దాడులు, హత్యలతో అట్టుడుకుతున్న కేరళ

3 Mar, 2017 11:41 IST|Sakshi
దాడులు, హత్యలతో అట్టుడుకుతున్న కేరళ

త్రివేండ్రం: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఆర్ఎస్ఎస్ నేత చంద్రావత్ చేసిన వ్యాఖ్యలు.. కేరళలో అగ్గిరాజేశాయి. సీపీఎం వర్సెస్ బీజేపీ-ఆర్‌ఎస్ఎస్‌ల మధ్య పోరు తీవ్రమై హింసాత్మకంగా మారింది. దాడులు, ప్రతిదాడులు, హత్యలతో కేరళ అట్టుడుకుతోంది. కేరళలో అధికార సీపీఎం అనుబంధ యువజన విభాగం డీవైఎఫ్ఐకు చెందిన ఇద్దరు కార్యకర్తలను హత్య చేశారు. గురువారం రాత్రి పలక్కాడ్ జిల్లా ఎలప్పులిలో వారిని చంపేశారు. ముగ్గురు బీజేపీ కార్యకర్తలపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు చెప్పారు.

 కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను చంపినవాళ్లకు కోటి రూపాయలు ఇస్తామని మధ్యప్రదేశ్‌కు చెందిన ఆర్ఎస్ఎస్ నాయకుడు డాక్టర్ చంద్రావత్ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల తర్వాత నిన్న రాత్రి కోజికోడ్ జిల్లాలో ఆర్ఎస్ఎస్ కార్యాలయం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు బాంబు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ముగ్గురు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన కాసేపటికే కోజికోడ్‌లోనే సీపీఎం కార్యాలయంపై దాడి జరిగింది. గుర్తు తెలియని దుండగులు సీపీఎం కార్యాలయాన్ని తగలబెట్టారు. వరుస దాడులతో కేరళలో కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

>
మరిన్ని వార్తలు