వరదొచ్చే దాకా వణుకే!

31 May, 2018 01:45 IST|Sakshi

రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులన్నీ ఖాళీ..

కృష్ణా బేసిన్‌లో 592, గోదారిలో 160 టీఎంసీల నీటి లోటు 

జూన్‌లో వర్షాలు కురిసినా ఆగస్టు వరదలే దిక్కు

వరదలు ఆలస్యమైతే సాగు, తాగునీటికి కటకటే

సాక్షి, హైదరాబాద్‌ : గోదావరి, కృష్ణా ప్రధాన ప్రాజెక్టులన్నీ జలకళను కోల్పోయి నిర్జీవంగా మారాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది తీవ్ర నీటి ఎద్దడితో కొట్టుమిట్టాడుతున్నాయి. కృష్ణా బేసిన్‌ ఎగువన కర్ణాటక ప్రాజెక్టులు సైతం తీవ్ర నీటి కొరతను ఎదుర్కోవడం, అవి నిండితే కానీ దిగువన ఉన్న జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులు నిండే అవకాశం లేకపోవడంతో ఇక ఆశలన్నీ వర్షాలపైనే ఆధారపడి ఉన్నాయి. ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర ప్రాజెక్టుల్లో కనీసం 200 టీఎంసీల మేర నీటి నిల్వలు వస్తేకానీ దిగువన తెలంగాణ ప్రాజెక్టుల్లోకి వరద ప్రవాహాలు పెరిగే అవకాశాల్లేవు. ఈ పరిస్థితి రాష్ట్రాన్ని కలవరపెడుతోంది. 

గణనీయంగా పడిపోయిన మట్టాలు 
కృష్ణా బేసిన్‌లోని ప్రధాన ప్రాజెక్టుల్లో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నీటిమట్టాలు గణనీయంగా పడిపోయాయి. ఎగువ కర్ణాటకలో గతేడాది కాస్త ఆలస్యంగా సెప్టెంబర్, అక్టోబర్లో భారీ వర్షాలు కురిసి ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర నిండినా ఖరీఫ్, రబీలో అక్కడ గణనీయమైన సాగు జరిగింది. దీంతో ఆ మూ డు ప్రాజెక్టుల్లో ప్రస్తుతం 267 టీఎంసీల నిల్వ కు గానూ కేవలం 45 టీఎంసీల నీటి లభ్యతే ఉంది. 222 టీఎంసీల కొరత ఉంది. గతేడాది ఇదే సమయంలో ఉన్న నిల్వలతో పోలిస్తే ఈ ఏడాది దాదాపు 10 టీఎంసీలు తక్కువగా ఉంది. ఎగువన సుమారు 200 టీఎంసీల మేర నీరు చేరాకే దిగువకు నీరొచ్చే అవకాశాలుంటాయి. అందుకు రెండు నెలలకన్నా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. ఇక రాష్ట్ర పరిధిలోని నాగార్జునసాగర్, శ్రీశైలం, జూరాల ప్రాజెక్టులు ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాయి.

ఈ ప్రాజెక్టుల్లో 370 టీఎంసీల మేర నీటి కొరత ఉంది. ప్రస్తుతం సాగర్, శ్రీశైలంలో వినియోగించగల నీటి నిల్వలు 10 టీఎంసీలలోపే ఉన్నాయి. ఆ నీరు ఇరు రాష్ట్రాలకు ఆగస్టు వరకు తాగునీటి అవసరాలను తీర్చడం అనుమానమే. ఈ నేపథ్యంలో ఎగువ నుంచి వచ్చే వరదలపైనే రాష్ట్ర ప్రాజెక్టుల కింద తాగు, సాగు అవసరాలు ఆధారపడి ఉండనున్నాయి. ఒకవేళ జూన్, జూలైలో మంచి వర్షాలు కురిసినా రాష్ట్ర ప్రాజెక్టుల్లో చేరే నీటిలో సుమారు 50 నుంచి 60 టీఎంసీల మేర తాగునీటి అవసరాలకు పక్కన పెట్టాకే ఖరీఫ్‌ అవసరాలకు వినియోగిస్తారు. మొత్తంగా సెప్టెంబర్, అక్టోబర్‌ దాకా ఖరీఫ్‌ ఆయకట్టుపై స్పష్టత వచ్చే అవకాశాల్లేవు. ప్రాజెక్టుల్లోకి సకాలంలో నీరు చేరకుంటే ఆ ప్రభావం సాగర్, జూరాల, కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా పరిధిలోని 11 లక్షల ఎకరాల ఆయకట్టుపై పడే ప్రమాదం ఉంది. ఇక గోదావరి బేసిన్‌ ప్రాజెక్టుల్లోనూ 160.72 టీఎంసీల నీటి కొరత ఉంది. ఇక్కడ జూలై నుంచే కొంతమేర ప్రవాహాలు కొనసాగితే తాగునీటి వరకు ఇబ్బంది ఉండదు. సకాలంలో నీరు రాకుంటే గతేడాది మాదిరే తాగునీటికి కటకట ఏర్పడనుంది. 

కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ఇలా.. (టీఎంసీల్లో) 
ప్రాజెక్టు        వాస్తవ నీటి నిల్వ    ప్రస్తుత నిల్వ 
జూరాల            9.65            3.66 
శ్రీశైలం            215.81        28.86 
సాగర్‌            312.05        135.09 
ఆల్మట్టి            129.72        22.57 
నారాయణపూర్‌        37.64            19.73 
తుంగభ్రద            100.86        3.81 

గోదావరిలో ఇలా.. 
సింగూర్‌            29.91            7.66 
నిజాంసాగర్‌        17.80            2.48 
ఎస్సారెస్పీ            90.31            6.64 
ఎల్‌ఎండీ            24.07            3.66 
కడెం            7.60            2.89 
ఎల్లంపల్లి            20.18            5.82  

మరిన్ని వార్తలు