‘కోటా’కు కట్టుబడి ఉన్నాం

20 Oct, 2015 01:41 IST|Sakshi
‘కోటా’కు కట్టుబడి ఉన్నాం

బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ ప్రకటనలు
కోటా విధానాన్ని మార్చే ఆలోచన బీజేపీకి లేదు: అమిత్‌షా
 
 పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికలను వెనుకబడిన తరగతులు, అగ్రవర్ణాల మధ్య యుద్ధంగా మార్చటానికి రాష్ట్ర  సీంఎ  నితీశ్‌కుమార్, ఆర్జేడీ లూ పసాద్‌లు ప్రయత్నిస్తున్నారని బీజేపీ చీఫ్ అమిత్ షా ఆరోపించారు. ప్రస్తుత రిజర్వేషన్ల  విధానానికి తమ పార్టీ కట్టుబడి ఉందని.. మార్చే ప్రణాళిక ఏదీ లేదని పేర్కొన్నారు. మరోవైపు ఆరెస్సెస్ కూడా.. రాజ్యాంగంలో పొందుపరచిన విధంగా ప్రస్తుత రిజర్వేషన్ల విధానాన్ని తాను గట్టిగా సమర్థిస్తున్నట్లు చెప్పింది. రిజర్వేషన్లకు సంబంధించి సంఘ్ అధినేత మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలను.. ఈ అంశంపై తమ సంస్థ అభిప్రాయం గురించి గందరగోళం సృష్టించటానికి వక్రీకరించారంటూ ఖండించింది.

అమిత్‌షా సోమవారం పట్నాలో విలేకర్లతో మాట్లాడుతూ.. ‘రిజర్వేషన్ విధానంలో ఎలాంటి మార్పుకూ బీజేపీ అనుకూలం కాదు.. ప్రస్తుతమున్న కోటా విధానాన్ని పార్టీ బలపరుస్తోంది. దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలు, ఇతరులకు ఇచ్చిన ఈ రాజ్యాంగ హక్కులు ఉల్లంఘనకు గురికాకుండా ఉంచటానికి మేం కట్టుబడి ఉన్నాం’ అని చెప్పారు. రిజర్వేషన్ల విధానాన్ని సమీక్షించాలంటూ భాగవత్ చేసిన వ్యాఖ్యల కారణంగా బిహార్ ఎన్నికల్లో నితీశ్, లాలూ ద్వయం విమర్శలతో బీజేపీ ఆత్మరక్షణలో పడింది. బీసీ ఓటర్ల ఆధిక్యం గల బిహార్‌లో ఓటర్లు కులాలపరంగా ఏకమవుతున్నారన్న ఆందోళన కారణంగా.. రిజర్వేషన్ల విధానాన్ని బలపరుస్తున్నామని అమిత్ ఉద్ఘాటించినట్లు తెలుస్తోంది.  

 వేదిక కూలి పప్పూయాదవ్‌కు గాయాలు
 జన్ అధికార్ పార్టీ(జేఏపీ) చీఫ్ రాజేశ్ రంజన్ అలియాస్ పప్పూయాదవ్ సోమవారం ఎన్నికల సభ వేదిక కూలి స్వల్పంగా గాయపడ్డారు. బిహార్‌లోని సీతామర్హి జిల్లా పరిహార్‌లో నిర్వహించిన సభలో ఈ సంఘటన జరిగింది. చెక్క వేదికపై బరువు పెరగటం వల్ల కొంత భాగం కూలిపోగా, యాదవ్ కాలు అందులో చిక్కుకుని స్వల్పంగా గాయపడ్డారు.

>
మరిన్ని వార్తలు