అణుదాడి నుంచి అమెరికాను కాపాడాడు!

18 Sep, 2015 15:26 IST|Sakshi
అణుదాడి నుంచి అమెరికాను కాపాడాడు!

ఆయన ఓ రష్యన్ లెఫ్టినెంట్ కర్నల్. కానీ అమెరికా మీద అణుబాంబు దాడి జరగకుండా అగ్రరాజ్యాన్ని కాపాడాడు! అత్యంత ఉత్కంఠభరితమైన క్షణంలో ఆయన తీసుకున్న ఓ నిర్ణయం.. ఒకరకంగా ఈ ప్రపంచాన్నే కాపాడింది. అది 1983 సెప్టెంబర్ 23వ తేదీ. ఆయనపేరు స్టానిస్లవ్ పెట్రోవ్. ఆరోజు రాత్రి ఉన్నట్టుండి ఓ సైరన్ మోగింది. అమెరికా దళాలు ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించబోతోందని దానికి అర్థం. అప్పట్లో 44 ఏళ్ల వయసున్న పెట్రోవ్.. అది నిజమో కాదో తేల్చుకోలేకపోయారు.

అప్పుడప్పుడు అలా ఫేక్ సైరన్లు మోగించి శత్రుపక్షాలను అయోమయంలోకి నెట్టడం కూడా మామూలే. నిజంగా ఖండాంతర క్షిపణులు ప్రయోగిస్తారా, లేదా అనే విషయం ఆయన నిర్ధారించుకుని దాన్ని ఉన్నతాధికారులకు చెప్పాలి. క్షిపణులు ప్రయోగిస్తారని చెబితే, ఇక రష్యా బలగాలు అమెరికా మీద అణుబాంబులు వేయడానికి దాదాపు సిద్ధంగా ఉన్నాయి!! కానీ పెట్రోవ్కు మాత్రం పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. చివరకు అది ఫేక్ అలారమేనని ఆయన నిర్ణయించుకున్నారు. సోవియట్ నాయకత్వానికి ఏమీ చెప్పలేదు.

దాంతో అమెరికా మీద అణుబాంబుల దాడి తప్పిపోయింది. అంతర్యుద్ధం జరుగుతున్న ఆ రోజుల్లో ఏ చిన్న పొరపాటు చేసినా అది లక్షలాది మంది ప్రాణాలకు నష్టం కలిగించేదే. నిజానికి అదే నెలలో అమెరికా నుంచి దక్షిణ కొరియాకు ప్రయాణికులతో వెళ్తున్న ఓ విమానాన్ని.. గూఢచారి విమానం అనుకుని రష్యా కూల్చేసింది. దాంతో అమెరికా కూడా మళ్లీ ఏదైనా జరిగితే అణుదాడి చేయాలని పూర్తి సన్నద్ధంగా ఉంది. అయితే ఈ పరస్పర అణు దాడులను నివారించిన వ్యక్తి.. లెఫ్టినెంట్ కర్నల్ పెట్రోవ్. ఈ మొత్తం ఉదంతంపై ఇటీవల 'ద మ్యాన్ హూ సేవ్డ్ ద వరల్డ్' అనే సినిమా కూడా తీశారు. స్వదేశంలో మాత్రం ఆయన గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ప్రస్తుతం 76 ఏళ్ల వయసున్న పెట్రోవ్.. ఆ రోజు అర్ధరాత్రి అలారం మోగిన శబ్దం ఇప్పటికీ తన గుండెల్లో ప్రతిధ్వనిస్తుంటుందని చెబుతున్నారు!

మరిన్ని వార్తలు