంపొందించడానికి, అసంక్రమిత వ్యాధుల పెరుగుదలను ఎదుర్కొనేందుకు విద్యార్థులకు యోగాను పాఠ్యాంశంగా బోధించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ప్రజాపిత బ్రహ్మకుమారీస్‌ విశ్వవిద్యాలయ, ఆయుష్‌ మంత్రాలయం సంయుక్తంగా నిర్వహించిన వేడుకల్లో వెంకయ్య నాయుడు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాచీన భారతీయ యోగాభ్యాసం శారీరక దృఢత్వం కోసమే కాదని, మానసిక సమతుల్యతను, క్రమశిక్షణను కూడా పెంపొందిస్తుందన్నారు. ఇన్ని ప్రయోజనాల నేపథ్యంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు యోగాను పాఠ్యాంశాల్లో భాగం చేయాలని సూచించారు. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు యువత ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నాయన్నారు. శారీరక శ్రేయస్సు కోసం మాత్రమే కాక, మంచి జీవితాన్ని గడపడానికి యోగా ఉపయోగపడుతుందన్నారు. మరోవైపు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి ఆర్కేపురం సెక్టార్‌–4లోని కమ్యూనిటీ సెంటర్‌లో జరిగిన యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు బండి సంజయ్, సోయం బాపూరావు మండి హౌస్‌ గార్డెన్‌లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు