అద్భుతం ఆవిష్కృతం

25 Apr, 2019 04:28 IST|Sakshi

కాళేశ్వరంలో సాక్షాత్కారమైన జలదృశ్యం​​​​​

భారీ మోటార్‌ వెట్‌రన్‌ విజయవంతం

ధర్మారం(ధర్మపురి): కాళేశ్వరం ప్రాజెక్టులో అద్భు తం ఆవిష్కృతమైంది. రాష్ట్ర సాగునీటి చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ కనీవినీ ఎరుగని రీతిలో జల దృశ్యం సాక్షాత్కారమైంది. పనులు మొదలైనప్పటి నుంచి రికార్డుల మీద రికార్డులు సొంతం చేసుకుంటున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం మరో కీలకమైన మైలురాయిని అధిగమించింది. ప్యాకేజీ–6లో భాగం గా ధర్మారం మండలం నందిమేడారం వద్ద నిర్మిం చిన సర్జిపూల్‌లో ఏర్పాటు చేసిన భారీ మోటార్‌ వెట్‌రన్‌ విజయవంతమైంది. ఈ పరీక్షకు సంబంధించి సాంకేతిక ప్రక్రియలన్నీ పూర్తికావడంతో అధికారులు బుధవారం వెట్‌రన్‌ నిర్వహించారు. నందిమేడారం సర్జిపూల్‌లో నింపి ఉంచిన ఎల్లంపల్లి నీళ్లను రిజర్వాయర్‌లోకి విడుదల చేశారు. ఈ సర్జిపూల్‌లో మొత్తం 124.5 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 7 మోటార్లు బిగించాల్సి ఉండగా.. ఇప్పటివరకు 4 మోటార్లు సిద్ధంచేశారు.

వీటిలో మొదటి మోటార్‌ను వెట్‌రన్‌ చేయడం ద్వారా సర్జిపూల్‌ నుంచి రిజర్వాయర్‌లోకి నీటిని పంప్‌ చేశారు. తొలుత ఉదయం 11 గంటలకు భూగర్భంలోని పంప్‌హౌస్‌ వద్ద సీఎంఓ కార్యదర్శి స్మితాసబర్వాల్, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లు, నీటి పారుదల సాంకేతిక సలహాదారు పెంటారెడ్డి, ఈఈ నూనె శ్రీధర్, నవయుగ సీఎండీ శ్రీధర్, జీధెం శ్రీనివాస్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు ఇంజనీరింగ్‌ అధికారుల సమక్షంలో స్మితాసబర్వాల్‌ మొదటి పంప్‌ స్విచ్‌ ఆన్‌చేసి వెట్‌రన్‌ ప్రారంభించారు. మోటార్‌ ఆన్‌ చేయగానే పంపింగ్‌ ప్రారంభమై టన్నెల్‌ ద్వారా మేడారం రిజర్వాయర్‌ సమీపంలోని డెలివరీ సిస్టర్న్‌ ద్వారా నీరు పైకి వచ్చింది. ఈ పరీక్ష విజయవంతం కావడంతో సాయంత్రం 5.30 గంటల సమయంలో ఇదే మోటార్‌కు మరోసారి వెట్‌రన్‌ నిర్వహించారు. 

ఈఎన్‌సీ, ఈఈల పనితీరు భేష్‌.. 
మొదటి మోటర్‌ వెట్‌రన్‌ విజయవంతం కావడం వెనుక ఇంజనీరింగ్‌ అధికారుల నిరంతర శ్రమ ఉందని సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్‌ ప్రశంసించారు. ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లు, ఈఈ శ్రీధర్, నీటి పారుదల సాంకేతిక సలహాదారు పెంటారెడ్డి చాలా చక్కగా పనిచేశారని కొనియాడారు. ఈఎన్‌సీ వెంకటేశ్వర్లు చాలా కష్టపడ్డారని ఈఈ శ్రీధర్‌ స్మితాసబర్వాల్‌కు చెప్పగా.. మీరు కూడా సూపర్‌ వర్కర్‌ అని ఆమె కితాబిచ్చారు. 

మరిన్ని వార్తలు