పీఎఫ్ ఖాతాలకు ఒకే నంబర్: ఫెర్నాండెజ్

10 Jan, 2014 02:16 IST|Sakshi
పీఎఫ్ ఖాతాలకు ఒకే నంబర్: ఫెర్నాండెజ్

 న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్‌ఓ) తమ ఖాతాదారులకు ఒకేరకమైన యూనిక్ అకౌంట్ నంబర్‌ను ఇవ్వాల్సిన అవసరం ఉందని కార్మిక శాఖ మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్ సూచించారు. అదేవిధంగా బ్యాంకుల తరహాలో నిరంతరాయంగా సేవలందించేందుకు అకౌంటింగ్ విధానాన్ని మరింత మెరుగుపరచుకోవాలని పేర్కొన్నారు. అదేవిధంగా గురువారం ఇక్కడ కార్మిక శాఖ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
 
 ఈపీఎఫ్‌ఓ ఖాతాదారులకు సంబంధించిన అంశాలను భేటీలో చర్చించామని.. ఎలాంటి సమస్యలూ లేకుండా అవినీతిరహిత, పారదర్శకంగా ఈపీఎఫ్‌ఓ పనిచేయాలని ఈ సందర్భంగా సూచించినట్లు ఫెర్నాండెజ్ పేర్కొన్నారు. ఉద్యోగులు వేరొక కంపెనీలకు మారడం, మరో చోటికి వెళ్లడం వంటి పరిస్థితుల్లో కూడా పీఎఫ్ ఖాతా సంఖ్య మారకుండా ఒక్కటే నంబర్ ఉండేలా తగిన విధానాన్ని రూపొందించాలని ఆయన అభిప్రాయపడ్డారు. అదేవిధంగా డబుల్ ఎంట్రీ అకౌంటింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టాలన్నారు. ఈ రెండు కీలక అంశాలతోపాటు ఇతరత్రా చర్యలనూ చేపడితే ఈపీఎఫ్‌ఓ పనితీరు కచ్చితంగా మరింత మెరుగవుతుందని ఫెర్నాండెజ్ పేర్కొన్నారు. కాగా, గతేడాది మార్చి 31 నాటికి దేశంలో మొత్తం 7.43 లక్షల వివిధ కంపెనీలకు సంబంధించిన 8.87 కోట్ల మంది ఉద్యోగులకు ఈపీఎఫ్‌ఓలో సభ్యత్వం ఉంది. సంస్థ మూలనిధి ఇప్పటికే రూ.5 లక్షల కోట్ల స్థాయిని మించింది. ప్రైవేటు పీఎఫ్ ట్రస్ట్‌లనూ కలుపుకుంటే ఈ మొత్తం రూ. 7 లక్షల కోట్లకు పైచిలుకే.
 

మరిన్ని వార్తలు