నగరమా.. నరకమా?

6 Dec, 2015 14:43 IST|Sakshi
నగరమా.. నరకమా?

నరకం అంటే ఇంతకంటే భయంకరంగా ఉంటుందా..? ఏమో.. ఆ నరకాన్ని తలపించే హృదయవిదారక దృశ్యాలు మాత్రం చెన్నైలో ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. ఎప్పుడో పూడ్చిన శవాలు వరద  నీటికి ఉబ్బి, పైకిలేస్తున్నాయి. జనావాసాల్లోకి కొట్టుకొస్తున్నా యి. వాటిని చూసి పిల్లలు, మహిళలు భయంతో వణికిపోతున్నారు. ఇల్లునొదిలి ఎక్కడికైనా వెళ్దామంటే దొంగల  బెడద.. అక్కడే ఉందామంటే మురుగునీరు, శవాల నుంచి వెలువడుతున్న దుర్వాసన. ఇలా బతకలేక, బయట పడలేక ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్నారు .
 
 చెన్నై నుంచి నందగోపాల్, సాక్షి ప్రతినిధి: తమిళనాడుకు తలమానికంగా నిలిచిన చెన్నై నగరం వర్షాలు, వరదలతో చెదిరిపోయింది. తమిళులు ముద్దుగా పిలుచుకునే ‘సుందర చెన్నై’ అనే మాటకు అర్థమే లేకుండా తన రూపురేఖలను సమూలంగా కోల్పోయి హృదయవిదారకంగా మారింది. ఇది ఊహకందని ఉపద్రవం. మాటల్లో చెప్పలేని, రాతల్లో రాయలేని విషాదం. శనివారం నాటికి వర్షాలు తగ్గుముఖం పట్టినా జనవాసాల్లో నిలిచిపోయిన నీరు బయటకు వెళ్లే మార్గమే కనిపించడంలేదు. చెంబరబాక్కం చెరువు నుండి వెలువడిన నీటితో మునిగిన ప్రాంతాల పరిస్థితి ఇంకా అలాగే ఉంది.

లక్షలాది మంది మూడురోజులుగా మిద్ద్దెలపైనే గడుపుతూ తిండి, నీళ్లు లేక అల్లాడుతున్నారు. ఇళ్లను వదిలిపోతే దొంగలు వచ్చి దోచుకెళతారని భయపడుతున్నారు. ఉన్నదంతా తుడిచిపెట్టుకుపోగా ఆకలి తీర్చుకునేందుకు ఒంటిపై ఉన్న నగలను కుదువపెడుతున్నారు. బంగారు నగ ఖరీదైనదైనా కుదువలో రూ.2వేలు, రూ.3వేలు మించి దక్కడం లేదు. నగరంలోని అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఇంకా పునరుద్ధరించలేదు. చీకట్లో గడపలేక క్యాండిల్ కోసం వెళ్లితే చిన్నపాటి సైజు క్యాండిల్‌ను రూ.60లకు అమ్ముతున్నారు. సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన కుటుంబాలు మేమెక్కడికి వెళ్లాలి, ఎలా నివసించాలని వాపోతున్నారు. వారంరోజులుగా ఒకే వస్త్రంతో కాలం వెళ్లదీస్తున్నామని మహిళలు వాపోతున్నారు.

తడిసిపోయిన పుస్తకాలను, సర్టిఫికెట్లు, యూనిఫారాలను విద్యార్థులు ఆరబెట్టుకుంటున్న దృశ్యాలు కన్నీరుపెట్టిస్తున్నాయి. నగరంలోని అనేక ప్రాంతాల్లో పర్యటించేందుకు వచ్చిన మంత్రులను ప్రజలు ఆగ్రహంతో తరుముకున్నారు. ఇప్పటివరకు వరదల్లో చిక్కుకొని మరణించినవారి సంఖ్య 350 చేరింది. శనివారం సైతం ఆవడి చెరువు నుండి ఒక యువతి మృతదేహం జనవాసాల్లోకి కొట్టుకు వచ్చింది. రక్షించేవారికి కోసం ఎదురుచూస్తూ మునిగిపోయిన ఇళ్లలోనే గడుపుతున్న ప్రజలు, ముఖ్యంగా చిన్నారులు రాత్రి వేళ్లలో కొట్టుకువస్తున్న మృతదేహాలను చూసి వణికిపోతున్నారు. కొట్టుకువచ్చిన అనేకశవాలు రోడ్లపైనే నానుతున్నాయి. ఒకవైపు కుళ్లిపోయిన శవాల నుండి వెలువడే దుర్వాసన, మరోవైపు వరద ప్రవాహంతోపాటూ ఇళ్లలోకి చేరిన చెత్తవల్ల దుర్గంధం మధ్య ప్రజలు గడుపుతున్నారు.

మరిన్ని వార్తలు