ఓ పుస్తకాన్ని పూర్తిగా చదవడం ఎలా?

18 Oct, 2015 14:34 IST|Sakshi
ఓ పుస్తకాన్ని పూర్తిగా చదవడం ఎలా?

సాధారణంగా విద్యార్థులకు పుస్తకాలు చదవడం ఒక సవాల్గా అనిపిస్తుంటుంది. బోర్ గా ఫీలవుతుంటారు. ఇప్పుడు ఈ పుస్తకం చదవాలా అని అనుకుంటారు. ఒక వేళ చదివినా మొక్కుబడిగా పరీక్షల కోసమే అసంపూర్ణంగా చదివి పక్కకు పడేస్తారు. ఇది కేవలం విద్యార్థులకే కాకుండా పెద్దవారికి కూడా వర్తిస్తుంది. ఎంతోమంది విలువైన పుస్తకాలు కొనుగోలు చేస్తారు కానీ వాటిని పూర్తిస్థాయిలో శ్రద్ధతో అస్సలు చదవరు. అయితే ఆ సమస్యకు ఓ పరిష్కారం కూడా ఉంది. అసలు పుస్తకాన్ని ఎలా చదవాలో, అందులో విషయపరిజ్ఞానం ఎలా నేర్చుకోవాలో పరిశీలించి కొందరు అధ్యయనకారులు ఏడు రకాల చిట్కాలు చెప్పారు. అవేంటంటే..

1.రోజు ఎన్ని పేజీలు చదువుతామో ముగించే సమయానికి ఉన్న పేజిలో తప్పకుండా ఒక గుర్తు పుస్తకం వెలుపలికి కనిపించేలా పెట్టుకోవాలి.

2.ఒక సారి ఒక అంశం చదివినప్పుడు అది అర్థం కానట్లయితే.. అర్ధం అయ్యేవరకు మరోసారి చదవాలి. అది మంచి అలవాటు కూడా.. దీనిని  జ్ఞాపక లేమి సమస్యగా అస్సలు భావించవద్దు.

3. ముఖ్యమైన సమాచారం రాత్రి వేళలో ఎట్టి పరిస్థితుల్లో చదువరాదు. సాయంత్రగానీ, రాత్రి వేళగానీ తేలికైన సాధారణ అంశాలు పఠించడం చాలా మంచిది. వేకువ జాముల్లో సాంకేతిక పరమైన అంశాలను, క్లిష్టమైన అంశాలను చదవాలి.

4.చదువుకునేందుకు కూర్చునే ప్రదేశం కూడా చాలా అనుకూలంగా ఉంటే ఇంకా మంచిది. లేదంటే ఏకాగ్రత లోపిస్తుంది.

5.ఒకసారి చదివిన అంశాన్ని గుర్తుంచుకోలేకపోతున్నట్లయితే అందులోని కీ పాయింట్స్ను ఒక్కొక్కటిగా తప్పకుండా ఓ క్రమ పద్ధతిలో నోట్స్ రాసుకోవాలి.

6.పుస్తకంలో ఏ అంశాన్ని చదువుతున్నారో అందులో పూర్తిగా లీనమవ్వాలి. అంశంలో నువ్వు భాగస్వామ్యం అయినట్లుగా నువ్వే అందులో తిరుగుతున్నట్లుగా ప్రదేశాలను సందర్శిస్తున్నట్లుగా భావించి పుస్తకంలో మునిగిపోవాలి.

7.ఒకసారి ఓ పుస్తకాన్ని చదవాలని నిర్ణయించుకొని కొంతమేర చదివి తిరిగి బోర్ గా అనిపించి పక్కకు పడేసినప్పుడు.. చదవలేకపోయానే అని బాధపడకుండా మనస్పూర్తిగా ఆ పుస్తకానికి క్షమాపణ చెప్పగలిగి ఎంత ఆలస్యం అయినా ఆ పుస్తకాన్ని చదవాలని భీష్మించుకోవాలి.

ఇలా చేయడం ద్వారా పుస్తక పఠనం తేలికవడమే కాకుండా.. అందులోని సారాంశం కూడా మనసుకుపట్టేసి పుస్తక పఠనం లేకుంటేనే ఏదో వెలితిగా అనిపించే స్థితికి వస్తారు. ఆ స్థితి ఎప్పుడు మీలో ఉంటే.. అప్పుడు జ్ఞాన సముపార్జనకు మీరు సంసిద్ధులైనట్లు.

మరిన్ని వార్తలు