ఏమ్మా.. ఈ డబ్బు ఏం చేస్తావ్‌?

17 May, 2018 13:06 IST|Sakshi
నవాబుపేట బ్యాంకులో మహిళతో మాట్లాడుతున్న కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌

నవాబుపేట(జడ్చర్ల) : ఏమ్మా.. ఈ డబ్బులు ఏం చేస్తావ్‌... అని బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసుకుని వెళ్తున్న మహిళను ఆరా తీసి వివరాలు తెలుసుకున్నారు కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌. నవాబుపేట మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో బుధవారం రైతు బంధు చెక్కుల పంపిణీని కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా బ్యాంకు నుంచి డబ్బు తీసుకుని వెళ్తున్న మహిళతో ఆయన మాట్లాడారు. లింగంపల్లికి చెందిన భారతమ్మ తనకు రూ.14వేలు వచ్చాయిని, ఈ డబ్బులను వ్యవసాయానికే ఉపయోగిస్తానని చెప్పడంతో అభినందించారు.

ఈ మేరకు కలెక్టర్‌ తీగలపల్లి, రుద్రారం, సిద్దోటం గ్రామాల్లో చెక్కుల పంపిణీని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా రెవెన్యూ, బ్యాంకు అధికారులకు పలు సూచనలు చేసిన ఆయన ఇబ్బందులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని రైతులను కోరారు. తహసీల్దార్‌ శ్రీనివాస్‌రావు, మండల స్పెషల్‌ అధికారి కొమురయ్య, మార్కెట్‌ చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, ఎంపీపీ శ్రీనివాస్, మాజీ ఎంపీపీ నర్సింహులు, ఎంపీడీఓ సాయిలక్ష్మి, సర్పంచ్‌లు రుద్రారం లక్ష్మి, సిద్దోటం నర్సింహులు, వైస్‌ ఎంపీపీ నారాయణ, బాలకిష్టయ్య, మధు, యాదిరెడ్డి, కృష్ణ, సంతో‹ష్‌ పాల్గొన్నారు. 

అర్హులందరికీ చెక్కులు 

జడ్చర్ల : రైతుబంధు పథకం కింద అర్హులైన రైతులందరికీ చెక్కులు అందజేస్తామని కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ పేర్కొన్నారు. మండల పరిధిలోని పోలేపల్లి గ్రామంలో జరిగిన రైతుబంధు చెక్కులు, పట్టాదార్‌ పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డితో పాటు కలెక్టర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వివాదస్పద భూములు మినహా రైతులకు వంద శాతం చెక్కులు అందించే విధంగా కృషి చేస్తామన్నారు.

చెక్కుల పంపిణీ కార్యక్రమం అనంతరం ఈనెల 18 నుండి ప్రతీ గ్రామంలో తమ సిబ్బంది పర్యటించి కోర్టు కేసులు మినహాయించి వివాదాల్లో ఉన్న భూముల విషయమై విచారించి ఆయా రైతులకు కూడా చెక్కులు అందేలా చూస్తామన్నారు. జెడ్పీటీసీ సభ్యురాలు జయప్రద, ఎంపీపీ లక్ష్మి, ఏడీఏ నిర్మల, సర్పంచ్‌ శ్రీనివాస్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు జంగయ్య, తహసీల్దార్‌ లక్ష్మీనారాయణ, సింగిల్‌ విండో చైర్మన్‌ బాల్‌రెడ్డి, మార్కెట్‌యార్డు డైరెక్టర్‌ గోవర్దన్‌రెడ్డి పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు