2జీ స్పెక్ట్రం వేలం... రెండో రోజూ అదే జోరు

5 Feb, 2014 01:30 IST|Sakshi

న్యూఢిల్లీ: 2జీ వేలంలో టెల్కోల జోరు కొనసాగుతోంది. రెండో రోజైన మంగళవారం కూడా బిడ్డింగ్ దూకుడు తగ్గలేదు. ఇప్పటిదాకా మొత్తం 12 రౌండ్‌లు ముగిసేసరికి రెండు బ్యాండ్‌విడ్త్‌లతో కలిపి రూ.45,000 కోట్లకుపైగా విలువైన బిడ్‌లు లభించినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. 900 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌లో ఢిల్లీ, ముంబై, కోల్‌కతా సర్కిళ్లలో బిడ్డింగ్ పోటాపోటీగా జరిగినట్లు తెలిపాయి. 1,800; 900 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌లతో తొలిరోజు మొత్తం రూ.39,300 కోట్ల విలువైన బిడ్‌లు వచ్చాయి.

 లక్ష్యంకంటే ఎక్కువ మొత్తం...:తొలిరోజు బిడ్డింగ్ మొత్తం ప్రకారం చూసినా... టెల్కోలు వాయిదాల్లో వేలం ధరను చెల్లించాలనుకుంటే ఇప్పటికిప్పుడు ప్రభుత్వానికి కనీసం రూ.11,590 కోట్లు లభించవచ్చని అంచనా. అంటే సర్కారు లక్ష్యంగా పెట్టుకున్న రూ.11,343 కోట్ల(ముందస్తు చెల్లింపులు) కంటే ఈ మొత్తం ఎక్కువే కావడం గమనార్హం. వేలం తుది ధరలో దాదాపు నాలుగు లేదా మూడోవంతు మొత్తాన్ని ముందుగా చెల్లింపు మిగతా మొత్తాన్ని 2026 వరకూ వార్షిక వాయిదాల్లో చెల్లించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది.

 హేతుబద్దీకరణ ఫలితమే...: ప్రస్తుత 2జీ వేలంలో టెలికం కంపెనీల నుంచి భారీ స్పందనకు స్పెక్ట్రం ప్రారంభ ధరల(బేస్ రేట్లు) హేతుబద్దీకరణ  దోహదం చేసిందని టెలికం మంత్రి కపిల్ సిబల్ వ్యాఖ్యానించారు. ‘వేలంలో స్పెక్ట్రం  బేస్ ప్రైస్‌ను ఆమోదయోగ్యంగా ఉండేలా  చర్యలను మేం తీసుకున్నాం. ఇప్పుడు జరుగుతున్న 2జీ స్పెక్ట్రం వేలంలో రూ.45 వేల కోట్ల బిడ్‌లు రావడం.... ప్రభుత్వ చర్యలు ఫలితాలిచ్చాయనేందుకు నిదర్శనం’ అని సిబల్ చెప్పారు.

>
మరిన్ని వార్తలు