రాజన్నా.. నీకు సలాం

28 Mar, 2014 01:31 IST|Sakshi
YS Rajashekar Reddy

  వైఎస్సార్‌ను స్మరించుకుంటున్న ముస్లింలు
 
 సాక్షి, నల్లగొండ,వైఎస్సార్.. ఈ పేరు అంటేనే ముస్లింలకు ఎనలేని గౌరవం. ప్రతి నిరుపేద ముస్లిం.. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నాడు. ఆర్థికంగా వెనకబడిన ముస్లింలు పెళ్లి చేసుకుంటే ఇచ్చే ప్రోత్సాహకాన్ని పెంచారు. గతంలో రూ. 15 వేలు ఉన్న మొత్తాన్ని.. రూ. 25 వేలకు పెంచి బీద కుటుంబీకులకు ఆసరా అయ్యారు. ఇలా ఎన్నో కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందాయి. అంతేగాక ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం వారి బతుకుల్లో వెలుగులు నింపింది. పూట గడవడమే గగనంగా ఉన్న కుటుంబం నుంచి వైద్యుడిగా ఎదిగేందుకు తోడ్పాటునందించిన ఘనత  వైఎస్సార్‌కే దక్కింది. ఇలా ఈ ఒక్క కుటుంబమే కాదు.. జిల్లాలో వందల కుటుంబాలు జీవితంలో స్థిరపడ్డాయి. వేల సంఖ్యలో ముస్లిం విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించారు. వీరంతా చదువుల దేవుడిగా వైఎస్సార్‌ను కొలుస్తున్నారు. అంతేగాక 4శాతం రిజర్వేషన్లు కల్పించి జీవితాలను నిలబెట్టారు. ఇలా రిజర్వేషన్లు కేటాయించడం వల్ల వేల మంది విద్యార్థులు ఆయా వర్సిటీల్లో సీట్లు సాధించగలిగారు. ఇలా వైఎస్సార్ చేతుల మీదుగా పురుడు పోసుకున్న పథకాల  ద్వారా లబ్ధి పొందిన కొందరి మనోగతం....     
 
  నిరుపేద ముస్లింలను ఆదుకున్న జననేత
 
 ముస్లింలను గతంలో ఏ ప్రభుత్వాలూ పట్టించుకోలేదు. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత నిరుపేదలను ఆదుకున్న తీరు అమోఘం. గతంలో ముస్లిం నిరుపేదలు పెళ్లిళ్లు చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడేవారు. అటువంటి వారిని గుర్తించింది రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం. నిరుపేద ముస్లింలు పెళ్లిళ్లు చేసుకుంటే రూ. 25 వేలు అందించే పథకాన్ని పునరుద్ధరించారు. చాలామంది ముస్లింల పిల్లులు ఆర్థిక పరిస్థితులు బాగాలేక మధ్యలోనే చదువు మానేసేవారు. అటువంటి వారి జీవితాల్లో వెలుగులు నింపాలన్న ఉద్దేశంతో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు.

దీంతో ఎంతోమంది నిరుపేద ముస్లిం పిల్లలు కార్పొరేట్ కళాశాలల్లో చదువుకుంటున్నారు. కేవలం ఉన్నత చదువులు చదవడమే కాదు.. ఆయన ముస్లింలకు కల్పించిన నాలుగు శాతం రిజర్వేషన్ల వల్ల చాలామంది పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. దీంతో వారి కుటుంబాలు ఆనందంలో మునిగిపోయాయి. ముస్లింల జీవితాలు ఇలా బాగుపడతాయని నేను ఎన్నడూ అనుకోలేదు. పరిస్థితిని చూస్తుంటే ఇది నిజమేనా.. మా బతుకులకు ఇంత ఆసరా దొరికిందా అనిపిస్తున్నది. ముస్లింల జీవితాల్లో ఇంతటి మార్పు రావడం అంతా వైఎస్ చలవే. ఆ మహానేత చేసిన మేలును సమాజం ఎప్పటికీ మరచిపోదు.  

                                                                                                     - మహ్మద్ రహమాన్‌సాబ్, తుర్కపల్లి

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు