భద్రతలో నేవీది కీలకపాత్ర

5 Dec, 2013 03:54 IST|Sakshi

 హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్ గుప్తా
 సాక్షి, హైదరాబాద్: శత్రువుల నుంచి దేశాన్ని కంటికిరెప్పలా కాపాడడంలో భారత నావికాదళం కీలకపాత్ర పోషిస్తోందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతి సేన్‌గుప్తా కొనియాడారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నావిళాదళం సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటోందని, యుద్ధవ్యూహాలు, శత్రుదేశాల కదలికల విషయంలో అనుక్షణం అప్రమత్తంగా ఉంటోందని ప్రశంసించారు. నావికాదళ దినోత్సవం సందర్భంగా బుధవారం బొల్లారంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జస్టిస్ గుప్తా ముఖ్యఅతిధిగా హాజరై ప్రసంగించారు. వ్యూహాత్మక యుద్ధరీతులను అభివృద్ధి చేసుకోవడంతో పాటు నౌకా వాణిజ్య రంగం పురోభివృద్ధికి, సముద్ర దొంగల కట్టడిలో నౌవికాదళం ముందుందని తెలిపారు.
 
1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో నేవీ కీలక పాత్ర పోషించిందని, చిన్న చిన్న నౌకలతో వ్యూహాత్మకంగా కరాచీ నౌకాశ్రయంపై దాడులు చేసి విజయం సాధించిందని చెప్పారు. ఆ యుద్ధం సమయంలో తాను కళాశాల విద్యార్థిగా ఉన్నానని, నావికాదళ విజయగాధను రేడియో ద్వారా విని సంబరాలు జరుపుకొన్నామన్నారు. దేశరక్షణ విషయంలో భూతలం కంటే సముద్ర స్థావరాల పరిరక్షణకే ప్రస్తుతం ప్రాబల్యం పెరిగిందని తెలిపారు. 1971 యుద్ధంలో విజయానికి ప్రతీకగా, అమరవీరుల సంస్మరణార్థం నావికాదళ దినోత్సవాన్ని ఏటా నిర్వహిస్తామని నేవీ హైదరాబాద్ విభాగం ఇన్‌ఛార్జ్, రియర్ అడ్మిరల్ కాళిదాస్ శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా నావికాదళ దినోత్సవం వారోత్సవాల బ్రోచర్‌ను జస్టిస్ గుప్తా ఆవిష్కరించారు. కార్యక్రమంలో నావికాదళం అధికారులు, 1971లో పాల్గొన్న నావికాదళం పూర్వ అధికారులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు