ఈసారి ఆరు దేశాలపై..

7 Mar, 2017 02:03 IST|Sakshi
ఈసారి ఆరు దేశాలపై..

సవరించిన వలస నిషేధపు ఉత్తర్వులపై ట్రంప్‌ సంతకం
► ఈ నెల 16 నుంచి అమల్లోకి    
► జాబితా నుంచి ఇరాక్‌ తొలగింపు


వాషింగ్టన్ : పట్టువదలని విక్రమార్కుడిలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అనుకున్నది సాధించారు. అమెరికాలోకి వలసల నిరోధం కోసం... సవరించిన కార్యనిర్వాహక ఉత్తర్వులపై సోమవారం సంతకం చేశారు. తాజా ఉత్తర్వుల ప్రకారం ఆరు ముస్లిం ఆధిక్య దేశాల పౌరుల్ని 90 రోజుల పాటు అమెరికాలోకి అనుమతించరు.

కొత్తగా వీసాల కోసం దరఖాస్తు చేసుకునేవారికి మాత్రమే ఈ ఉత్తర్వు వర్తిస్తుందని, ఇప్పటికే చెల్లుబాటయ్యే వీసాలు కలిగి ఉంటే వారికి అమెరికాలో ప్రవేశం కల్పిస్తామని స్పష్టం చేశారు. సవరించిన ఉత్తర్వుల్లో ఇరాక్‌ పేరును తొలగించడం గమనార్హం. అమెరికా వెళ్లేందుకు వీసా కోసం దరఖాస్తు చేసేవారిని క్షుణ్నంగా తనిఖీ చేసేందుకు ఇరాక్‌ అంగీకరించడంతో ఆ దేశం పేరును జాబితా నుంచి తొలగించారు.  

సవరించిన ఉత్తర్వుల్లో ఏముంది?
సూడాన్ , సిరియా, ఇరాన్, లిబియా, సోమాలియా, యెమెన్ దేశాలకు చెందిన ప్రజల్ని అమెరికాలోకి రాకుండా 90 రోజుల పాటు నిషేధించారు. మార్చి 16 నుంచి కొత్త ఉత్తర్వులు అమల్లోకి వస్తాయి. అలాగే మార్చి 16కు ముందు జారీ చేసిన వీసాల్ని రద్దు చేయరు. జనవరి 27న జారీచేసిన నిషేధపు ఉత్తర్వులతో రద్దైన వీసాల్ని పునరుద్దరిస్తారు. అలాగే చట్ట ప్రకారం శాశ్వత నివాసితులు, గ్రీన్ కార్డుదారులకు ఉత్తర్వులు వర్తించవు. 90 రోజుల్లో నిబంధనల్ని సమీక్షించి... విదేశాల నుంచి ఉగ్రవాదులు, నేరస్తులు అమెరికాలో ప్రవేశించకుండా కొత్త మార్గదర్శకాలు రూపొందిస్తామని పేర్కొన్నారు. శరణార్థులకు ఆశ్రయం కల్పించే పథకాన్ని వచ్చే 120 రోజుల పాటు తాత్కాలికంగా రద్దు చేసున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

అమెరికాలోకి అనుమతించే శరణార్థుల సంఖ్యపై పరిమితి విధించారు. 2017లో 50 వేలకు మించి శరణార్థుల్ని అమెరికాలో అనుమతించరు. పాత ఉత్తర్వుల్లో సిరియా శరణార్థులపై శాశ్వత నిషేధమని పేర్కొనగా సవరించిన దాంట్లో అలాంటి నిబంధన విధించలేదు. శరణార్థులకు ఆశ్రయంపై హోం ల్యాండ్‌ భద్రతా విభాగం, ఇతర భద్రతా విభాగాలు సమీక్షించి... వారు భవిష్యత్తులో అమెరికా భద్రతకు ముప్పు కాకుండా ప్రణాళిక రూపొందిస్తారని కొత్త ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జనవరి 27న ట్రంప్‌ జారీచేసిన నిషేధపు ఉత్తర్వును సియాటిల్‌ డ్రిస్ట్రిక్ట్‌ కోర్టు నిలిపివేసింది. అనంతరం అమెరికా న్యాయశాఖ ఆ తీర్పును అప్పీలు కోర్టులో సవాలు చేయగా అక్కడా చుక్కెదురైంది.

పక్కాగా రూపొందించాం: వైట్‌హౌస్‌
ఈ సారి నిషేధపు ఉత్తర్వులు చాలా పక్కాగా రూపొందించారని వైట్‌హౌస్‌ అధికారులు చెబుతున్నారు. గతంలో వలే అమెరికా విమానాశ్రయాల్లో ఎలాంటి గందరోగళం ఉండదని, చెల్లుబాటయ్యే వీసాలతో ప్రయాణిస్తూ అమెరికా ఎయిర్‌పోర్టులకు చేరుకున్నవారిని కూడా దేశంలోని అనుమతిస్తారని వారు చెప్పారు. నిషేధం విధించిన దేశాల్లో మూడు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుండగా... మరో మూడు దేశాలు ఉగ్రవాదులకు స్థావరంగా ఉన్నాయని అమెరికా అటార్నీ జనరల్‌ జెఫ్‌ సెషన్స్  తెలిపారు.
 

అమెరికన్లూ.. ఆ దేశాలకు వెళ్లొద్దు
ఆరు ముస్లిం దేశాలపై నిషేధం అనంతర పరిణామాలు, ఐసిస్‌ హెచ్చరికల నేపథ్యంలో మధ్య, దక్షిణ ఆసియా దేశాల పర్యటనకు వెళ్లొద్దని అమెరికా ప్రభుత్వం తన పౌరులను కోరింది. ముఖ్యంగా పాకిస్థాన్‌, అఫ్ఘానిస్థాన్‌, బంగ్లాదేశ్‌లకు పోనేపోవద్దని హితవు పలికింది. భారత్‌లోనూ ఐసిస్ చాపకిందనీరులా ఉందని, ఇండియాలో పర్యటించే అమెరికన్లు జాగ్రత్తగా వ్యవహరించాలని విదేశాంగ శాఖ సోమవారం ఒక ప్రకటన చేసింది.