మోదీ పాలనతో ముప్పు

18 Oct, 2015 05:16 IST|Sakshi
మోదీ పాలనతో ముప్పు

సామరస్యం పునాదులను దెబ్బతీస్తోంది: సోనియా
♦ మత ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్నారు.. అమాయకులను చంపేస్తున్నారు
♦ మోదీని ప్రధానిని చేసిన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసింది కాంగ్రెస్సే
 
 బక్సర్: నరేంద్ర మోదీ ప్రభుత్వం తన సిద్ధాంతాలను ప్రజలపై బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ ఆరోపించారు. ఆమె శనివారం బిహార్‌లోని బక్సర్‌లో పార్టీ ఎన్నికల సభలో ప్రసంగిస్తూ.. ‘మోదీ సర్కారు పాలన ఈ దేశపు ప్రజాస్వామ్య, సామాజిక నిర్మాణానికి ముప్పుగా పరిణమించింది. మత ఉద్రిక్తతలను సృష్టిస్తున్నారు. వదంతులతో అమాయకులను చంపేస్తున్నారు. మేధావులపై దాడులు చేస్తున్నారు.. వారు తమ అభిప్రాయాలను వ్యక్తీకరించే స్వేచ్ఛను నిరాకరిస్తున్నారు. సామాజిక సామరస్యం పునాదులను బలహీనపరచటానికి ప్రయత్నిస్తోంది.

ఇది విచారకరమే కాదు.. లజ్జాకరం కూడా’ అని ధ్వజమెత్తారు. ఆరు దశాబ్దాల కాంగ్రెస్ పాలనపై ప్రధాని మోదీ పదే పదే విమర్శల దాడి చేస్తుండటంపై మండిపడుతూ.. మోదీ ప్రధాని అయ్యేందుకు వీలుకల్పించిన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు తమ పార్టీ పట్టుదలగా కృషి చేసిందన్నారు. ప్రజలకు ప్రత్యేకించి రైతులు, మహిళలు, యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో మోదీ వైఫల్యంపైనా విమర్శలు గుప్పించారు. ఆయన పాలనలో నిత్యావసర ధరలు పెరిగి సామాన్యుడి బతుకు దుర్భరమైందన్నారు. .

 బిహార్‌లో మరిన్ని మోదీ సభలు: బీజేపీ
 న్యూఢిల్లీ: బిహార్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీయే తమకు అతి పెద్ద బలమని.. మిగతా మూడు దశల ఎన్నికల్లో మోదీ మరో 22 సభల్లో ప్రసంగిస్తారని  బీజేపీ నేత ఒకరు పేర్కొన్నారు. బిహార్ ఎన్నికల్లో మోదీపై నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ఆయన సభలను రద్దు చేసినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమన్నారు.  అదనంగా 13 సభలు పెడతామన్నారు. కాగా, ఎన్నికల్లో ఓటర్లకు ఉచిత బహుమతులు ఇస్తామని హామీ ఇవ్వటం ద్వారా బిహార్  బీజేపీ అధ్యక్షుడు సుశీల్‌కుమార్‌మోదీ ఎన్నికల నియమావళిని అతిక్రమించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం తప్పుపట్టింది.

మరిన్ని వార్తలు