వీసా సమస్యలపై యూఎస్తో చర్చించాం

30 Nov, 2016 15:56 IST|Sakshi
వీసా సమస్యలపై యూఎస్తో చర్చించాం
విజయసాయిరెడ్డి ప్రశ్నకు నిర్మలా సీతారామన్ జవాబు

 
ఐటీ పరిశ్రమలో నెలకొన్న వీసా సమస్యలను 2016 అక్టోబర్ 20న ఢిల్లీలో జరిగిన ట్రేడ్ పాలసీ ఫోరమ్ మీటింగ్లో అమెరికా వాణిజ్య ప్రతినిధి, అంబాసిడర్ మిఖాయిల్ ఫ్రోమన్‌ దృష్టికి తీసుకెళ్లామని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బుధవారం రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు సమాధానంగా ఆమె ఈ విషయాన్ని చెప్పారు.  2015 డిసెంబర్ 18న అమెరికా అధ్యక్షుడు ఆమ్నిబస్ స్పెండింగ్ బిల్లుపై సంతకం చేశారని, దీంతో ఎల్-1, హెచ్-1బీ వీసాల సప్లిమెంట్ ఫీజులు రెట్టింపైనట్టు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ పెంపుతో 50:50 కంపెనీలు ఎల్-1 వీసా కోసం 4వేల డాలర్లు(సమారు రూ.2,60,00), హెచ్-1బీ వీసా కోసం 4,500 డాలర్లు(సుమారు రూ.2,92,500) అదనంగా జమచేయాల్సి వస్తుందన్నారు.
 
ఇతర అన్నిరకాల రుసుములకు ఇవి అదనమనీ, 2025 సెప్టెంబర్30 వరకు ఈ రుసుములు అమల్లో ఉంటాయని చెప్పారు.  జెనీవాలో జరిగిన ప్రపంచ వాణిజ్య సదస్సులోనూ అమెరికా వీసా ఫీజు పెంపు గురించి భారత్  ప్రస్తావించిందని తెలిపారు. ఐటీ పరిశ్రమలో వీసా వల్ల తలెత్తిన సమస్యల గురించి అమెరికా ప్రభుత్వంతో చర్చించామన్నారు. కాగా ఐటీ పరిశ్రమలో నెలకొన్న వీసా సమస్యలపై ప్రభుత్వం అమెరికా వాణిజ్య ప్రతినిధి మిఖాయిల్ ఫ్రోమన్‌తో డైరెక్టగా చర్చిందా, ఈ చర్చలో అమెరికా ట్రేడ్ ప్రతినిధి స్పందన ఎలా ఉంది అని విజయసాయి రెడ్డి నేడు రాజ్యసభలో ప్రశ్నించారు. 
మరిన్ని వార్తలు