అన్నలొస్తారని...!

16 Jul, 2015 08:24 IST|Sakshi
అన్నలొస్తారని...!

* ముల్లకట్ట బ్రిడ్జిపై రాకపోకలు నిషేధం
* పుష్కరాల్లో ఖాకీల అప్రమత్తత


సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణకు ఛత్తీస్‌గఢ్‌ను కలుపుతూ వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలం ముల్లకట్ట వద్ద గోదావరి నదిపై నిర్మించిన హైలెవల్ బ్రిడ్జిపై మంగళవారం సాయంత్రం నుంచి రాకపోకలను నిషేధించారు. గోదావరి పుష్కరాల సందర్భంగా ఈ బ్రిడ్జిని ప్రారంభిస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు వారం క్రితం ప్రకటించారు.

నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. అధికారికంగా ప్రారంభం కాకపోయినా... ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలం పూసూరు మీదుగా ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లేవారు ఈ బ్రిడ్జి పైనుంచే రాకపోకలు సాగిస్తున్నారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో ఖమ్మం జిల్లా వెంకటాపురం మీదుగా ఆ జిల్లా నుంచి, సమీపంలోని ఛత్తీస్‌గఢ్ ప్రాంతం నుంచి భక్తుల రాకపోకలు మొదలయ్యాయి. పుష్కరాల రెండోరోజు బుధవారం ఈ రాకపోకలు కాస్త పెరిగాయి.

గోదావరి తీరం అవతలివైపు(పూసూరు) ఉన్నవారు బ్రిడ్జిమీదుగా ముల్లకట్ట వైపునకు  వచ్చి గోదావరిలో పుష్కరస్నానం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులు అకస్మాత్తుగా గోదావరి బ్రిడ్జిపై రాకపోకలను నిషేధించారు. గోదావరి అవతలి వైపు నుంచి వచ్చే వారిని పరిశీలించేందుకు ప్రత్యేకంగా పోలీసు ఔట్‌పోస్టును ఏర్పాటు చేశారు. కాగా, నెలలుగా నిర్మాణాలు చేపట్టిన ఘాట్ వద్ద పుష్కర స్నానాలు చేయకుండా నియంత్రించడానికి పెద్ద కారణాలే ఉంటాయని జిల్లా అధికారుల్లో చర్చ జరుగుతోంది. అయితే, మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న కాలంలో ఏటూరునాగారం అటవీప్రాంతం వారికి పెట్టనికోటగా ఉండేది.

ప్రస్తుతం విప్లవ పార్టీల ప్రాభల్యం తగ్గింది. పోలీసులదే పైచేయి కావడంతో ఈ ప్రాంతంలోని మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్‌లోని పలు ప్రాంతాలను షెల్టర్‌జోన్‌గా ఎంచుకొని అక్కడ నుంచి కార్యకలపాలు సాగిస్తున్నారు. పుష్కరాల నేపథ్యంలో... గోదావరి అవతలివైపు నుంచి వచ్చే భక్తులతో కలిసి బ్రిడ్జి మీదుగా మావోయిస్టులు వరంగల్ జిల్లాలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు ఇంటెలిజెన్స్ విభాగం పోలీసు శాఖను అప్రమత్తం చేసినట్లు వసమాచారం.

పుష్కర స్నానం కోసం వచ్చే వారితో మావోయిస్టులు జిల్లాలోకి వచ్చి అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు సులువుగా వెళ్లే అవకాశం ఉంటుందని... భక్తుల రూపంలో వారు వస్తే ఎలాంటి తనిఖీలు చేపట్టేందుకు వీలుం డదని సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే గోదావరిపై బ్రిడ్జి ప్రారంభోత్సవాన్ని ప్రభుత్వం వాయిదా వేసినట్లు తెలిసింది. బ్రిడ్జి నిర్మాణం పూర్తయినప్పటికీ ఈ రహదారిలో అక్కడక్కడ కంకర పోసి వదిలివేయడం పోలీసుల వ్యూహమేననే వాదనలు వినిపిస్తున్నాయి.

రోడ్డు ఇలా ఉంటే ప్రయాణానికి అనుకూలంగా లేదని చెప్పి రాకపోకలను అడ్డుకోవచ్చని పోలీసులు యోచించినట్లు తెలుస్తోంది. పుష్కరాల సమయంలో బందోబస్తు కోసం వేలాది మంది పోలీసులు విధి నిర్వహణల్లో పాలుపంచుకుంటున్నారు. ఈ సమయంలో బ్రిడ్జిపై స్వేచ్ఛగా రాకపోకలు సాగిస్తే... భక్తుల రూపంలో మావోయిస్టులు దాడులకు దిగే అవకాశాలు ఉందని పోలీసులకు సమాచారం వచ్చినట్లు చెబుతున్నారు.

ఈ పరిస్థితిని నివారించేందుకే బ్రిడ్జిని మూసివేసినట్లు కనిపిస్తోంది. వర్షాలు పడి ముల్లకట్ట వద్ద గోదావరిలో నీరు బాగా చేరి పుష్కరస్నానాలు జరిగినా బ్రిడ్జిపై రాకపోకలు నిషేధించాలనే విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఆమోదం పొందినట్లు తెలిసింది.
 
పోలీస్ ఔట్‌పోస్టు ఏర్పాటు...
ముల్లకట్ట బ్రిడ్జి వద్ద రెండు రోజుల క్రితం అవుట్‌పోస్టును ఏర్పాటు చేశారు. సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్) పోలీసులు 24 గంటలు ఈ బ్రిడ్జి వద్ద కాపలా కాస్తున్నారు. వీరికి అదనంగా పుష్కరఘాట్ సమీపంలో మరో క్యాంపును ఏర్పాటు చేశారు. పుష్కరాలు ముగిసే వరకు ఎలాంటి రాకపోకలను అనుమతించబోమని ఔట్‌పోస్టులో ఉన్న పోలీసులు చెబుతున్నారు. దీంతో పుష్కరాల కోసం వచ్చే ఖమ్మం జిల్లా వాసులు నిరాశతో వెనుదిరిగిపోతున్నారు.

మరిన్ని వార్తలు